1 అక్టోబర్, 2012

దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తే మొదటికే మోసం

అనగా అనగా ఒక అడవి.. ఆ అడవిలో పాముల పుట్ట. చాలా పాములు ఆ పుట్టలో సఖ్యంగా ఉండేవి. ఒక రోజు బాగా బలిసిన ముళ్లపంది ఆ పుట్ట దాపుకు వచ్చిది. దాని గురగుర శబ్దానికి ఉలిక్కిపడి పాములు బయటకు వచ్చాయి. ముళ్ల పందిని చూసి ఏంటి కథ అని అడిగాయి. "ఈ రోజు నా అదృష్టం పండింది. తిండి బాగా దొరకడంతో ఆబగా తినేశా. భుక్తాయాసం ఎక్కువై ఎక్కడైనా నిద్రపోదామని చూస్తే బయట అంతటా పక్షికూతలు, ఇతర శబ్దాలతో గోల గోలగా ఉంది. మీ పుట్టలో కాస్త చోటిస్తే కాస్సేపు నిద్రపోయి తిరిగి వస్తాను: అని అడుక్కుంది ముళ్లపంది. 

"అబ్బే లోపల పెద్దగా స్థలం లేదే. ఫరవాలేదు మేం కాస్త ఒదిగి పడుకుంటాం. ఇదిగా ఈ మూల నువ్వు సర్దుకో" అంటూ కొద్దిగా చోటి్చ్చాయి. ముళ్లపంది మెల్లగా లోపలకు దూరింది. పుట్టలోపల చాలా వెచ్చగా ఉండటంతో అది వెంటనే నిద్రలోకి జారుకుంది.పంది నిద్రపోగానే దాని సహజ స్వభావం కొద్దీ దాని ఒంటి మీదగల ఒక్కొక్క ముల్లు విచ్చుకుంటూ పాములకు గుచ్చుకోసాగాయి. పాములు దాని ముందుకెళ్లి అవతలకు పో అని ఒక్క అరుపు అరిచాయి. 

ఇదిగో నాకు ఇక్కడ హాయిగా ఉంది. పైగా బాగా నిద్రవస్తోంది కూడా. నా నిద్ర పాడు చేయకండి. అంతకూ మీకు ఇబ్బందిగా ఉంటే మీరే బయటకు పోండి అంటూ ముళ్లను ఇంగా బాగా చాపింది. దీంతో ఆ ముళ్లు పాములకు బాగా గుచ్చుకున్నాయి. పాపం పాములు. ఇంకేం చేస్తాయి. దీన్ని  రానిచ్చామే అని తమలో తాము తిట్టుకుంటూ బయటకు పోయాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి