4 జూన్, 2011

అక్బర్‌ బీర్బల్‌ కథలు-2


 తాంబూలం వేసుకోవడం అంటే అక్బర్‌ చక్రవర్తికి మహాప్రీతి. ముఖ్యంగా షౌకత్‌ అలీ కట్టి ఇచ్చే పాన్‌ వేసుకోవడం అంటే ఎంతో ఇష్టం. తనకు నచ్చే విధంగా పాన్‌ కట్టి ఇచ్చే షౌకత్‌ అలీని తరచూ తెగ మెచ్చుకునేవాడు. అందుకు భారీకాయంగల షౌకత్‌ అలీ వంగి వంగి సలాం చేస్తూ, మహా నేర్పరి అయిన మా తండ్రి నుంచి ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే నేర్చుకున్న విద్య కదా అది! ఆ మాటకొస్తే పాన్‌ కట్టే నేర్పు మా రక్తంలోనే జీర్ణించుకుపోయింది. అది వంశపారంపర్యంగా వస్తూన్న విద్య.


ప్రభువులకు సంతోషం కలిగిస్తే ఈ సేవకుడి జన్మ ధన్యమైనట్టే,'' అనేవాడు పట్టరాని ఆనందంతో. చక్రవర్తి ఎక్కడిక వెళ్ళినా షౌకత్‌ను వెంట బెట్టుకుని మరీ వెళ్ళేవాడు. ఆయన భోజనం అయినా మానేయగలడేమోగాని, పాన్‌ వేసుకోవడం మాత్రం వదిలేవాడు కాడు. ఇలా మూడేళ్ళు హాయిగా గడిచిపోయాయి.

 ఒకనాడు షౌకత్‌ పొరబాటున తమలపాకులకు సున్నం కాస్త ఎక్కువ రాయడంతో పాన్‌ వేసుకున్న అక్బర్‌ నాలుక భగ్గున మండింది. దాన్ని తుఫుక్కున ఉమ్మేసి, "నీ పాన్‌తో నాలుక మండి పోయింది. పాన్‌ కట్టడంలో ఈ రాజ్యంలో నాకన్నా మొనగాడు లేడని గొప్పలు చెప్పుకుంటావ్‌. సిగ్గులేక పోతేసరి,'' అని మండిపడ్డాడు అక్బర్‌.

 షౌకత్‌ భయంతో వణికిపోయాడు. అక్బర్‌ చక్రవర్తి నాలుకను మళ్ళీ మళ్ళీ చూడడానికి ప్రయత్నిస్తూ, "షౌకత్‌, ఇప్పుడే వెళ్ళి, నీ సంచీ నిండుగా సున్నం నింపుకుని రా. సంచీ నిండుగా. అర్థమయింది కదా?'' అన్నాడు. చక్రవర్తి తనకు ఏ శిరశ్ఛేదమో, జైలు శిక్షో విధించనందుకు షౌకత్‌ మనసులో అల్లాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. సంచీ నిండుగా సున్నం అడిగే సరికి కొట్టువాడు, "అంత ఎందుకూ?'' అన్నాడు.


"నాకు తెలియదు. చక్రవర్తి తెమ్మన్నారు, అంతే!'' అంటూ షౌకత్‌ అప్పుడే అక్కడికి వచ్చిన మహేశ్‌దాస్‌ను చిరునవ్వుతో పలకరించాడు. "అవునూ, చక్రవర్తి నిన్ను సంచీ నిండుగా సున్నం తెమ్మన్నారట కదా. ఎందుకూ?'' అని అడిగాడు మహేశ్‌దాస్‌. "అదే, నాకూ అంతుబట్టడం లేదు మిత్రమా!'' అన్నాడు షౌకత్‌. "ఇంతకు ముందెప్పుడైనా ఇలా తెమ్మన్నారా?'' అని అడిగాడు మహేశ్‌.లేదు, అన్నాడు షౌకత్‌. "దేనికైనా మంచిది. కడుపునిండా నెయ్యి తాగి వెళ్ళు,'' అన్నాడు మహేశ్‌.

 "ఇప్పుడే నాపొట్ట బానలా ఉంది. ఇంకా నెయ్యి తాగమని పరిహాసం చేస్తున్నావా?'' అని అడిగాడు షౌకత్‌. "పరిహాసం కాదు గాని, నీ మంచి కోరే చెబుతున్నాను. చక్రవర్తి సమక్షానికి వెళ్ళే ముందు కడుపు పట్టేంత నెయ్యి తాగి మరీ వెళు్ళ. అదే నీకు ప్రాణరక్ష. నాకు అవతల బోలెడు పనులున్నాయి,'' అంటూ వెళ్ళిపోయాడు మహేశ్‌దాస్‌. షౌకత్‌ ఆలోచనలో పడ్డాడు.

సున్నం సంచీతో ఇల్లు చేరగానే, భార్యను నెయ్యి దుత్తను తీసుకురమ్మని, కడుపునిండా నెయ్యి తాగేశాడు. అప్పటికే ఆలస్యమయిందన్న ఆదుర్దాతో, భార్య ఏదో చెబుతున్నప్పటికీ అదంతా వినిపించుకోకుండా, అపశోపాలు పోతూ వెళ్ళి, సున్నం సంచీని చక్రవర్తి ముందు పెట్టాడు. వచ్చావా,'' అంటూ అక్బర్‌ చక్రవర్తి అతని ముఖమైనా చూడకుండా, వీణ్ణి వెలుపలికి తీసుకుపోయి, వీడి చేత ఈ సున్నం తినిపించండి,'' అని భటులను ఆజ్ఞాపించాడు.

"చచ్చిపోగలను ప్రభూ! సున్నం కడుపును దహించేస్తుంది,'' అని ఏడ్వసాగాడు షౌకత్‌. అదే, నీకు సరైన శిక్ష! అన్నాడు అక్బర్‌ చక్రవర్తి. భటులు షౌకత్‌ను వెలుపలికి లాక్కెళ్ళి, సున్నం తినమని ఆజ్ఞాపించారు. రాజాజ్ఞ గనక, షౌకత్‌ రెండు గుప్పెళ్ళ సున్నం తిని సొమ్మసిల్లి పడిపోయాడు. అంతలో అక్బర్‌ చక్రవర్తి అక్కడికి వచ్చాడు.

ఆయన షౌకత్‌ను చూడగానే, "ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా?'' అని అడిగాడు. అతి ప్రయత్నం మీద లేచి కూర్చుంటూ, "నెయ్యి తాగడం వల్ల బతికిపోయాను ప్రభూ,'' అన్నాడు షౌకత్‌. "నెయ్యి ఎందుకు తాగావు?'' అని అడిగాడు అక్బర్‌ చక్రవర్తి. "సున్నం కొంటూంటే అక్కడికి వచ్చిన మహేశ్‌దాస్‌ అనే యువకుడు నెయ్యి తాగి తమ దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చి పుణ్యం కట్టుకున్నాడు, ప్రభూ!'' అన్నాడు షౌకత్‌. "ఎవడా మహేశ్‌దాస్‌? వెళ్ళి వెంటనే పిలుచుకురా వాణ్ణి,'' అని ఆజ్ఞాపించాడు అక్బర్‌.


షౌకత్‌ వెళ్ళి కొంతసేపటికి మహేశ్‌దాస్‌ను వెంటబెట్టుకుని వచ్చాడు. అతన్ని చూడగానే, "బీర్బల్‌, ఇదంతా నీ పనా? షౌకత్‌ను నెయ్యెందుకు తాగిరమ్మన్నావు?'' అని అడిగాడు అక్బర్‌ కోపంగా. "నెయ్యి తాగి రావద్దని ప్రభువులు ఆజ్ఞాపించలేదు కదా. ప్రభువులు క్షమించాలి.... తమరు సంచీ నిండుగా సున్నం తెమ్మన్నారంటే, అది అతన్ని శిక్షించడానికే అని ఊహించి నెయ్యి తాగి రమ్మన్నాను.

లేకుంటే ఈపాటికి అతడు చచ్చేవాడు,'' అన్నాడు బీర్బల్‌. "చస్తే నీకేం? పాన్‌లో సున్నం ఎక్కువ కలిపి నా నాలుక పొక్కిపోయేలా చేశాడు. వాడికీ శిక్ష కావాలి,'' అన్నాడు అక్బర్‌ కోపంగా. "షౌకత్‌ చస్తే నాకేం లేదుగానీ, తమకే నష్టం. అతడు మూడేళ్ళుగా తమ సేవలో ఉన్నాడు. ఎప్పుడూ తప్పు చేయలేదు. అతడు కట్టిచ్చే పాన్‌ అద్భుతంగా ఉంటుందని తమరే నాతో అనేక సార్లు చెప్పారు. అలాంటి వాడు పోతే, మీకు అంత బాగా పాన్‌ కట్టిచ్చే వారెవరు? మిమ్మల్ని నము్మకున్నవాడు. ఏదో పొరబాటు చేశాడు.

తప్పు చేయడం మానవ సహజం. తెలియక చేసిన తప్పును క్షమించడం తమవంటి చక్రవర్తుల గొప్పగుణం!'' అన్నాడు బీర్బల్‌. షౌకత్‌ మళ్ళీ వంగి సలాం చేశాడు. అక్బర్‌చక్రవర్తి దాన్ని చూసి, "వంగి నీనుదుటితో నేలనుతాకమని చెప్పివుంటే సరిపోయేది. అదే నీకు సరైన శిక్ష,'' అని క్షణం ఆగి, "సరి, సరి. త్వరగా, నాకూ, బీర్బల్‌కూ మంచి పాన్‌ కట్టివ్వు,'' అన్నాడు నవ్వుతూ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి