30 జూన్, 2012

విక్రమసింహుడు

మహేంద్రపుర రాజ్యాన్ని విజయసింహుడు పరిపాలించేవాడు. అతను ప్రజలను తన బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పాలించేవాడు. విజయ సింహుని తరువాత అతని కుమారుడు విక్రమసింహుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. విక్రసింహుడు కూడా తండ్రి లాగా పరిపాలించాలనుకున్నాడు. కాని మంత్రి, తక్కిన అధికారులు అతనికి సహకరించేవారు కాదు. 

ఒకరోజు రాత్రి నా తండ్రి ఎంత ప్రజారంజకంగా పరిపాలించాడు. నేను అలా పరిపాలిద్దాం అనుకుంటే మంత్రి, అధికారులు సహకరించడం లేదే?? ప్రజలకు నా మీద నమ్మకం పోతుందేమో. నేను ఈ బాధ్యత మోయలేనేమో, ఎక్కడికైనా దూరంగా పారిపవాలి!" అని మనసులో అనుకుంటూ మంచం మీద నుంచి లేచాడు. రాజభవనం ద్వారం దాటి బయటకు వచ్చాడు. "ఎంత దూరం పారిపోగలను? నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను గుర్తుపడతారు," అని మళ్లీ తన మనసులో అనుకుని, తిరిగి మందిరానికి వచ్చాడు. అలా కొంచెం సేపు ఆలోచించి, చివరికి రాజభవనం మీద నుండి దూకి చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ప్రజలను బాగా పరిపాలించలేకపోతున్నాననే బాధ అతను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. 

విక్రమసింహుడు రాజభవనం మీదకి చేరుకున్నాడు. ఏదో ఆలోచిస్తూ భవనం గోడ దగ్గర నిలబడ్డాడు. అక్కడ అతనికి ఒక చీమ తన నోటితో ఒక చక్కెర పలుకును కరుచుకొని గోడ వారగా వెళ్లడం కనిపించింది. ఆ చీమ అలా వెళుతూ గోడ పగుళ్లలో ఉన్న తన నివాసంలోకి వెళ్లిపోయింది. అది చూసిన విక్రమసింహుడు, ఔరా! ఈ చీమను చూడు. ఈ రాజభవనంలో ఎక్కడో మూలన ఉన్న వంట గది నుండి పంచదార పలుకుని కరుచుకొని, మూడు అంతస్తులు ఉన్న ఈ రాజ భవనం మీదకు చేరింది. ఒక చిన్న చీమనే ఇంత పైకి రాగలిగితే, దాని కన్నా ఎన్నో రెట్లు పెద్దగా, బలంగా ఉన్న నేను నా ప్రజల సంక్షేమం కోసం పాటుపడలేనా? అనుకున్నాడు. ఆ ఆలోచనతో అతనిలో ఉన్న నిరాశ పటాపంచలయ్యింది. చనిపోదాం అనుకున్న విక్రమసింహుడు తన మనస్సు మార్చుకుని, కొత్త ఉత్సాహంతో తన మందిరానికి చేరుకున్నాడు. అప్పటి నుండి మంత్రులను, అధికారులను తనకు సహకరించేలా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించసాగాడు.


20 జూన్, 2012

సుకుమార రాకుమారి


ఒక రాణి దేశంలోకెల్లా అతి పెద్ద సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉండేది. ఆమె ఏకైక పుత్రుడే ఆ రాజ్యానికి కాబోయే మహారాజు. యువరాజు ఆరడుగుల ఎత్తులో ఎంతో అందంగా, సుకుమారంగా ఉండేవాడు. అతనికి యుక్త వయసు వచ్చింది. పెళ్ళి చెయాలని భావించింది రాణి. కాబోయే కోడలు కూడా చాలా అందంగా, సుకుమారంగా ఉండాలని కోరుకుంది. 

యువరాజుకి ఎన్నో రాజ కుటుంబాల నుండి సంబంధాలు వచ్చాయి. కాని ఆ రాజకుమార్తెలెవరూ రాణి కోరుకున్న లక్షణాలకు తగ్గట్టుగా లేరు. రాణి ఎన్నో సంబంధాలను కాదన్నదనే వార్త దేశమంతటా పొక్కింది. అది విన్న ఒక అందమైన రాకుమారి... రాణి గారిని కలుసుకోవాలని నిర్ణయించుకుంది. రాణిగారు ఎలాంటి రాకుమారిని తన కోడలుగా కోరుకుంటున్నారో తెలుకోవాలని అనిపించింది. అందుకని రాణి గారిని వ్యక్తిగతంగానే వెళ్ళి కలవాలనుకుంది. 

సైనికులు ద్వారా తన రాకను రాణి గారికి తెలియజేసింది రాకుమారి. ఆమె కోసం రాణి తన భవనంలోని అందమైన గదిని సిద్ధంగా ఉంచిది. రాకుమారి రాణి గారి భవనానికి రాగానే రాణిగారి పరిచారికలు ఆమెను ఆ అందమైన గదిలోకి తీసుకు వెళ్ళారు. రాకుమారి ఎంత సున్నితమైనదో తెలుసుకోవాలని గదిలోని మంచం మీద కొన్ని గులక 
రాళ్లు పెట్టి, వాటి మీద ఏడు పరుపులు పరిచారు. రాత్రి కాగానే ఆ మంచంపై పడుకున్న రాకుమారికి ఆ  గులక రాళ్ల వల్ల అస్సలు నిద్ర పట్టలేదు. 

ఆమె వీపు మీద ఎర్రని మచ్చలు ఏర్పడ్డయి. ఒళ్ళంతా కంది పోయింది. రాకుమారిని చూసేందుకు వచ్చిన రాణి కందిపోయిన ఆమె ఒంటిని చూసి ఆమె అత్యంత సున్నితమైనదని, తనకు కోడలిగా, తన కొడుకుకు సరైన భార్యగా రాణిస్తుందని నిర్ణయించుకుంది.

19 జూన్, 2012

బ్రహ్మరాక్షసుడు



 భీకరారణ్యంలో ఓ మఱ్ఱిచెట్టు. దాన్ని ఆశ్రయించి ఎన్నో భూత ప్రేత పిశాచాలు. అక్కడే ఓ బ్రహ్మరాక్షసుడు తన నివాసాన్ని ఏర్పరచుకొన్నాడు. అడవిలో ఎన్నో ఔషధాలు విరాజిల్లడం మూలానేమో వాటి గాలి సోకి సోకి ఆ బ్రహ్మరాక్షసుడికి కాలక్రమేణా తాను ఆ వికృతాకారము నుండి విముక్తి పొందాలనే సద్భావం కలిగింది. ఎవరైనా తనకు సన్మార్గం చూపేవాళ్ళుంటారేమోనని అన్వేషిస్తుంటే శాపగ్రస్తురాలైన ఓ పులి దైవవశాత్తు అటుగావచ్చింది. ఆ శార్దూలరాజు కళ్ళలోని నైర్మల్యాన్ని గమనించి ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు “ఓ వ్యాఘ్రేశ్వరా! నాయందు దయవుంచి నాకీ జన్మ నుండి విముక్తి కలిగే మార్గం చెప్పగలవా”?

“పూర్వ జన్మల దుష్కర్మలే ఈ వికృత జన్మలకు హేతువు. నీవు పూర్వ జన్మలో సద్బ్రాహ్మణునిగా పుట్టియు నీకు వచ్చిన విద్యను ఎవ్వరికీ అందించకుండా సమాజశ్రెయస్సుకు వినియోగించకుండా నీవద్దనే ఉంచుకున్నావు. ఆ దోషకారణముగా నీవిప్పుడు బ్రహ్మరాక్షసుడవైనావు. ఏదైనా సత్కర్మ చేస్తే నీకు విముక్తి కలుగుతుంది” అని ఆ పులి హితవు చెప్పింది. ఆ సత్యభాషణములు విని ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు “జంతువై ఇంత జ్ఞానం ఎలా సంపాదించావు”? “నేను సద్గురువును అధిక్షేపించడం వలన ఈ దేహం పొందాను. ఎదైనా సత్కార్యం చేదామని ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ రూపాన్ని చూసే ఎవరూ నాదెగ్గరకైనా రవటంలేదు. ఇప్పుడు నీవేదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో నీవు నీచేత సత్కర్మ చేయించినందుకు నేను ఇద్దరం బైటపడతాం” అని పులి అన్నది.

సత్కర్మ చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసునకు ఓ ఆగంతకుడు కనిపించాడు. తనని ఆ రూపంలో చూస్తే భయపడతాడని ఓ సాధువు వేషంలో ఆ బాటసారి వద్దకు పోయి యోగ క్షేమాలు విచారించాడు. ఆ పాంథుడిలా తన విచారాన్ని వ్యక్త పఱచాడు “ఒక 100 వరహాలు కావాలి. ఎలా సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నాను”. ఆ రత్నాలతో ఏమి చేస్తావని ఆత్రుతగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు. “రాజకుమారిని పెళ్ళాడాలి” అన్నాడు ఆగంతకుడు. పెళ్ళికి రత్నాలెందుకని ప్రశ్నించగా “ఆ ఎక్కడో హిమవత్ పర్వతాల దగ్గర ఏవో రత్నాలున్నాయిట. అవి తెస్తేగాని పెళ్ళిచేయరట. ఈ దండకారణ్యంలో ఎందరో యోగులు బ్రహ్మరాక్షసులు ఉంటారని విని వాళ్ళ ద్వారా ఆ రత్నాలు సంపాదిద్దాం అని ఇక్కడ కొచ్చాను” అన్నాడు బాటసారి.

“ఏ రాజకుమారి? అవంతీ రాజకుమారి ఆ?” అని ప్రశ్నించిన బ్రహ్మరాక్షసునితో “అవును. నీకెలా తెలుసు” అని అన్నాడు బాటసారి. “అది వీరశుల్కం. వరుని ధైర్యసాహసాలు వీరత్వం పరీక్షించడానికా నియమం. పైగా వారడిగినది 50 రత్నాలేకదా”? అన్నాడు బ్రహ్మరాక్షసుడు. “వాళ్ళకంతా ఇచ్చేస్తే మరి నా భార్యాపిల్లలకో” అన్నాడు బాటసారి.

ఓరి దుర్మార్గుడా! రాజ్యాన్ని రాజకుమారిని మోసగిద్దాం అనుకున్నావా! నీలాంటి దేశద్రోహికి సహాయపడి నేనింకా పాపం మూట కట్టుకోలేను అని అనుకొని అమాంతంగా ఆ బాటసారిని మ్రింగివేశాడు బ్రహ్మరాక్షసుడు. తత్‍క్షణమే పులిగాశాపం పొందిన శిష్యుడు నరరూపంలో ప్రత్యక్షమై “మిత్రమా! దుష్టుడైన దేశద్రోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన నిన్ను నన్ను ఆ ధర్మదేవుడు కరుణించినాడు. రా” అంటున్న నూతన మిత్రునితో దివ్యలోకాలు చేరుకున్నాడు బ్రహ్మరాక్షసుడు.


10 జూన్, 2012

సాటిలేని విలుకాడు నసీరుద్దీన్


ఒక సారి ఎవరో నసీరుద్దీన్ సాటిలేని విలుకాడు అంటుంటే, పాదూషా విన్నాడు. దాంతో ఆయనకి చాలా కుతూహలంగా అనిపించింది. సరే అని నసీరుద్దీన్ ని పిలిపించాడు. వాళ్ళు ఇద్దరూ నడుచుకుంటూ వెళుతున్నారు. ఇంతలో ఒక చెట్టు కనిపించింది. వెంటనే పాదూషా నసీరుద్దీన్ ని ఆ దూరంగా కనిపిస్తున్న చెట్టుని గురి చూసికొట్టమని కానీ 3 మాత్రమే అవకాశాలు అని చెప్పాడు. నసీరుద్దీన్ మొదటి బాణం పొరపాటున గురి తప్పింది. పాదూషా వెటకారంగా నవ్వాడు.

"నవ్వకండి, ప్రభూ! యిది తమరి నైపుణ్యం” అన్నాడు నసీరుద్దీన్. తరవాత రెండో బాణం కూడా గురితప్పింది. పాదూషా మళ్ళీ నవ్వాడు."నవ్వద్దు, ప్రభూ!యిది తమరి మంత్రుల నైపుణ్యం” అన్నాడు నసీరుద్దీన్. తరవాత మూడో బాణం మాత్రం సూటిగా వెళ్ళి కాండానికి గుచ్చుకుంది. 

నసీరుద్దీన్ వంగి సలామ్ చేస్తూ “వినయంగా చెప్పాలంటే యిది నసీరుద్దీన్ నైపుణ్యం” అన్నాడు. పాదూషా గతుక్కుమన్నాడు. గతుక్కుమన్నది నసీరుద్దీన్ చివరి మాటకి కాదు. `ఇందాకటి దాకా నసీరుద్దీన్ తనని, తన మంత్రులని అన్నప్పుడు తను నసీరుద్దీన్ కొట్టలేడు అన్న ఉద్దేశంతో పట్టించుకోలేదు కానీ తన మీద నసీరుద్దీన్ విసిరిన చలోక్తులకి ఎవరైనా నవ్వుతారేమోనని.’

9 జూన్, 2012

నసీరుద్దీన్ కథలు


అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే దేశం. ఆ దేశాన్ని తైమూర్ పాలిస్తుండేవాడు. ఇతడు పేరుకే రాజుగానీ, పరమ పిసినారి, స్వార్ధపరుడూను. అతడికి ఈర్ష్యాసూయలు కూడా ఎక్కువే.  ఎప్పుడూ నసీరుద్దీన్ నుండి సలహాలు తీసుకొంటాడే గానీ ఏనాడు మంచి పారితోషికం ఇవ్వడు.నసీరుద్దీన్ తనకి ఒక గుర్రం కావాలని తైమూర్ ని అర్ధించాడు. పిసినారి తైమూర్ కి నసీరుద్దీన్ కి గుర్రాన్నివ్వడం ఇష్టంలేదు. ఇవ్వక తప్పేట్లు లేదు.

దాంతో ఓ ముసలి చచ్చు గుర్రాన్ని నసీరుద్దీన్ కిచ్చాడు. ఇలా ఉండగా ఓ రోజు తైమూర్ తన పరివారంతో కలిసి వేటకి బయలుదేరాడు. నసీరుద్దీన్ కూడా వాళ్ళ వెంట ఉన్నాడు. అందరూ గోబీ ఎడారి చేరారు. ఇంతలో గాలి, దుమ్ము రేగాయి. మేఘాలు కమ్ముకొచ్చాయి. అంతలోనే ఉరుములు మెరుపులతో కుంభవృష్టి మొదలయ్యింది.

తైమూర్, అతని సైనికులు ఎక్కిన గుర్రాలు బలంగా ఉన్నాయి. ఆ గుర్రాలు మీద వాళ్ళంతా ఒక్క ఉదుటున దౌడు తీయిస్తూ వెనక్కి ఊళ్ళోకి మళ్ళారు. అయినా గానీ ఊరు చేరే లోగా తడిసి ముద్దయ్యారు. నసీరుద్దీన్ గుర్రం ముసలిది, ఒక్కచిక్కినది అయిన చచ్చు గుర్రంమయ్యే.గాలి మొదలవ్వగానే అది అడుగు తీసి అడుగు వెయ్యకుండా, ఉన్న చోటునే బిర్ర బిగిసినట్లు నిలబడి పోయింది. ఎంత అదిలించినా కదల్లేదు, మెదల్లేదు. చేసేది లేక నసీరుద్దీన్ గుర్రం దిగాడు. వర్షం మొదలయ్యేలోగా బట్టలు విప్పి ఆ గుర్రం క్రింద దాచాడు. ఎడారిలో తడుస్తూ అలాగే నిలబడ్డాడు. 

వర్షం తగ్గాక ఒళ్ళార్చుకొని, గుర్రం క్రింద దాచిన దుస్తులు తొడుక్కొని గుర్రమెక్కి ఊళ్ళోకి వచ్చాడు. కొంచెమైనా తడవకుండా, పొడి దుస్తులతో వచ్చిన నసీరుద్దీన్ ని చూచి తైమూర్ ఆశ్చర్యపోయాడు. "అదేమిటయ్యా నసీరుద్దీన్. ఎంత వేగంగా వచ్చినా మేం ముద్దగా తడిసిపోయాము. నువ్వెలా తడవకుండా వచ్చావు? ఎక్కడున్నావు ఇప్పటి దాకా?" కుతుహలంగా అడిగాడు తైమూర్.

"అహా..హా! ఏం చెప్పను హూజూర్! అద్బుతం. అమోఘం.” ఇంకా పరవశంలోనే ఉన్నట్లు నటిస్తూ మైమరుపుగా అన్నాడు నసీరుద్దీన్. తైమూర్ కుతుహలం మరింత పెరిగిపోయింది."ఏమిటి అద్భుతం? త్వరగా చెప్పవయ్యా!” అంటూ తొందర పెట్టాడు తైమూర్. "హూజూర్! ముందుగా నేను మీకు కృతఙ్ఞతలు చెప్పుకోవాలి” అన్నాడు నసీరుద్దీన్. "ఎందుకు?" ఆత్రంగా అడిగాడు తైమూర్."ఇంత అద్భుతమైన గుర్రాన్ని నాకు ఇచ్చినందుకు హూజూర్!” మరింత వినయంగా అన్నాడు నసీరుద్దీన్. అయోమయంగా చూశాడు తైమూర్. 

"నన్ను వివరంగా చెప్పనివ్వండి హూజూర్! గాలీ వానా మొదలవ్వగానే మీరంతా వేగంగా ఊరి వైపు దౌడు తీశారా? సరిగ్గా అప్పడే నేనూ నా గుర్రాన్ని అదిలించాను. అప్పుడు జరిగింది అద్భుతం! మీరిచ్చిన గుర్రం సామాన్యమైనది కాదు హూజూర్! అది ఆకాశంలో ఎగర గలదు. వాన మొదలు కాగానే అది నన్ను మబ్బుల్లోకి తీసికెళ్ళింది. ఎంత పైకంటే అప్పుడు కురుస్తోన్న మేఘం కంటే పైకి. ఆ మేఘల్లోని నందనవనం లాంటి తోటకి తీసికెళ్ళింది. అక్కడ ఎంత బాగుందనుకొన్నారు హూజూర్! పరిమళాలు వెదజల్లే పూలు, మధురమైన ఫలాలు, పక్షులు కిలకిలా రావాలు. అక్కడ ఎంచక్కా విహరించాను. తిరిగి రావాలనే అనిపించలేదు. కానీ మీరు నాగురించి వాకబు చేసి, నేనేమయ్యానో అని కంగారు పడతారని వచ్చేసాను” భావాన్ని అభినయీస్తూ, దృశ్యాన్ని కళ్ళకి కట్టినట్లు వివరించాడు నసీరుద్దీన్. 

తైమూర్ కి మతిపోయింది.అంత అద్భుతమైన గుర్రాన్ని తేరగా నసీరుద్దీన్ కి ఇచ్చేసినందుకు ఏడుపొచ్చింది. ఎలాగైనా ఆ గుర్రాన్ని తిరిగి పొందాలని “నసీరుద్దీన్. నీకిచ్చిన గుర్రం ముసలిది. ఆకాశంలో ఎగర గలదేమో గానీ, మామూలు సమయాల్లో వేగంగా పరిగెత్తలేదు. అది నాకు తిరిగి ఇచ్చేయ్. నీకు మరో మంచి గుర్రం ఇస్తాను” అన్నాడు.

నసీరుద్దీన్ నసుగుతూ “హూజూర్! ఇచ్చిన వస్తువు తిరిగి తీసికొన్నారనీ చెడ్డపేరు మీకు వస్తుందేమో! నా మూలంగా మీకు చెడ్డపేరు రావడం నాకిష్టం లేదు” అన్నాడు.నసీరుద్దీన్ ని బ్రతిమాలి బామాలి, ఎదురు డబ్బిచ్చి, మరో మంచి గుర్రాన్నిచ్చి నసీరుద్దీన్ దగ్గరున్న ముసలి చచ్చు గుర్రాన్ని తిరిగి కొనుక్కున్నాడు తైమూర్. 

మర్నాడు వాళ్ళు మళ్ళీ వేటకి వెళ్ళారు. గోబీ ఎడారి లోకి ప్రవేశించగానే, ముందు రోజులాగే ఆ రోజూ గాలీ వానా వచ్చాయి.మంచి బలమైన గుర్రం ఎక్కిన నసీరుద్దీన్ ఆఘామేఘాల మీద ఊళ్ళోకి దౌడాయించాడు. తైమూర్ ఎక్కిన ముసలి చచ్చూ గుర్రం, గాలీ వానా మొదలవ్వగానే శిలా విగ్రహం లాగా నిలబడిపోయింది. తైమూర్ దాన్ని కొరడాతో కొట్టాడు. పిడిగుద్దులు గుద్దాడు. బండతిట్లు తిట్టాడు. తన్నాడు. ఉహూ! ఏం చేసినా ఆ ముసలి గుర్రం అడుగు తీసి అడుగు వేయ్యలేదు. వర్షంలో ముద్దగా తడిసిపోయాడు తైమూర్. 

ఆ తడిసిన దుస్తులతోనే వర్షం తగ్గాక ఊళ్ళోకి తిరిగి వచ్చాడు. దాంతో బాగా జలుబు చేసి జ్వరం వచ్చింది. ఆ రాత్రి నీరసంగా పక్కమీదకి వాలుతున్నప్పుడు అర్ధమయ్యింది తైమూర్ కి తను, ముసలి గుర్రాన్నిచ్చినందుకే నసీరుద్దీన్ తనకి గుణపాఠం నేర్పాడని. అంతే! కన్నంలో తేలు కుట్టిన దొంగలా కిక్కురమన కుండా ఉండిపోయాడు.

బ్రాహ్మణబాలుడి కథ


పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు తంత్రవర్మ. ఇతడు కాస్తభోగలాలసుడూ, మరికాస్త స్వార్ధపరుడూనూ. అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడి మంత్రులు కొంత బుద్ధిమంతులు. అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతూ ఉండేది.

ఇలా ఉండగా, ఓ రోజు, ఈ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. మధ్యాహ్నం వరకూ జంతువుల వేటలో గడిపాడు. ఇక విశ్రాంతి తీసికొందామని నది ఒడ్డు చేరాడు. అక్కడ అతడి కొక అందమైన యువతి కన్పించింది. ఆమెని చూడగానే రాజుకి కన్ను చెదిరింది. మెల్లిగా ఆమెని చేరి “ఓ సుందరీ! నీవెవ్వరు? ఇంత నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు?” అనడిగాడు. అందుకామె అలవోకగా ఓ చిరునవ్వు నవ్వి “రాజా! నేను ముని కన్యను! ఈ అరణ్యంలోనే మా నివాసం” అంది.

రాజు ఆమె పైన తనకు గల మోహన్ని వ్యక్తపరిచాడు. ఆమె “రాజా! నేను ముని వృత్తిలో నున్నదానిని. మీరు దేశాన్నేలే మహారాజులు. మీలాంటి వారు మాలాంటి వారాని కోరదగునా? కానీ, కోరి మీరు నన్నడిగినప్పడు కాదనడం సరికాదు. నాతల్లిదండ్రులను అర్ధించి నన్ను పొందండి” అంది. వీరిలా మాట్లాడు కొంటూ ఉండగా, హఠాత్తుగా వాళ్ళ ముందో రాక్షసుడు ప్రత్యక్షమయ్యడు. చెట్టంత రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ఒక్కవుదుటున రాజుని గుప్పిట బంధించి మ్రింగబోయాడు. తంత్రవర్మ ఒక్కపెట్టున పెద్దగా ఏడుస్తూ “వద్దు. వద్దు! నన్ను చంపవద్దు” అన్నాడు.“ఒక్క షరతు మీద నిన్ను వదిలేస్తాను” అన్నాడు రాక్షసుడు. “చెప్పు. తప్పక నెరవేరుస్తా” అన్నాడు రాజు. "నీరాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బాలుణ్ణి, నీకు బదులుగా నాకు సమర్పించేటట్లయితే, నిన్నువదిలేస్తాను" అన్నాడు రాక్షసుడు.

రాజు తంత్రవర్మ సరేనన్నాడు. రాక్షసుడు వదిలిందే క్షణం, రాజధానికి పరుగెత్తాడు. సైనికుల్ని పంపి రాజ్యంలో పేదవారి గురించి ఆరా తీయించాడు. చివరికి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ పేద వారింట భార్యా,భర్త, ముగ్గురు కొడుకులూ ఉన్నారు. వారు ఆపూట కూటికి కూడా లేని పేదవారు. రాజు బ్రాహ్మణ దంపతలకి పెద్దఎత్తున డబ్బాశ పెట్టి వారి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని తనకి ధారాదత్తం చెయ్యమని అడిగాడు. బ్రాహ్మణుడు "రాజా! నాపెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం. రేపు నేను ఛస్తే నాకు తలకొరివి పెట్టవలసింది వాడే కదా! అందుచేత నాపెద్దకొడుకుని ఇవ్వను. మిగిలిన ఇద్దరిలో నీకు కావలసిన వాణ్ణి తీసుకుపో!" అన్నాడు.

అంతలో అతడి భార్య "మహారాజా! నాచిన్నకొడుకంటే నాకు తీరని ముద్దు. అంతే గాక రేపు నేను ఛస్తే, నాకు తలకొరివి పెట్టవలసినవాడు చిన్నవాడు. అందుచేత నా చిన్నకొడుకుని మీరు తీసికెళతానంటే నేను ఒప్పకోను. కావాలంటే మా రెండవకొడుకుని తీసుకుపొండి" అన్నది.రాజు వారికి డబ్బుచ్చి, రెండో కొడుకుని కొనుక్కున్నాడు. ఆ బాలుణ్ణి తీసికెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు. ముదురుగా, అరిషర్వర్గపూరితమైన, దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా, తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణబాలుడి లేత శరీరాన్ని ఆబగా చూస్తూ రాక్షసుడు పిల్లవాణ్ణి మింగబోయాడు.


సరిగ్గా ఆ పిల్లవాణ్ణి గుప్పట బిగించి, నోట బెట్టబోతుండగా ఆ బాలుడు గట్టిగా ఫకాలు మని నవ్వాడు. మరుక్షణం రాక్షసుడు పిల్లవాణ్ణి నేలదించి తలెత్తకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భేతాళుడింత వరకూ కథచెప్పి, విక్రమాదిత్యుణ్ణి చూసి "విక్రమాదిత్య మహారాజా! ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు? అది చూసి రాక్షసుడు బాలుణ్ణి మ్రింగకుండా ఎందుకు వదిలి పెట్టిపోయాడు? తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తలవెయ్యివక్కలౌతుంది. జవాబు చెప్పి మౌనభంగం చేశావో నేను నీకు అధీనం కాను" అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులమీద చిరునవ్వు మెరుస్తుండగా, "భేతాళా! ఆబాలుడి నవ్వులో "ఇరుగు పొరుగు వారు కొట్టవచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే దయమాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు. రాజే కృరుడై ప్రజలని బాధిస్తుంటే కాపాడవలసినది దైవం. అలాంటి దైవమే దయమాలి నన్ను చంపబోతుంటే ఇంక నేమి గతి?" అన్నభావం ఉన్నది. అది చూసి రాక్షసుడే అయినా బాలుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకూ దైవత్వాన్ని గుర్తిరిగి రాక్షసుడు పిల్లవాణ్ణి విడిచి పెట్టిపోయాడు" అన్నాడు.