1 అక్టోబర్, 2012

కోడిపుంజు తెలివి

ఒక ఊర్లో కోడిపుంజు ఒకటి ఎత్తైన ప్రదేశంలో కూర్చుని ఉండటాన్ని చూసింది నక్క. "అరే... మంచి విందు భోజనం దొరికిందే" అని సంతోషపడుతూ, ఎలాగైనా సరే దాన్ని పట్టుకోవాలని అనుకుంది. అప్పటికప్పుడే పథకం ఆలోచించిన నక్క."పుంజు తమ్ముడూ...! నీకో శుభవార్త" అంటూ పలకరించింది.శుభవార్తా...? నాకా? ఏంటది? అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది కోడిపుంజు. స్వర్గం నుండి ఒక ఆజ్ఞ వచ్చింది. ఇక నుంచి పక్షులు, జంతువులు అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉండాలని, ఒకరినొకరు చంపుకోకూడదని, ముఖ్యంగా నక్కలు కోళ్ళని తినకూడదని దేవుడి ఆజ్ఞ అంటూ చెప్పుకొచ్చింది నక్క.

కాబట్టి నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కిందికి దిగివస్తే బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం అంటూ కోడిపుంజును కిందికి దిగిరమ్మని చెప్పింది నక్క. అరె... ఇది చాలా మంచి విషయమే. అందుకేనేమో నీ స్నేహితులు నిన్ను కలిసేందుకు వస్తున్నారు అని చెప్పింది కోడిపుంజు.నా స్నేహితులా...!? ఎక్కడ...? ఎవరబ్బా..!? అంటూ అటువైపుకి తిరిగి చూసింది నక్క.అమ్మో...! వేటకుక్కలు. అవి తనవైపే వస్తుండటాన్ని చూసిన నక్క పారిపోయేందుకు ప్రయత్నించింది. అది చూసిన కోడిపుంజు...అదేంటి నక్క బావా, అంతగా భయపడుతున్నావు. ఇప్పుడు అందరం స్నేహితులమే కదా...!? అంటూ నవ్వింది.నిజమే... కానీ ఈ విషయం వేటకుక్కలకు ఇంకా తెలియదు కదా.! అని కోడిపుంజుకు బదులిచ్చి... బ్రతుకుజీవుడా అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది నక్క.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి