21 ఆగస్టు, 2011

చేప పాట్లు


అనగనగా ఒక చెరువులో కొన్ని చేపలు ఉండేవి. ఒక రోజు ఒక అబ్బాయి ఆ చేపలలో నుంచి చిన్నచేపను పట్టుకున్నాడు. దానిని తీసుకుని వెళ్లి ఇంట్లో ఉన్న తొట్టెలో కొంతకాలం పెంచాడు. అది సహజమైన వాతావరణంలో పెరిగితేనే సంతోషంగా ఉంటుందని ఎవరో చెప్పడంతో దానిని తిరిగి అదే చెరువులో వదిలేశాడు. ఆ చేప పిల్ల తిరిగి తనకు స్వేచ్ఛ దొరికినందుకు, తనవాళ్లను కలుసుకున్నందుకు చాలా సంతోషించింది. కానీ అది తిరిగి వచ్చిన కొన్నిరోజులకే ఆ చెరువులో నీళ్లు తగ్గిపోయాయి. వేసవి కాలంలో ఎండలు గతంలో కంటే ఎక్కువగా ఉండడంతో వేడికి నీరు ఆవిరై చెరువులో నీళ్లు బాగా తగ్గాయి.

చేపపిల్లకు ఆ వేడిని తట్టుకోవడం కష్టమైంది. మిగిలిన చేపలు మాత్రం వేడిని తట్టుకోగలిగాయి. ‘‘నేను నీడ పట్టున హాయిగా ఉండేదాన్ని. అనవసరంగా మళ్లీ ఈ చెరువులో వచ్చి పడ్డాను. అక్కడే ఉంటే చల్లగా, హాయిగా ఉండేదాన్ని’’ అని బాధ పడసాగింది. అది గమనించిన ఒక పెద్దచేప, దాని బాధనంతా ఓపికగా విని అర్థం చేసుకుంది. ‘‘ఏదో ఒక రకంగా నన్ను తిరిగి ఇంతకు ముందు ఉన్న చోటికే పంపించేయండి’’ అని పెద్దచేపను బతిమిలాడింది చిన్నచేప.

‘‘ఈ వేడి ఎంతో కాలం ఉండదు. కొన్నిరోజులు కష్టపడవలసి వస్తుందని నువ్వు జీవితమంతా ఎక్కడో బందీగా ఉంటావా? స్వేచ్ఛ కోసం ఈ మాత్రం ఇబ్బందులను కూడా భరించలేని నువ్వు మా మధ్య ఉండక్కర్లేదు’’ అని చివాట్లు పెట్టింది. అప్పుడు చిన్న చేప ‘‘అయితే నేను వెళ్లను. ఇక్కడే ఉంటాను’’ అంది. ఆ తర్వాత కొన్నిరోజులకు వర్షాలు కురిశాయి. చెరువులో నీళ్లు పెరిగాయి. వేడంతా తగ్గిపోయింది. తొందరపడి వెళ్లిపోకుండా అక్కడే ఉన్నందుకు చిన్నచేప చాలా సంతోషించింది.

కిట్టూ


అనగనగా ఒక ఊరిలో కిట్టూ అనే అబ్బాయి ఉండేవాడు. కిట్టూ తల మీద జుట్టు ఎక్కువ ఉండేది కాదు. దాంతో ఆ ఊరిలో ఉండే ఆకతాయి పిల్లలు కిట్టూని ‘గుండూ... గుండూ...’ అని ఏడిపించేవారు. అందుకే కిట్టూ ఆడుకోవడానికి బయటికి వెళ్లే వాడు కాదు. ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆ ఊరి పిల్లలందరూ ఆడుతూ ఉంటే కిట్టూ ఇంటి లోపల నిలబడి చూసేవాడు.

రోజూ సాయంత్రం ఆ వీధిలో నుంచి ఒక తాతగారు నడుచుకుంటూ వెళ్లే వారు. అక్కడ ఆడుకుంటున్న వారిలో ఆకతాయి పిల్లలు ఎంత హేళనగా మాట్లాడినా ఆయన పట్టించుకోకుండా వెళ్లి పోయేవాడు. దాంతో తాతగారికి చెవులు సరిగా వినిపించవని అనుకున్నారు వాళ్లు. అప్పటినుంచి ఆయన ఆ దారిలో వెళుతున్నపుడల్లా ‘చెవిటి తాతా’ అని అరిచేవారు. ఆయన ఏమీ వినబడనట్టే వెళ్లి పోయేవాడు.

ఒక రోజు కిట్టూ గేటు దగ్గర నిలబడి చూస్తున్నాడు. రోజూ అక్కడ ఆడుకునే పిల్లలు ఎవరూ ఆ రోజు ఇంకా రాలేదు. రోజూ లాగే తాతగారు ఆ వీధిలో నుంచి వెళ్తున్నారు. రోజూ ఎవరో ఒకరు ఆ తాతని ఏదో ఒక మాట అనడం గుర్తు వచ్చిన కిట్టూ ‘‘చెవిటి తాతా! నీ పేరేంటి?’’అని అరిచాడు. వెంటనే తాత గారు కిట్టూ దగ్గరగా వచ్చి ‘‘నా పేరు

రాఘవయ్య’’ అని చెప్పాడు. కిట్టూ ఆశ్చర్యంతో నోరు తె రిచాడు. భయంగా లోపలికి పారిపోబోయాడు. అప్పుడు రాఘవయ్య కిట్టూని చేతిలో పట్టుకొని ఆపాడు.

‘‘చూడు బాబూ! నిన్ను వాళ్లు హేళన చేస్తారనే కదా నువు ఆడుకోవడానికి వెళ్లకుండా ఉంటున్నావు. మరి నువ్వు కూడా వాళ్లలాగే ప్రవర్తిస్తే ఎలా? నాకు చెవుడు లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఎవరేమన్నా నేను పట్టించుకోను. కానీ అందరూ నాలాగా ఉండరు కదా! నీలాగ బాధ పడే వాళ్లు కూడా ఉంటారు.

కాబట్టి హేళనగా మాట్లాడడం మంచిది కాదు. ఇదంతా మిగిలిన వాళ్లెవరికీ చెప్పకుండా నీతో మాత్రమే ఎందుకు చెపుతున్నానంటే, నువు మంచి పిల్లాడివి. మంచి విషయాలు చెపితే అర్థం చేసుకునే మనసు నీకు ఉందని నా నమ్మకం’’ అని రాఘవయ్య వెళ్లిపోయాడు. ఆయన చెప్పిన మాటల గురించే కిట్టూ చాలా సేపు ఆలోచించాడు. ఆయన చెప్పినది బాగా నచ్చింది కిట్టూకి. ఆ రోజు తర్వాత కిట్టూ ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. అంతే కాకుండా ఎవరేమన్నా పట్టించుకోకుండా ధైర్యంగా బయటికి వెళ్లి ఆడుకోవడం మొదలు పెట్టాడు.

8 ఆగస్టు, 2011

ప్రమాదంలో పడ్డ బాతు


అనగనగా ఒక చిన్న అడవిలో రెండు బాతుపిల్లలు ఉండేవి. అవి ప్రతిరోజూ ఏదో ఒక పోటీ పెట్టుకునేవి. పరుగు పందెమో, ఈత పోటీయో, ఎగిరే పోటీయో పెట్టుకుని సంతోషిస్తూ ఉండేవి. అవి ఆడుకోవడానికి వెళ్లేటపుడు తల్లి బాతు చాలా జాగ్రత్తలు చెప్పేది. బాతు పిల్లలు ఆ జాగ్రత్తలన్నీ పాటించి ఆటలన్నీ ముగిశాక క్షేమంగా తిరిగి వస్తుండేవి. ఒకరోజు అవి ఒక నదిలో ఈత పోటీ పెట్టుకున్నాయి. రెండూ ఒకసారే ఈదడం మొదలుపెట్టాయి.

ఒక బాతుపిల్ల నీటి ప్రవాహం ఎక్కువగా లేని వైపు నుంచే ఈదుకుంటూ వెళ్తోంది. కానీ రెండోది మాత్రం ఎక్కువ కష్టపడి ఈదకుండానే గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆత్రుతతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నవైపుకి వెళ్లింది. ‘‘ నీరు వేగంగా వెళ్లేచోట ఈదకూడదు. నీటితో పాటు కొట్టుకుపోతారు. అక్కడ సుడిగుండాలు కూడా ఉంటాయి. అందుకే అటువైపు వెళ్లకూడదు’’ అని తల్లి చెప్పిన జాగ్రత్త గుర్తుకు వచ్చింది. కాసేపు ఆలోచించి ‘‘నేను ఇప్పుడు కాస్త పెద్దగా అయ్యాను కదా! ప్రమాదం ఏమీ ఉండదులే!’’ అనుకుంది ఆ బాతుపిల్ల. కానీ అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. బాతుపిల్ల వేగంగా ఉన్న నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోసాగింది.

బాతుపిల్ల భయపడింది. తల్లి చెప్పినమాట వినకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డానని బాధ పడింది. ఇంకో బాతుపిల్ల దానిని గమనించింది. కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది.

అక్కడ చెట్టు మీద ఉన్న ఒక పెద్ద కోతి అంతా గమనించింది. ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు దూకుతూ వెళ్లి ఒక చెట్టు కొమ్మ మీది నుంచి నదిలోకి వేలాడుతూ తోకతో బాతుపిల్లను చుట్టి బయటికి లాగేసింది. బాతుపిల్ల ప్రమాదం నుంచి బయటపడింది. బాతుపిల్లలు రెండూ కోతికి కృతజ్ఞతలు తెలిపాయి. ప్రమాదం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆ బాతుపిల్ల అప్పటి నుంచి తల్లి చెప్పిన జాగ్రత్తల్ని అన్నిటినీ పాటించడం మొదలుపెట్టింది.
నీతి: పెద్దలమాటను తప్పక ఆచరించాలి.