13 డిసెంబర్, 2011

పరమానందయ్య శిష్యుల కథలు

పరమానందయ్య గారికి ఒక శుభకార్యం జరిపినవలసి వచ్చింది.  దానికి కొంత డబ్బు అవసరమయింది.  అందుకని చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి ధన, కనక, వస్తు వాహనాలు  విరాళాలు సేకరించుకురావాలని శిష్యులను వెంటబెట్టుకుని  బయలుదేరారు. నాలుగయిదు గ్రామాలు తిరిగేసరికి వారికి విరాళాలు బాగానే వచ్చాయి. అప్పటికే సాయంత్రమయిపోయింది.

దారిలో ఒక ఏరు అడ్డు వచ్చింది. ఆ ఏరు మోకాలిలోతు మాత్రమే ప్రవహిస్తుంది.  అది చూసిన శిష్యుడికి బాగా కోపమొచ్చింది.  “మా గురువుగారితో కలసి శిష్యులం వస్తుంటే మా ప్రయాణం ఆపాలనే దుర్భుద్దేమిటి ఈ ఏరుకి? దీనికి గురువుగారన్నా భయం లేదు, అనుకుని “గురువుగారు మీరు హాయిగా విశ్రాంతి తీసుకొండి, ఈ నది పొగరు మేము చూసుకుంటాం” అంటూ గురువుగారికి విశ్రాంతి నిచ్చారు.

శిష్యులంతా బాగా అలోచించి.. ఏరుకి ‘చురుకెయ్యడానికి ‘ నిర్ణయించున్నారు. ఒకడు కాగడా తయారు చేసి మంట అంటించాడు.  ఆ కాగడాను శబ్ధం చేయకుండా ఏటిలోకి వెళ్ళాడు.  ఆ  కాగడాని ఏరులో ముంచాడు.  వెంటనే అది చుయ్మని శబ్ధం చేసింది. దానికి, ఆ శిష్యుడు భయపడిపోయి పరిగెత్తుకొంటూ వచ్చి పడ్డాడు. ఈ గోలకి గురువుగారికి మెలకువ రాలేదు.  ఆయనకు గాఢనిద్ర పట్టేసింది.  అది చూసిన మిగతా శిష్యులు , “ఏమయిందిరా?” అని అడిగారు. “ఏరు పడుకోలేదురా.. మెలకువగానే ఉంది.  నేను వాతపెట్టబోతుంటే పగబట్టిన నాగుపాములా బుస్సుమని పెద్ద పెద్ద కెర్టాలతో నన్ను కాటేసింది” అంటూ వణికిపోతూ … భోరుమని ఏడిచేశాడు.

అదే సమయంలో అటునునుంచొక యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ దాటడం చూసిన శిష్యుల ఆశ్చర్యానికి అంతులేదు.  ఈ యువకుడు ఎంత ధైర్యంగా వస్తున్నాడో ! ఏరు నిద్దరోతుందేమో.. అందుకే వాడినేమి అనలేదు అనుకుని.. “ఇది మంచి సమయం. ఏరు నిద్రపోతుందో లేదో చూసిరా.. మనం కూడా దాటేద్దాం” అన్నాడు మరో శిష్యుడు. సరేనని ఓ శిష్యుడు నుదుటన వీభూది పెట్టుకుని.. ఆంజనేయ  దండకం చదువుతూ  ఏటి ఒడ్డుకు బయలుదేరాడు.  ఏరులోకి వెల్ళి మెల్లగా శబ్ధం చేయకుండా తన చేతిలోని కాగడాను ముంచాడు.  కాగడాకి నిప్పులేదు కనుక నీళ్ళు ఏ శబ్ధం చేయలేదు.

ఏటినుండి ఏ శబ్ధం రాకపోయేసరికి ఆ శిష్యుడు పరుగెత్తిపోయి తన వారి దగ్గరకొచ్చి – “ఏరు నిద్దరోతోంది. ఇదే మంచి సమయం. అందరూ తయ్యారవ్వండి” అని హడావిడి చేశాడు. శిష్యులు – గురుగారినెంత లేపిన ఆయనకు మెలకువ రాలేదు. ఆయనను మోసుకుపోదామనుకున్నారు.  అందరూ దేవుణ్ణి ప్రార్థించుకుని, మూటల్ని గురువుగారిని ఎత్తుకుని మొత్తానికి అవతలి ఒడ్డుకు చేరారు.అయినా గురువుగారికి మెలకువ రాలేదు.  ఏరు దాటిన ఆనందంతో శిష్యులంతా గంతులేశారు. ఇంతలో వాళ్ళలో ఓ శిష్యుడు అందరినీ వరుసగా నిలబడమని చెప్పాడు.  అందరూ గోల ఏయకుండా నిశ్శబ్ధంగా వరుసలో నిలబడ్డారు.

“ఎందుకు?” అని అడిగాడు ఓ శిష్యుడు. “మనమంతా ఇవతలి ఒడ్డుకు వచ్చామో లేదో” అని అన్నాడా శిష్యుడు. “ఐతే ఇప్పుడేం చెయ్యాలి? అనం పన్నెండు మందిమి. గురువుగారు కాక శిష్యులం పన్నెండుమందిమి.” ఆ శిష్యుడు ఒక్కొక్కరిని లెక్కపెట్టడం మొదలుపెట్టాడు.  అతన్ని వదిలి మిగిలిన పదకొండుమందిని లెక్కపెట్టాడు ఆ వెర్రి శిష్యుడు. “బాబోయ్ .. మనలో ఒకర్ని ఏరు మింగేసింది” అని గట్టిగా అరిచాడతను. “అవతలి ఒడ్డున ఉండిపోయాడేమో” అన్నాడు ఓ శిష్యుడు. లేదు నేను వెనక్కి తిరిగి చూశాను కదా” చెప్పాడు శిష్యుడు. “అంటే నిజంగానే ఏరు మింగేసిందన్నమాట” అంటూ శిష్యులంతా భోరున ఏడుస్తూ ఏరుని శాపనార్థాలు పెట్టసాగారు. అంతలో అటుగా భుజాన కర్రపట్టంకుని ఓ బాటసారి వస్తున్నాడు. శిష్యులను చూసిన ఆ రైతు వారిని సమీపించి, “మీరెవరు?  ఎందుకు బాధపడ్తున్నారు” అని ప్రశ్నిచాడు.

“మా గురువుగారు పరమానందయ్యగారు, మేము ఆయన పన్నెండుమంది శిష్యులం.  మేమంతా కలసి ఏరుదాటుకొస్తుంటే అది మాలో ఒకర్ని మింగేసింది.” అని చెప్పారు శిష్యులు. “బాటసారి వారిని ఒకసారి లెక్కపెట్టి చూశాడు. శిష్యుల తెలివి తక్కువతనం అతనిని అర్థమయ్యింది.  అందుకే వారిని ఆటపటించాలనుకున్నాడు “నేనెవరిని” అని అడిగాడు బాటసరి శిష్యులని. “తెలియదు” అన్నారు శిష్యులు “ఇంతకీ మీరెవరు?” అన్నాడు ఓ శిష్యుడు. “నేనెవరో ఓరికే చెప్పేస్తానా? మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత ఇస్తే చెబుతాను” అన్నాడు బాటసారి చాలా తెలివిగా.
మనం అన్ని విషయాలు తెలుసుకొవాలని గురువుగారు చెప్పారు కదా? అందుకని ఇతనెవరో తెలుసుకుందాం అనుకున్నారంతా. బాటసారికి ఓ మూట ఇచ్చి “చెప్పు నువ్వెవరు?” అని అడిగారు.“నేను మారువేషంలో ఉన్న మాంత్రికుడిని. భూత పిశాచాలను పారద్రోలుతాను”.  అన్నాడు“నువ్వు ఏరు మింగేసిన మా వాడిని తీసుకురాగలవా?” అన్నాడు ఓ శిష్యుడు. “తీసుకువస్తాను కాని కొంచం ఖర్చవుతుంది” అన్నాడు బాటసారి.
“మనిషికంటే డబ్బు ముఖ్యం కాదని మా గురువుగారు చాలాసార్లు చెప్పారు ఇదిగో మరో మూట” అని డబ్బు ఇచ్చారు. అప్పుడు ఆ బాటసారి ఏదో ఓ పిచ్చిమంత్రం చదువుతున్నట్లు నటించాడు.  అతను శిష్యులందర్నీ వరుసగా నిలబెట్టి, ఒక్కొక్కరిని ఒక్కో అంకే లెక్కపెట్టమని చెప్పాడు. అలా లెక్కపెట్టగా పన్నెండుమంది శిష్యులు లెక్క వచ్చారు. అప్పుడు బాటసారి, “చూశావా మీ వాడిని తెప్పించేశాను” అన్నాడు . 

శిష్యుల ఆనందానికి, ఆశ్చర్యానికి  అవధులు లేవు. “మీరు సామాన్యమానవులు కారు. ఏరు మింగేస్న మావడిని తెప్పించగలిగారు.   మీకేమిచ్చి రుణం తీర్చుకోగలమని?.. అయినా మీ ప్రతిభకేదో మా వద్ద ఉన్నంత సమర్పించుకొంటాం అంటు మిగతా డబ్బు మూటలు కూడా బాటసారికి ఇచ్చేశారు. అవి తీసుకుని సంతోషంతో అక్కడనుండి వెళ్ళిపోయాను బాటసారి. అప్పుడు మెలకువ వచ్చింది గురువుగారికి. డబ్బు గురించి అడగ్గా శిష్యులు జరిగిందంతా విపులంగా చెప్పారు.  వాళ్ళ తెలివితక్కువతనానికి నెత్తినోరు బాదుకొన్నారు గురువుగారు

11 డిసెంబర్, 2011

తిట్ల భూతం

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్నిదించి భుజానవేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నువ్వుదేన్ని సాధించగోరి, భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రివేళ ఇంతగా శ్రమల పాలవుతున్నావో, ఇంకా నిగూఢంగానే ఉండిపోయింది. సాధారణంగా వ్యక్తులు తమ కోర్కెలను సఫలం చేసుకోవాలన్న ప్రయత్నంలో బలమైన మానసిక వత్తిళ్ళుకు గురై విసిగి వేశారి, చివరకు తాముసాధించదలచినదేమిటో కూడా మరిచిపోతూండడం వింత ఏమీ కాదు. అరుణ అనే ఒక పెళ్ళీడు యువతి, ఒక మహర్షి ఇచ్చిన వరాన్ని అనాలోచితంగా తన మేలుకు కాక, ఇతరుల మేలుకోసం కోరింది. నువ్వు అలాంటి పొరబాటు చేయకుండా వుండేందుకు ఆమెకధ చెబుతాను, శ్రమ తెలియకుండా విను," అంటూ ఇలా చెప్ప సాగాడు.

వీరమ్మ పరమగయ్యాళి. తల్లిదండ్రులు ఆమెను పరమ శాంతిమూర్తి వీరయ్యకిచ్చి పెళ్ళిచేసి హమ్మయ్య అనుకున్నారు. ఆనాటి నుంచి వీరయ్య ఇంట్లో అసలు శాంతి లేకుండా పోయింది. వీరమ్మ కాపురానికి వచ్చేసరికి అత్తగారు మంచానపడివుంది. మామగారు తన పనులు తాను చేసుకోలేని ముసలివాడు. సరైన సేవలు అందక అత్తగారూ, మనశ్శాంతి లేక మామగారూ ఎంతోకాలం బ్రతకలేదు. ఆ తర్వాత నుంచి వీరమ్మ, భర్తను సాధిస్తూ జీవితం కొనసాగించింది. ఆమెకొక కొడుకూ, కూతురూ పుట్టారు. వీరమ్మ వాళ్ళనూ సాధిస్తూండేది. కూతురు పెద్దదై పెళ్ళి చేసుకుని, అత్తవారి ఇంటికి వెళ్ళాక ఊపిరి పీల్చుకుంది. భీముడు, వీరమ్మ కొడుకు. కండలు తిరిగి చూడ్డానికి మహావీరుడిలా వుంటాడు. కానీ వాడికి తండ్రి శాంతగుణం బాగా ఒంటబట్టింది. ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడని భీముడు, తల్లికి మాత్రం భయపడేవాడు.

 ఒకసారి భీముడు తల్లికోసం పట్టుచీర తేవాలని గంగవరం వెళ్ళాడు. గంగవరం పట్టు చీరలకు ప్రసిద్ధి. వీరమ్మకు అక్కడి నుంచి పట్టుచీర తెప్పించుకోవాలని చాలా కాలంగా మనసు. కొడుక్కురంగులు, చుక్కలు వివరాలన్నీ చెప్పిందామె. భీముడు గంగవరంలో ఏ నేతగాడింటికి వెళ్ళినా, తల్లి చెప్పిన వివరాలకు సరిపోయే పట్టుచీరకనబడలేదు. అచ్చం తను చెప్పినలాంటి చీర తేకున్నా, అసలు చీరే తేకున్నా వీరమ్మ పెద్ద రాద్ధాంతం చేస్తుందని, భీముడికి తెలుసు. అందుకని, ఏం చేయాలో తోచక, ఆ ఊరి కాలవ ఒడ్డున చెట్టుకింద దిగులుగా కూర్చున్నాడు.
 ఆ సమయంలో కొందరాడపిల్లలు అక్కడికి బిందెలతో వచ్చారు. రోజూ ఆ సమయంలో వాళ్ళు కాలవలో స్నానాలుచేసి, బిందెలతో నీళ్ళు తీసుకుని వెళతారు. ఆడపిల్లల్లో అరుణ అనే అమ్మాయి, చెట్టు కింద కూర్చున్న భీముణ్ణి చూసి, "ఎవరయ్యా, సిగ్గులేదూ, ఆడపిల్లలు స్నానం చేసే సమయంలో ఇక్కడ కాపు కాశావు!" అని చీవాట్లు పెట్టింది.  భీముడు దీనంగా ముఖంపెట్టి, తనకు వచ్చిన ఇబ్బంది అరుణకు చెప్పికున్నాడు. అది వన్న అరుణ హేళనగా నవ్వి, "హా, గొప్ప తెలివైనదే, మీ అమ్మ! చీరల ఎంపికకు తను రావాలి; ఎవరైన ఆడవాళ్ళను పంపాలి. మగవాణ్ణి - అందులోనూ నీలాంటివాణ్ణి పంపుతుందా! సరేలే, నీకు నేను సాయపడతానుకానీ, నువ్వు ఇక్కణ్ణుంచి లేచి, ఊళ్ళోకి పో. అక్కడ సాంబయ్యగారిల్లెక్కడా అని అడిగి తెలుసుకుని, ఆ ఇంటి వీధి అరుగు మీద కూర్చో. నేను స్నానం చేసి వచ్చాక, మీ అమ్మ బాగుబాగు అని మెచ్చే చీర, నీ చేత కొనిపిస్తాను," అన్నది.

 భీముడు అక్కడినుంచి లేచి తిన్నగా ఊళ్ళోకి పోయి, సాంబయ్య ఇల్లు తెలుసుకుని, ఆ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. కొంతసేపటికి అరుణ వచ్చి, వాణ్ణి పలకరించి, వీరమ్మ చూపులకెలా వుంటుందో అడిగి తెలుసుకున్నది. తర్వాత వాణ్ణి వెంటబెట్టుకుని, ఒక నేతగాడి ఇంటికివెళ్ళింది. అక్కడ ఒక చీర ఎంపిక చేసి బేరమాడి తక్కువ ధరకు వచ్చేలా చేసింది

ఇలా పని ముగిశాక అరుణ, భీముడితో, "ఇల్లు చేరాక చీరను అమ్మకివ్వు. తర్వాత, ఆమెతో - నేతగాడు నువ్వు చెప్పిన చీర వివరాలన్ని విని, అచ్చం అలాంటి చీరే ఆరేళ్ళక్రితం ఈదేశపు మహారాణి కోసం నేసి ఇచ్చానన్నాడని చెప్పు. మహారాణి అభిరుచులతో సరిపోలిన అభిరుచులుగల మరొక స్త్రీ ఉన్నందుకు, అతడు ఆశ్చర్యపోయాడని కూడా చెప్పు. అయినా, అమ్మకు తృప్తి కలక్కపోతే - మహారాణి జాతకురాలికి, ఈ చీర నచ్చి తీరుతుందనీ, ఒక వేళ నచ్చకపోతే ఆవిడ మహారాణి జాతకురాలు అయుండదనీ అన్నాడు నేతగాడని చెప్పు. నీకే ఇబ్బందీవుండదు," అంటూ భీముడికి హితబోధ కూడా చేసింది.

భీముడు తిరిగి తన ఊరు వెళ్ళి, అంతా అరుణ చెప్పినట్లే చేశాడు. తనను మహారాణితో పోల్చినందుకు వీరమ్మ ఎంతో సంబరపడి, భీముడు తెచ్చిన చీరను చాలా మెచ్చుకుంది. "వాడు, తండ్రితో జరిగిందంతా చెప్పి, "అరుణ ఈ ఇంటికోడలైతే, అమ్మలో మార్పు తేగలదని నాకు ఆశగా వుంది," అన్నాడు. మర్నాడు వాడు పనిమీద పొరుగూరుకు వెళుతున్నానని తల్లికి అబద్ధం చెప్పి, గంగవరం వెళ్ళాడు. వాడు కాలవకేసి రావడం అంత దూరంలోనే చూసిన అరుణ, గబగబా వాడి దగ్గరకు వచ్చి, "మీ అమ్మ నిన్ను బాగా చీవాట్లు పెట్టిందా?" అంది, భీముడి మీద జాలిపడుతూ.

" లేదు, చీరను బాగా మెచ్చుకుంది. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను," అన్నాడు భీముడు.దానికి అరుణ ఆశ్చర్యపోయి, " ఏమిటా ముఖ్య విషయం?" అని అడిగింది. భీముడు కాస్త బెరుకు బెరుకుగా, "నిన్ను పెళ్ళాడాలని వుంది," అన్నాడు. "నువ్వు నన్నడుగుతావేమిటి? మీ పెద్దలతో, మా పెద్దలను అడగమని చెప్పు," అన్నది చిరాగ్గా అరుణ.

"పెద్దల సంగతి తర్వాత. నాకు నువ్వు నచ్చావు. నేను నీకు నచ్చానో లేదో తెలుసు కుందామనే, ఇప్పుడిలా వచ్చాను," అన్నాడు భీముడు. అరుణ ఒక క్షణం భీముడి ముఖంకేసి చూసి, "నువ్వు అందంగా వున్నావు. మంచి వాడివి. నచ్చావుకాబట్టే చీర ఎంపికలో నీకు సాయపడ్డాను," అంటూ సిగ్గుపడింది.అప్పుడు భీముడు అరుణకు తన తల్లిని గురించి వివరంగా చెప్పి, "నీ తెలివి తేటలతో, మా అమ్మను మార్చగలవా? బాగా ఆలోచించుకో!" అన్నాడు.ఆలోచించడానికి అరుణకు ఎంతోసేపు పట్టలేదు. ఆమెకు బిల్వమహర్షి గుర్తుకు వచ్చాడు. ఆయన ఒకసారి దేశసంచారం చేస్తూ, గంగవరం వచ్చి, కాలువ ఒడ్డున జారిపడ్డాడు. కాలు మడతపడడంతో ఆయన లేవలేక అవస్థపడుతూంటే, స్నానానికి వచ్చిన ఆడపిల్లలు, ఆయన్ను అపహాస్యం చేయడమే కాక, తొందరగా అక్కణ్ణించి వెల్ళిపొమ్మని కేకలు వేశారు.

అరుణ వాళ్ళను మందలించి, బిల్వమహర్షికి తగిన శుశ్రూషచేసి లేవదీసి కూర్చోబెట్టింది. అప్పుడాయన అరుణతో, "అమ్మాయీ, నీ సేవలకు సంతోషించాను. ఏదైనా వరం కోరుకో, ఇస్తాను!" అన్నాడు. అయితే, ఏం కోరుకోవాలో అప్పటికి అరుణకు తెలియలేదు. ఆమె కొంత గడువు కోరింది. బిల్వమహర్షి సరేనని, "కళ్ళు మూసుకుని మూడుమార్లు నాపేరు తలచు కుంటే ప్రత్యక్షమై, నీకోరిక తీరుస్తాను," అని వెల్ళిపోయాడు.

అరుణ ఇప్పుడు భీముడికి, బిల్వమహర్షి కధ చెప్పి, "మీ అమ్మను మార్చడం మామూలు మనుషులవల్ల అయ్యే పనిలా కనిపించడం లేదు. మనం బిల్వమహర్షి సాయం అర్ధిద్దాం!" అంటూ, ముమ్మూరు ఆయన పేరు తలుచుకున్నది. బిల్వమహర్షి తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. అరుణ కోరిక తెలుసుకుని, భీముడితో, "పద నాయనా, మనం వెళ్ళి మీ అమ్మను కలుసుకుందాం," అన్నాడు.

మహర్షి భీముడితో వాళ్ళ ఊరుచేరి, భీముడి ఇంట్లో ప్రవేశించి, మంచం మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్న వీరమ్మను పలకరించి, "అమ్మా, నాకు భిక్ష కావాలి!" అన్నాడు. వీరమ్మ ఉలిక్కిపడి లేచి కూర్చుని, "బిచ్చం కోసం వచ్చావు. మరి బిచ్చమడిగే పద్ధతి ఇదేనా?" అంటూ మహర్షిని తిట్టడం మొదలు పెట్టింది.

"అమ్మా! ఇష్టముంటే బిచ్చం వెయ్యి; లేకుంటే పొమ్మని చెప్పు. నీ తిట్లు భూతమై నిన్నే బధిస్తాయి, "అన్నాడు బిల్వ మహర్షి. "తిట్టడం నాకు అలవాటు. అమ్మనాన్నలను తిట్టాను. నాకేమి కాలేదు. అత్తమామలను తిట్టాను, వాళ్ళే పోయారు. మొగుణ్ణీ, కొడుకునూ తిడుతున్నాను. చచ్చినట్టు పడుతున్నారు. నాకు మాత్రం ఎన్నడూ ఏమీ కాలేదు!" అన్నది వీరమ్మ నిరసనగా.

"నా వల్ల తప్పుందనుకో, నువ్వు నన్ను తిడితే ఆ తిట్టు నాకు శాపమవుతుంది. అకారణంగా నన్ను తిట్టావనుకో, అప్పుడా తిట్టు నీ దగ్గరే వుండి నీకు శాపమవుతుంది. ఈ విషయం నీకు అర్ధంకావడం కోసం, ఈ క్షణంలోనే -- అకారణంగా ఇతరులను నువ్వు తిట్టిన తిట్లన్నీ భూతం రూపం ధరించాలని ఆజ్ఞాపిస్టున్నాను," అన్నాడు బిల్వమహర్షి.

అంతే! ఆ క్షణంలోనే వీరమ్మ ముందు భయంకరాకారంలో ఒక భూతం నిలబడి, " అహొ, వీరమ్మా! నేను నీ తిట్లభూతాన్ని! ఇంకొక నాలుగేళ్ళ తర్వాత, నిన్ను తీరని వ్యాధి రూపంలో బాధించాలనుకున్నాను. కానీ ఈ మహర్షి కారణంగా చాలా ముందుగానే, భూత రూపం వచ్చేసింది. నా వల్ల మరేదైనా నాశనం కావాలంటే చెప్పు. లేకుంటే నేను ఇప్పుడే నిన్ను నాశనం చేస్తాను," అన్నది.

వీరమ్మ హడలిపోయింది. ఆమెకు వేరే దిక్కు తోచక, మహర్షి కాళ్ళమీద పడింది. ఆయన ఆమెను లేవనెత్తి, "భూతం నీకు ప్రియమైన దాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. మీ ఇంటి పెరట్లో నీకెంతో ప్రియమైన అంటుమామిడి చెట్టుంది కదా! దాన్ని నాశనం చెయ్యమని చెప్పు. భూతం ప్రస్తుతానికి నిన్ను విడిచి పెడుతుంది," అన్నాడు. వీరమ్మ సరేననగానే భూతం మాయమైంది. పెరట్లోకి వెళ్ళి చూస్తే, అక్కడ మామిడి చెట్టు లేదు.

అప్పుడు బిల్వమహర్షి ఎంతో శాంతంగా, "వీరమ్మా! నువ్వికనుంచి ఎవరినీ అకారణంగా తిట్టకు. అలా తిట్టినప్పుడల్లా భూతం నీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక ముందు మంచిగా వుంటే, నిన్నే భూతమూ బాధించదు. ఒక ముఖ్యమైన సంగతి! నీ కొడుక్కు, గంగవరంలో వుండే అరుణ అనే అమ్మయితో పెళ్ళి చేయి. ఆమె చాలా మంచిది, తెలివైనది. నువ్వు నీ కోడల్ని ప్రేమగా చూసుకుంటే, క్రమంగా నీ తిట్ల భూతం శక్తి నశించి మాయమవుతుంది. బాగా గుర్తుంచుకో. నీ కష్టసుఖాలిక నీలోనే వున్నాయి," అని చెప్పి, బిల్వ మహర్షి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.

తర్వాత కొద్దిరోజుల్లోనే భీముడికీ, అరుణకూ పెళ్ళయింది. భేతాళుడు ఈ కధ చెప్పి, "రాజా, బిల్వమహర్షి ఇచ్చిన వరాన్ని, అరుణ తగుపాటి వివేకంతో ఉపయోగించుకున్నట్టు కనబడదు. ఆ వర ప్రభావంతో ఆమె, ఏ గొప్ప ధనవంతుడి ఇంటికోడలో అయి సర్వసుఖాలూ అనుభవించవచ్చు. ఆమె వరాన్ని, తనకోసం, తన వాళ్ళ కోసం కాక భీముడి మేలుకోసం ఉపయోగించడం అనుచితం, అనాలోచితం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పాక పోయావో, నీ తల పగిలిపోతుంది," అన్నాడు.

దానికి విక్రమార్కుడు, "ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తెకు పెల్ళి కావాలి, పెళ్ళయ్యాక సుఖపడాలి అనేగదా కోరుకునేది! ఆ విధంగా అరుణ తన వరాన్ని తల్లిదండ్రుల ఆనందం కోసమే ఉపయోగించుకున్నట్టు కనబడుతున్నది. ఇక ఆమె స్వవిషయానికొస్తే - సాధారణంగా మగవాళ్ళకు చిరాకెక్కువ. అలాంటప్పుడు, ఎన్నిమాటలన్నా నోరెత్తకుండా వుండే భీముడులాంటివాణ్ణి ఏ ఆడపిల్లయినా కోరుకుంటుంది. అట్లని, తిట్లభూతం శక్తి చూసిన అరుణ, భీముడిపట్ల గయ్యాళిలా ప్రవర్తించే అవకాశం ఏ మాత్రం లేదు. ఈ కారణాలవల్ల అరుణ, మహర్షి ఇచ్చిన వరాన్ని తనకూ, తన వాళ్ళకూ శుభంకలిగే విధంగానే ఉపయోగించుకున్నది. అందువల్ల, అరుణ నిర్ణయంలో అనుచితం, అనాలోచితం అంటూ ఏమీ లేదు," అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతోసహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.

7 డిసెంబర్, 2011

గురువుగారు చేసిన ఉపదేశమేమిటి?

విశ్వేశ్వరాయపురం అనే ఒక పెద్ద ఊళ్ళో, భగవద్గీత సప్తాహం నడుస్తోంది. ఊరిజనం అందరూ వారం రోజులుగా శాస్ర్తిగారి గీతోపన్యాసాలు విని పరవశించి పోతున్నారు. ఆ దినం ఆఖరి ఉపన్యాసం. ముగింపుగా శాస్ర్తిగారు ఇలా చెప్పారు: ‘‘మహాజనులారా! ఈసారికి దైవం నాకు ఇంత మాత్రమే అవకాశం ఇచ్చాడు. నాకు మరొక చోట కార్యక్రమంవుంది. మోక్షసాధనకై నిరంతరం ప్రయత్నిస్తూవున్నప్పుడే, మానవ జన్మ సార్థకమవుతుంది. అందుకు దారి చూపించే గురువు దొరకాలి. అలాంటి గురువు దైవంతో సమానం. మీకందరికీ అలాంటి సద్గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తించాలని మనసారా కోరుకుంటూ, మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.''

ఊరిజనం బరువెక్కిన హృదయాలతో, శాస్ర్తిగారిని ఘనంగా సన్మానించి గౌరవంగా సాగనంపారు. భగవద్గీత సప్తాహం శ్రద్ధగా విన్న వీర్రాజు, పేర్రాజు అనే భూస్వామ్య మిత్రులు ఇంటికి తిరిగిరాగానే, వీర్రాజు పరవశంతో, ‘‘అమ్మమ్మా! ఆ శాస్ర్తిగారు ఎంతటి మహాపండితులో గదా! జీవిత పరమార్థాన్ని ఎంత అద్భుతంగా చెప్పారయ్యా!'' అన్నాడు పేర్రాజుతో. ‘‘అవునవును, ఆయన సరస్వతీ పుత్రులు!'' అన్నాడు పేర్రాజు. వీర్రాజు ఒక క్షణం ఆగి, ‘‘శాస్ర్తిగారి మాటలు విన్నప్పటి నుంచీ, నాలో ఒక ఆవేదన బయలుదేరిందయ్యా, పేర్రాజూ. సద్గురువును వెతికి పట్టుకుని, ఆయన పాదాల దగ్గర ఈ జీవితాన్ని సమర్పణ చేసుకుని తరించాలనిపిస్తోంది. నువ్వు కొన్నాళ్ళపాటు నా వ్యవసాయాన్నీ, ఇంటి పనులనూ చూసి పెడతానంటే, నేను ఆ పనిమీద వెళతాను, ఏమంటావ్‌?'' అని అడిగాడు.

‘‘నీ వ్యవహారాలు చూసి పెట్టడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ, ఒక్క మాటగురువును వెతికి పట్టుకుని పరీక్షించి, మనకు తగినవాడో కాడో నిర్ణయించుకునే స్థితిలోనే కనుకమనంవుంటే, మనకు అసలు గురువుతో పనేముంటుంది? ఆలోచించుకో,'' అన్నాడు పేర్రాజు.

‘‘నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయూనికి వచ్చానయ్యా. శ్రీశైలం దగ్గర ఎవరో ఒక మహానుభావుడున్నాడట. గాలిలో అలా తేలుతున్నాడనీ, నీళ్ళపై నడుస్తాడనీ, నిప్పుల్లో నర్తిస్తున్నాడనీ చెప్పుకుంటున్నారు. పగలు పరమకరుణతో భక్తులను అనుగ్రహిస్తూ, రాత్రి సమయాల్లో మాయమై, హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటారట. నేను వెళ్ళి ఆ సాధువు సంగతేమిటో తెలుసుకుని వస్తాను,'' అన్నాడు.

వీర్రాజులోని ఆవేశాన్ని అర్థం చేసుకున్న పేర్రాజు, ‘‘నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. శీఘ్రకాలంలో నీకు మంచి గురువు దొరికి ఆత్మ తృప్తితో తిరిగిరావాలని దైవాన్ని ప్రార్థిస్తూవుంటాను,'' అన్నాడు. వీర్రాజు ఉత్సాహంగా శ్రీశైలానికి వెళ్ళే సరికి, నిత్యానంద స్వామి ఆశ్రమం దగ్గర పెద్ద తీర్థంలావుంది. ఆ జనసందోహాన్ని చూసే సరికి వీర్రాజుకు మహానందం కలిగింది. శిష్యులు అతని సమాచారాన్ని వివరంగా తెలుసుకుని, స్వామీజీకి నివేదించారు. స్వామీజీ అనుగ్రహించాడు. శిష్యులతో వీర్రాజు, స్వామీజీ వుండే ఆంతరంగిక మందిరానికి వెళ్ళాడు. స్వామీజీని చూస్తూవే వీర్రాజు, ‘‘ఆహా, ఏమి తేజస్సు! ఏమి వర్చస్సు!'' అనుకుంటూ, అమితమైన భక్తితో ఆయన పాదాల ముందు వాలిపోయూడు. ‘‘లే, వీర్రాజూ! నీకు కొన్ని భవబంధాలు వున్నాయి. అవన్నీ వదిలిపోవాలంటే కొంత కాలం సాధన చెయ్యక తప్పదు.

ఆ తర్వాత నువ్వు కోరుకున్న పరమార్థం లభిస్తుంది. హరిః ఓం తత్సత్‌!'' అని ఆశీర్వదించారు గురువుగారు. ‘‘ఆహా! నా గురించి సర్వజ్ఞులైన మీకు అంతా తెలిసిపోయింది. ఈ జన్మతో నాకు మోక్షాన్ని ప్రసాదించండి,'' అంటూ వేడుకున్నాడు వీర్రాజు. గురువు మందహాసం చేసి, ‘‘అంతా నీ చేతుల్లోనే వుంది, వీర్రాజూ. నీలో వైరాగ్యం పెరగాలి. ఇదుగో, ఈ ప్రసాదం భక్తితో కళ్ళకద్దుకుని ఆరగించు,'' అంటూ స్వామీజీ గాలిలోకి చేయిచాపి, ఒక సీతాఫలం అందుకుని, వీర్రాజు చేతుల్లో ఉంచాడు.వీర్రాజు ఉబ్బితబ్బిబ్బయి పోయాడు. అనుగ్రహ ఫలం ఆరగిస్తుంటే అతడిలో ఎన్నెన్నో సంకల్పాలు.

ఈ విధంగా-వీర్రాజు ఇల్లొదిలి, నిత్యానంద స్వామి ఆశ్రమం చేరి ఆరు నెలలు దాటింది. ఏవిధమైన సమాచారం తెలియక ఊరిజనం, అతణ్ణి గురించి తలా ఒకరకంగా చెప్పుకోవడం మొదలు పెట్టారు. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడని కొందరూ, సన్యాసుల్లో కలిసిపోయాడని మరికొందరూ చెప్పుకోసాగారు. వీర్రాజు భార్యా, కొడుకూ, కూతురూ, ఆ గాలికబుర్లు వింటూ, లబోదిబోమని గోలపెడుతూ ఎలాగో రోజులు నెట్టుకొస్తున్నారు. పేర్రాజు ఆ కుటుంబానికి అండగా నిలబడి, వాళ్ళకు ధైర్యం చెబుతూ, ఏలోటూ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.

పులిమీద పుట్రలా ఒకరోజున వీర్రాజు నుండి రెండు ఉత్తరాలు వచ్చాయి. ఒకటి అతడి భార్యకు, మరొకటి పేర్రాజుకు: ‘నేను శ్రీ శ్రీ శ్రీ నిత్యానంద స్వామివారి ఆశ్రమంలో వుంటున్నాను. పరమ పూజ్య గురుదేవులు భవబంధాలను తెంచుకోమని ఉపదేశించారు. ఇక్కడే పరమ ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను. నా భార్యా పిల్లలకు భుక్తికిలోటు లేకుండా ముగ్గురికీ మూడెకరాలూ, ఇల్లూ వుంచి తక్కిన భూమి, తోట అమ్మేసి, ఆ సొమ్ముతో ఇక్కడ స్థిరపడి భక్తిసాధన చేసుకుంటాను. తగిన బేరం చూసి అమ్మకానికి అన్నీ సిద్ధం చేస్తే, నేను వచ్చి, భూమిని స్వాధీనం చేసి, తక్కిన వ్యవహారాలన్నీ చక్కబరిచి, తిరిగి వెళ్ళిపోతాను. ఈ విషయంలో నాకు, నా గురువుగారే తప్ప ఎవరు ఏ విధంగా చెప్పినా ఎలాంటి ప్రయోజనం వుండదని గ్రహించగలరు!' అని వీర్రాజు ఆ ఉత్తరాల్లో రాశాడు.

ఉత్తరం చూసిన వీర్రాజు భార్యాపిల్లలు గోలగోల చేస్తూ పేర్రాజు ఇంటికి వెళ్ళారు. పేర్రాజు వాళ్ళను ఓదార్చి; నేను చెప్పినట్టుగా చెయ్యండి. మీ సమస్య పరిష్కారమవుతుందని నచ్చ చెప్పాడు. తర్వాత పేర్రాజు రెండు ఉత్తరాలూ తీసుకుని, గ్రామాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు పేర్రాజు ఇదివరకే, వీర్రాజు విషయమంతా చెప్పివుంచాడు. ఇప్పుడు ఈ రెండు ఉత్తరాలూ చూసి గ్రామాధికారి, పేర్రాజుతో కాస్సేపు చర్చించాడు.

నెల తిరక్కుండా వీర్రాజు ఉరుకులు పరుగుల మీద గ్రామానికి తిరిగి వచ్చాడు. తిన్నగా గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి, ‘‘అయ్యా! ఇంతటి అన్యాయం, మిత్రద్రోహం లోకంలో ఎక్కడా వుండదు. నమ్మి నా ఆస్తిపాస్తులను, భార్యాబిడ్డలను తనకు అప్పగించి వెళితే, ఈ మిత్రద్రోహి పేర్రాజు ఇంత పని చేస్తాడా? నా ఆస్తినంతా సొంతం చేసుకుని, నా భార్యాపిల్లల్ని దిక్కులేని వారిని చేసి, ఇంట్లోంచి గెంటేసి వీధిపాలు చేస్తాడా? వెంటనే వాడిని పిలిచి విచారణ చెయ్యండి. తగిన విధంగా వాణ్ణి శిక్షించి, నాకు న్యాయం జరిపించండి,'' అంటూ గొడవ చేశాడు.

గ్రామాధికారి చాలా ప్రశాంతంగా వీర్రాజు మొహంలోకి చూస్తూ, ‘‘ఇంతకూ నీకు జరిగిన అన్యాయమేమిటి? పేర్రాజు మీద నీ అభియోగాలేమిటి?'' అని అడిగాడు. ‘‘ఇంతకు ముందే పేర్రాజు చేసిన ద్రోహం గురించి విన్నవించుకున్నాను. నేను గురువును అన్వేషించడానికి బయలుదేరుతూ, నా ఆస్తిపాస్తుల వ్యవహారాలు కొంత కాలం చూసి పెట్టమని అడిగాను. ఇప్పుడా ద్రోహి నా ఆస్తిపాస్తులన్నిటినీ తన సొంతం చేసుకున్నాడు. మరి ఇది అన్యాయం కాదా?'' అన్నాడు వీర్రాజు ఆవేశంగా.

‘‘అది సరే. ఇంతకూ మీ గురువుగారు, నీకు చేసిన ఉపదేశమేమిటి?'' అని అడిగాడు గ్రామాధికారి. ‘‘భవబంధాలన్నీ పూర్తిగా వదిలించుకువస్తే, తిరుగు లేని మోక్ష సాధన మార్గం ఉపదేశిస్తామన్నారు,'' అని చెప్పాడు వీర్రాజు. ‘‘అయితే, నీకున్న అసలు భవబంధాలేమిటి?'' అని ప్రశ్నించాడు గ్రామాధికారి నెమ్మదిగా. ‘‘భవబంధాలంటే-భార్యాపిల్లలూ, బంధుమిత్రులూ. ఆస్తులూ అప్పులూ, ఇలాంటివన్నీ,'' అన్నాడు నసుగుతూ వీర్రాజు.

‘‘నీలో వైరాగ్యం బలపడిందనీ, భవబంధాలను వదిలించుకుంటున్నాననీ, నీ ఉత్తరాల్లో రాశావుకదటయ్యా. ఇక నీకు, ‘నాది, నాకు' అంటూ ఏముంటుంది చెప్పు? కనుక నువ్వు నీ గురువుగారి దగ్గరకు తిరిగిపోయి, ఆయన చెప్పినట్లుగా భాగవతసేవ చేసుకుంటూ చక్కగా తరించు. మరింక వెళ్ళిరా!''

అన్నాడు గ్రామాధికారి. ‘‘పని పూర్తికాకుండా తిరిగి రావద్దని మా గురువుగారు మరీమరీ చెప్పారు.నా ఆస్తి నాకు దక్కకుండా, ఇక్కడ నుంచి కదలను,'' మొండిగా చెప్పాడు వీర్రాజు. ఆ మాటలకు గ్రామాధికారి పెద్దగా నవ్వి, ‘‘నువ్వనే ఆ ఆస్తిపాస్తులు తనవేనంటూ పేర్రాజు దగ్గర పక్కాగా పత్రాలున్నాయి. అతడికి ఇప్పుడే కబురు పెడతాను, సరా!'' అన్నాడు. ‘‘ఆ పత్రాలన్నీ అతడు సృష్టించివుంటాడు,'' అన్నాడు వీర్రాజు కోపంతో ఊగిపోతూ. ‘‘నువ్వు అన్నీ వద్దనుకుంటున్నావు. నీకెందుకీ గొడవలన్నీ?''

అన్నాడు గ్రామాధికారి గంభీరంగా. ‘‘వద్దను కోవటమేమిటి? కావాలనే కదా వచ్చాను,'' అన్నాడు వీర్రాజు. ‘‘ఏం కావాలని వచ్చావయ్యా, వీర్రాజూ? ఆస్తిపాస్తులూ, భార్యాబిడ్డలా? లేక నీ గురువూ, ఆయన చెప్పిన భాగవతసేవా? నీలో పిసరంత వైరాగ్యం కూడా కనిపించడంలేదు,'' అన్నాడు గ్రామాధికారి కాస్తకటువుగా. అది వింటూనే వీర్రాజు ఆలోచనలో పడ్డాడు. గ్రామాధికారి అడిగినదాంట్లో తిరకాసు అతడికి అర్థమైంది. ‘‘మహాప్రభూ! నేను చేసిన పొరబాటు, నాకిప్పుడు అర్థమయింది. నన్ను మన్నించండి. నాకళ్ళు తెరుచుకున్నాయి!'' అంటూ గ్రామాధికారి కాళ్ళమీద పడ్డాడు. గ్రామాధికారి ప్రేమగా వీర్రాజును లేవదీసి, ‘‘సంతోషం, వీర్రాజూ!

నీలో ఇలాంటి మార్పురావడం కోసమే నేనూ, పేర్రాజూ ఈ నాటకమాడాం. నీ ఆస్తికీ, నీ కుటుంబానికీ చిన్నమెత్తు నష్టం కూడా లేదు, చూడు!'' అంటూ అతణ్ణి లోపలి గదిలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ పేర్రాజూ, వీర్రాజు భార్యాపిల్లలూ ఆతృతగా అతడికోసం ఎదురు చూస్తూ నిలబడివున్నారు.

పేర్రాజు, వీర్రాజును కౌగలించుకుని, ‘‘నీకు అప్పుడే చెప్పబోయాను; కానీ వినేస్థితిలో లేవని వూరుకున్నాను. నీకు కావలసింది ఇచ్చేవాడు, నీకు గురువు అవుతాడుగానీ, నీ నుంచి ఆశించేవాడు బరువు అవుతాడు తప్ప, గురువు ఎలా అవుతాడు?'' అన్నాడు చిన్నగా నవ్వుతూ. వీర్రాజు సిగ్గుతో తలదించుకుని చేతులు జోడించాడు.

5 సెప్టెంబర్, 2011

విఘ్నేశ్వరుడు

ఒకానొకప్పుడు లక్ష్మి మానస సరోవరంలో జలకమాడుతూండగా, పార్వతి విష్ణువు వేషం ధరించి లక్ష్మిని సమీపించింది. నవమోహ నంగా కనిపించిన నారాయణుని లక్ష్మి చూసింది. నారాయణుడి వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మి అద్భుత సౌందర్యం అత్యంత మనోహ రంగా కనిపించింది. ఇద్దరూ ఒకసారి సాభి ప్రాయoగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో సరోవరంలో ఒక స్వర్ణకమలం లేచింది.

అందులో ధగధగ మెరిసిపోతున్న పసిపాప ఉన్నది. లక్ష్మి, నారాయణుని దగ్గిరచేరి ఆప్యా యoగా కౌగలించుకోబోయింది. పార్వతి పగలబడి నవ్వుతూ,‘‘నేను నారాయణుడిని కాను, లక్ష్మీ!'' అని ఆ క్షణమే నిజరూపంతో కనిపించింది. లక్ష్మి, ‘‘అన్నకు తగ్గ చెల్లెలివే, నారాయణి అనిపించుకున్నావులే!'' అన్నది చిన్నగా నవ్వుతూ. పార్వతి, ‘‘అప్పుడు విష్ణువు మోహినీ రూపంతో శివుణ్ణి మాయబుచ్చినదానికి ఇది చెల్లువేసుకో!''అన్నది. స్వర్ణకమలంలోని పసిదాన్ని చూసి ఇద్దరూ మురిసిపోయారు. 

అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి,‘‘తల్లులారా! మీ ఇద్దరి అంశలతో అవత రించిన ఈ బిడ్డ పార్వతి పరంగా జయ, లక్ష్మి పరంగా శ్రీ కలిసి జయశ్రీగా పెరుగుతుంది. ఆమెకు వరుడు కూడా శివకేశవుల అంశలతో అవతరించి ఉన్నాడు!'' అని చెప్పి, పసిదానితో ఉన్న స్వర్ణకమలాన్ని తీసుకువెళ్ళి కావేరీ నదిలో ఉంచి రమ్మని వాయుదేవుడికి చెప్పాడు.
వాయుదేవుడలాగే జయశ్రీని కావేరినదికి చేర్చాడు. దక్షణ ప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణ కమలంలో కనిపించిన బాలికను, వరప్రసా దంగా లభించిన పుత్రికగా భావించి, పరమా నందంతో తీసుకువెళ్ళి, నామకరణ మహో త్సవం జరిపించుతూండగా, ఆకాశవాణి, ‘‘జయశ్రీ అని పిలవండి!'' అని పలికింది.

జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాల్లో అంత సౌందర్యవతి, సాహసవంతురాలు ఉండదనిపించుకున్నది. జయశ్రీకి రాజభవనం కంటే ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండే అరణ్యాల్లో విహ రించడమే ఇష్టంగా ఉండేది. ఎల్లప్పుడూ విల్లమ్ములు ధరించి, అరణ్య మధ్యానికి వెళ్ళి వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూండేది. హరిహరాంశలతో అవతరించిన స్వామి కైలాసం వెళ్ళి, విఘ్నేశ్వరుణ్ణి, కుమారస్వామిని కలుసుకోవాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటు న్నాడు.

ఒకనాడు అలాగే బయలుదేరి కైలాసం వెళ్ళాడు స్వామి. విఘ్నేశ్వరుడు, కుమార స్వామి ఆనందంగా ముచ్చటలాడుతూ, మానససరోవరం జలవిహారం చేస్తూండగా, విఘ్నేశ్వరుడు, ‘‘ఈ మానససరోవరంలోనే లక్ష్మీ పార్వతుల అద్భుత తేజస్సులతో స్వామికి కాబోయే దేవేరి ఉదయించింది!'' అని ఊరు కున్నాడు. స్వామికి కుతూహలం కలిగినా అణుచు కొని, మరి కొంతకాలం అక్కడ గడిపి, వెళ్ళ బోతున్నప్పుడు, విఘ్నేశ్వరుడు, 

‘‘స్వామీ! మాకంటే పెద్దవాడివైన నీవు బ్రహ్మచారిగా ఉండటం బాగాలేదు. సత్వరంగా నీకు కళ్యా ణంతప్పదు!'' అన్నాడు. కుమారస్వామి, విఘ్నేశ్వరుడు స్వామికి ఘనంగా వీడ్కోలు ఇచ్చారు. స్వామి నిజ నివాసానికి చేరుకున్నాడు. ఒకనాడు స్వామి వినోదంగా పెద్దపులి మీద స్వారీ చేస్తూ అరణ్యంలో తిరుగుతూండగా, పులిని ముందుకూ, అటు ఇటూ కదల నివ్వ కుండా చుట్టూరా బాణాలు రివ్వురివ్వున నాటుకున్నాయి. స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూశాడు. ఆయన కోపం పటా పంచలైంది. విల్లమ్ములతో ఠీవిగా నిల్చుని చిరునవ్వు విసిరిన జయశ్రీ కనిపించి, స్వామి గుండెలో బాణంలాగ గుచ్చుకున్నది. స్వామి అంతర్థానమయూడు. జయశ్రీకి స్వామిని గురించి విఘ్నేశ్వరుడు కలలో కనిపించి అదివరకే చెప్పిఉన్నాడు.
అతనికోసమే వెతుకుతూ అరణ్యాల్లో తిరుగు తున్నది. నారదుడి ఆదేశంతో, చక్రవర్తి జయశ్రీకి స్వయoవరం ఏర్పాటు చేశాడు. రాజాధిరాజు లుగా మారురూపాలతో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు. స్వామి ఒక సాధారణ శబర యువకుడి రూపంతో విల్లమ్ములు ధరించి, పెద్ద నల్లని కుక్కను వెంటబెట్టుకొని వచ్చాడు. రాజాధిరాజులు ఠీవి ఒలకబోస్తూ శబర  యువకుణ్ణీ, అతని పెంపుడు కుక్కనూ ఎక సక్కెం చేశారు.స్వామి సింహద్వారానికి అడ్డంగా, అందర్నీ కారాగారంలో బందీలు చేసినట్టు కుక్కమీద కూర్చున్నాడు. కుక్క పెద్ద„పులిగా మారింది. భయoకరంగా గాండ్రుమన్నది. జశ్రీ స్వామిని గుర్తించి చరచరా వచ్చి వరమాల వేసి వరించింది. స్వామి జ శ్రీని పులిమీద ముందు కూర్చుండబెట్టుకున్నాడు. దేవతలకు కోపం వచ్చింది. శబరయువకుడి మీద ఒక్కుమ్మడిగా విరుచుకుపడి, ఆయుధాలు తీశారు.

స్వామి విల్లమ్ములు తీసి అందర్నీ ఎదుర్కొన్నాడు. అతని బాణప్రెూగధాటికి దేవతలు చెల్లాచెదరై, నిజరూపాలతో అస్ర్తాలు ప్రయే గించారు. స్వామిని ఎలాంటి అస్ర్తమూ తాకలేక పోయింది. ఇంద్రుడి వజ్రాయుధం కూడా పనికిమాలినదైంది. అప్పుడు స్వామి తన నిజ రూపంతో హరిహరస్వామిగా సాక్షాత్కరిం చాడు. దేవతలు చేతులు మోడ్చారు, ‘‘శరణం స్వామీ!'' అన్నారు. స్వామి జశ్రీల కళ్యాణం దేవాదిదేవ తలమధ్య మహావైభవంగా జరిగింది. జశ్రీతో కలిసి స్వామి ఆనందంగా నిజనివాసానికి వెళ్లాడు. త్రేతాయుగంలో ఆర్యావర్తంలో కోసలుడు, కేకయుడు, వసుమిత్రుడు అనే రాజులు ముగ్గురూ ఆప్తమిత్రులుగా ఉండేవారు. కోసలుడికి కౌసల్య, కేకయుడికి కైకేయి, వసుమిత్రుడికి సుమిత్ర అనే కుమార్తెలు ఉన్నారు. అెూధ్యను పాలించే దశరథుడికి తమ కుమార్తెలను ఇచ్చి పెళ్ళి చేయాలని ముగ్గురు రాజులకూ ఏకాభిప్రాయoకలి గింది.

దశరథుడు వారిని వివాహమాడడానికి అంగీకరించాడు. ముగ్గురు రాజులూ జైమినిమహర్షి చేత వివాహానికి తగిన లగ్నం పెట్టించారు. జైమిని ముహూర్తం నిర్ణయించి, ‘‘నేను పెట్టిన ముహూర్తబలం ఎటువంటిదంటే, విఘ్నేశ్వరుడి సాక్షగా ఈ ముగ్గురి వివాహం దశరథుడితో జరిగితీరుతుంది! అయితే, వివాహం జరిగే ముందు రాకుమార్తెలకు ఒక రాక్షస గండం కనిపిస్తున్నది.కనుక, వధువులు ముగ్గుర్నీ చాలా జాగ్రత్తగా ఉంచాలి!'' అని చెప్పాడు. ముగ్గురు కన్యలనూ రాజులు ఒక పెద్ద పెటె్టలో భద్రంగా దాచారు. ఆసమయoలో లోకసంచారం చేస్తూ, లంకకు చేరిన నారదుడు రావణాసురుడితో, ‘‘లంకేశ్వరా! అతి త్వరలోనే దశరథుడికి ముగ్గురు రాజకుమార్తెలతో వివాహం కాబో తున్నది. దశరథుడి కుమారుడు నిన్ను హతమారుస్తాడు!'' అని చెప్పాడు.

రావణుడు రాకుమార్తెలను ఎత్తుకు రమ్మని మహోదరుడు అనే గొప్ప రాక్షసుణ్ణి పంపాడు. మహోదరుడు కన్యలను పెటె్టలో భద్రపరిచినది కనిపెట్టి, ఆ పెటె్టను మ్రింగే శాడు. వాడు ఆకాశమార్గంగా సముద్రం మీదుగా లంకకు వెళ్తూండగా, కడుపు నొప్పి వచ్చి పెటె్టను కక్కేశాడు. సముద్రంలో పడి పెటె్ట కెరటాలమీద మెల్లగా కొట్టుకుంటూ పోయింది. దశరథుడు సముద్రం మీద దూరతీరా లకు వెళ్ళి పెద్ద నౌకలో తిరిగి వస్తున్నాడు. ప్రయాణం ఆలస్యమైంది.

అనుకున్ననాటికి చేరలేకపోతున్నందుకు విచారిస్తూ, దశరథుడు సముద్రాన్ని చూస్తూండగా, నౌకవైపే కొట్టుకొని వస్తున్న పెద్ద పెటె్ట కనిపించింది. పెటె్ట నౌకను ఢీకొని పైకప్పు ఊడిపోయింది. అందులో రాకుమార్తెలు కనిపించారు. తాళ్ళ నిచ్చెనలతో వాళ్ళను నౌక మీదకు రప్పించాక, ఆ ముగ్గురూ తాను వివాహం చేసుకోనున్న పెండ్లికుమార్తెలే నని దశరథుడు తెలుసుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి జైమినిమహర్హి ముహూర్తం పెట్టాడు.

అప్పుడు అక్కడ విఘ్నేశ్వరుడు ప్రత్య క్షమై, ముగ్గురు రాకుమార్తెలతో దశరథుడి వివాహం జరిపించి, అంతర్థానమయాడు. ముగ్గురు వధువులతో దశరథుడు ఆనందంగా స్వదేశం చేరుకున్నాడు. చిరకాలానికి దశరథుడికి నలుగురు కుమారులు పుట్టారు. పెద్దవాడైన రాముడు కైకేయి కారణంగా సీతతో, లక్ష్మణుడితో అరణ్యవాసం వెళ్ళాడు. రావణుడు సీతను ఎత్తుకుపోయి లంకలో పెట్టాడు.రాముడు హనుమంతుడు, సుగ్రీవుడు మొదలైన వాన రుల సహకారంతో లంకను ముట్టడించి, రావణ సంహారం చేశాడు. ఆ తరవాత సీతతో పుష్పక విమానంలో బయాలుదేరి, వారధి కట్టడం ప్రారంభించిన సముద్రతీరంలో ఆగి, అక్కడ శివపూజ జరిపి, అెూధ్యకు వెళ్ళా లనుకున్నాడు.
శివలింగ ప్రతిష్ఠకు తగిన లింగాన్ని తీసుకు రమ్మని హనుమంతుడిని కైలాసానికి పంపాడు. హనుమంతుడు మనోవేగంతో కైలాసం చేరు కొని, అక్కడ ఉన్న శివలింగాల్లో పెద్ద లింగాన్ని చూసి రెండు చేతులతో ఎత్తబోయాడు. లింగం కొంచమైనా కదల్లేదు. దానికంటే చిన్న లింగాన్ని తీయబోయాడు. అదీ కదల్లేదు. చివరికి అన్నిటికంటే చిన్నలింగాన్ని కూడా ఎత్తలేకపోయాడు. కాలం మించిపోతున్నది.

తన అసమర్థ తకు హనుమంతుడు విచారిస్తుండగా, బుడి బుడి నడకలతో అక్కడికి ఒక పిల్లవాడు వచ్చాడు. ‘‘ఎవరనీవు? హనుమం తుడిలాగే ఉన్నావు, కాని కావు!'' అన్నాడు పిల్లవాడు. ‘‘నేను హనుమంతుడినే! ఒక శివలిం గాన్ని తీసుకురమ్మని రాముడు పంపాడు. ఇంతకూ, నీవెవరవోయి, బాలుడా?'' అన్నాడు హనుమంతుడు. ‘‘ ఇక్కడి లింగాలను ఎవరూ ఎత్తుకు పోకుండా నన్ను కాపలా ఉంచారు గాని, నీవు హనుమంతుడవని చెబుతున్నావు, హను మంతుడు శివుడి అవతారమే అనీ, పంచ ముఖాంజనేయడనీ విన్నాను.నీ పంచ ముఖాలు ఏవీ?'' అన్నాడు పిల్లవాడు అమాయకంగా. అప్పుడు హనుమంతుడు గరుడ, వరాహ, సింహ, అశ్వముఖాలను కలుపుకొని, పంచ ముఖాంజనేయడై, ఉన్నతంగా పెరిగి పిల్ల వాడితో నవ్వుతూ, ‘‘విఘ్నేశ్వరా! నా వంతు అయింది. పంచముఖ విఘ్నేశ్వర రూపంతో కనిపించడం నీ వంతు!'' అన్నాడు.

అప్పుడు బాలుడి రూపంలో ఉన్న విఘ్నేశ్వ రుడు, ఐదు తలలతో సమాన ఎత్తున పెరిగి విశ్వరూపంతో కనిపించాడు. హనుమంతుడు పంచముఖ విఘ్నేశ్వ రుడికి నమస్కరించి, ‘‘పిల్లవాడి రూపంతో వస్తున్నప్పుడే విఘ్నేశ్వరుడివని గ్రహించాను. ఇక్కడి శివలింగాలు కదలకుండా చేసింది నీవే కదా? నీవే ఒక లింగాన్ని ప్రసాదించు!'' అన్నాడు. విఘ్నేశ్వరుడు, ‘‘హనుమా!నీ పంచముఖ రూపం చూడాలన్న కుతూహలంతో నేను ఇలా చేశాను. నీవు శివాంశతో పుట్టినవాడవు, నీకు అడ్డేమిటి? అయినా అడిగావు గనక విశేషాంశలు గల లింగాన్ని నీకు ఇవ్వాలనే, ఎంచి ఉంచాను, తీసుకువెళ్ళు,'' అని చెబుతూ, హనుమంతుడి దోసిట్లో గొప్పదైన జ్యోతిర్లింగాన్ని ఉంచాడు. హనుమంతుడు మామూలు రూపంతో దోసి ట్లోని లింగాన్ని పదిలంగా పట్టుకొని, రివ్వున ఎగిరివెళ్ళాడు.

అప్పటికి కాలాతిక్రమణ జరిగింది. సమయo మించిపోకుండా సీతాదేవి ఇసు కతో శివలింగాన్ని చేసింది. రాముడు జలాభి షేకం చేసి, పూజకు ఉపక్రమించ బోతూండగా, హనుమంతుడు లింగంతో అక్కడ వాలాడు. హనుమంతుడు జరుగుతున్నది చూసి, తోకతో సైకతలింగాన్ని చుట్టి తీసివేయబోయడు. కాని ఇసుక లింగం చెక్కుచెదర లేదు. హనుమంతుడు మరింత తోక గట్టిగా బిగించి లాగితే తోక నొప్పిపెట్టిందేగాని లింగం ఏమాత్రం కదల్లేదు.

అప్పుడు రాముడు హనుమంతుణ్ణి శాంత పరిచి, ‘‘హనుమా! బుద్ధిమంతులు కూడా ఒక్కొక్కప్పుడు పొరపాటు పడుతూంటారు సుమీ! అన్నీ తెలిసినవాడివి, సైకతలింగ మైనా, అది శివునికి ఆనవాలు కదా? ఇంతకూ, ఇప్పుడేం మించిపోయిందిగనక. నీవు తెచ్చిన లింగాన్ని సైకతలింగం దాపునే ప్రతిష్ఠించి, పూజించి మరీ వెళతాను!''అని చెప్పాడు.హనుమంతుడు తను తెచ్చిన లింగాన్ని రాముడికి ఇచ్చి, లెంపలు వేసుకొని సైకత లింగానికి మ్రొక్కాడు. రాముడు హనుమంతుడు తెచ్చినలిం గాన్ని ప్రతిష్ఠించి, యధావిధిగా పూజాక్రమం సీతతో కలిసి జరిపిన పిమ్మట, అందరితో పుష్పకం మీద అయోధ్యకు చేరి, పట్టాభిషిక్తుడయూడు.

4 సెప్టెంబర్, 2011

రాజకుమార్తెలు

కర్మపూరు రాజయిన బోపదేవుడికి మగ పిల్లలు లేరు. ఇద్దరు కుమార్తెలు మాత్రం ఉన్నారు. వారు కవలపిల్లలు. కాని వారిలో ఒకతె తెల్లనిది. ఆమె పేరు శ్వేత. రెండవ పిల్ల నల్లనిది. ఆమె పేరు కృష్ణ. రంగులో తేడా ఉన్నా, ఇద్దరూ ఒకే పోలిక. ఇద్దరు పిల్లలూ చాలా గారాబంగా పెరిగి పదేళ్ళ వయసుగల వాళ్లయ్యారు.

ఒకనాడు శ్వేతా, కృష్ణా ఉద్యానంలో నడుస్తూండగా, ఒక చెట్టు మీది నుంచి ఒక పక్షిగూడు వాళ్ళ కాళ్ళముందు పడింది. వాళ్ళు బెదిరిపోయి, పెద్ద పెట్టున ఏడవసాగారు. అది విని పరిచారకులు పరిగెత్తుతూ వచ్చి, పక్షిగూడు చూశారు. అందులో రెండు గుడ్లు ఉన్నాయి. పరిచారకులు ఆ గూటిని గుడ్లతో సహా మల్లెపొదలలో పారేసి, రాజకుమార్తెలను రాజభవనంలోకి తీసుకుపోయారు.కాని భయంతో రాజకుమార్తెలకు జ్వరం తగిలింది. ఆస్థాన వైద్యుల చికిత్సలతో ఆ జ్వరం ఏమాత్రం తగ్గలేదు. ఒక రాత్రి రాజుకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో రాజు తన ఉద్యానవనంలో ఒక పంచరంగుల పక్షిని చూశాడు. ఆ పక్షి మనుష్యభాషలో రాజుతో ఇలా అన్నది:

‘‘రాజా, నేను దేవతా పక్షిని. నేను ఈ తోటలో ఒక చెట్టుమీద గూడుకట్టి, అందులో రెండు గుడ్లు పెట్టాను. వాటిని పొదిగి పిల్లలను చేసి, నీ కుమార్తెలకు బహుమానంగా ఇద్దామనుకున్నాను. కాని, మూఢులైన నీ పరిచారకులు ఆ గుడ్లను మల్లెపొదలలో పారేశారు.'' ‘‘నేను ఇప్పుడే ఆ గుడ్లను వెదికి తెప్పిస్తాను,'' అన్నాడు రాజు. ‘‘అది ఇప్పుడు సాధ్యం కాదు. అవి చిట్లటమూ; వాటి నుంచి పిల్లలు బయటికి వచ్చి ఎగిరి పోవటమూ జరిగింది. అవి ఇప్పుడు నీ రాజ్యంలో పడమటగా ఉన్న కొండశిఖరం మీద ఉంనువ్వు స్వయంగా ఆ శిఖరం ఎక్కి, వాటిని తీసుకువచ్చి, వాటికి ఇంపుగా ఉండే ఆహారం పెట్టాలి. అవి తృప్తిపడితే నీకు రెండు గుడ్లు ఇస్తాయి. అయిదేళ్ళ అనంతరం ఆ గుడ్లు వజ్రాలుగా మారిపోతాయి. కొండశిఖరం ఎక్కి ఆ పక్షులను నువ్వు రాజభవనానికి తీసుకురాగానే నీ పిల్లల జ్వరం తగ్గిపోతుంది,'' అన్నది పక్షి.

‘‘ఆ కొండ శిఖరం నిటారుగా ఉంటుంది. దాన్ని ఎక్కటం అసాధ్యం. ఆ శిఖరం మీదికి ఎవరూ, ఎన్నడూ ఎక్కి ఉండలేదు,'' అన్నాడు రాజు. ‘‘నువ్వు ఎలా ఎక్కుతావో నాకు తెలీదు. కాని నువ్వు ఆ పక్షులను తెచ్చేదాకా నీ పిల్లల జ్వరం ఎలాంటి చికిత్సలు చేసినా తగ్గదు. ఇంకొకటి ఏమిటంటే, గుడ్లు వజ్రాలుగా మారినప్పుడు ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి గులాబి రంగులో ఉంటుంది.

శ్వేత, గులాబి రంగుగల వజ్రాన్ని తీసుకోవాలి. కృష్ణ, తెల్లని వజ్రాన్ని తీసుకోవాలి. అలా చెయ్యకపోతే ఇద్దరికీ ప్రమాదమే,'' అని చెప్పి పక్షి మాయమయింది. బోపదేవుడు వెంటనే నిద్రలేచి, రాణికి తన కల గురించి చెప్పాడు. మర్నాడు ఉదయం ఆయన తన మంత్రులను సమావేశపరిచి. వారితో తన కల గురించి చర్చించాడు. వాళ్ళు ఏమీ చెప్పలేక పోయారు. రాజు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించాడు.

అకస్మాత్తుగా దేవుడి విగ్రహం కింది నుంచి ఒక ఉడుము ఇవతలికి వచ్చి, గోడ మీదికి పాకి, మళ్ళీ గోడ దిగి, రాజుకు సమీపంగా వచ్చి నిలిచింది. రాజపురోహితుడు రాజుతో, ‘‘మహారాజా, దేవుడు తమపట్ల అనుగ్రహించి, తమకు సహాయంగా ఉడుమును పంపాడు,'' అన్నాడు. ‘‘ఇది నాకు ఎలా సహాయపడుతుంది, శాస్ర్తిగారూ?'' అన్నాడు రాజు. ‘‘అదే చూపింది గద! కోటగోడలలాటివి ఎక్కటంలో ఉడుములాటిది మరొకటి లేదు. దాని పట్టు అమోఘం. దాని నడుముకు తాడు కట్టి కొండశిఖరం మీదికి పంపితే, ఆ తాడు పట్టుకుని మీరు నిశ్చింతగా పైకి ఎక్కవచ్చు,'' అన్నాడు రాజపురోహితుడు ఎంతో నమ్మకంతో.

ఎందుకైనా మంచిదని శిఖరం దిగువన బలమైన వలలు, రాజుగారు కింద పడితే దెబ్బ తగలకుండా, ఏర్పాటు చేశారు. ఉడుముకు మంచి బలమైన తిండి పెట్టారు. ఒక రోజు ఉదయం రాజు తన ఖడ్గమూ, ఆహారమూ, నీరూ తీసుకుని సైనికులు వెంటరాగా కొండకు బయలుదేరాడు. ఉడుము నడుముకు తేలికగానూ, దృఢంగానూ ఉండే తాడు కట్టి, శిఖరం మీదికి పంపారు. అది పైకి చేరగానే ఇద్దరు సైనికులు తాడును లాగి పట్టుకున్నారు. వెంటనే ఉడుము రాతిని కరుచుకున్నది. ఇద్దరూ పట్టి లాగినా ఉడుము తన పట్టు వదలలేదు. తరవాత రాజు దైవధ్యానం చేసుకుని ఆ తాడు పట్టుకుని పైకి ఎక్కి వెళ్ళాడు. దిగువన రాజుగారి మనుషులూ, రాణీ భయపడుతూ నిలబడి ఉన్నారు.

రాజు శిఖరం మీదికి చేరేసరికి సూర్యుడు అస్తమించి, పూర్ణచంద్రుడు ఉదయించాడు. రాజు తాడును ఉడుము నడుము నుంచి ఊడదీసి, దాని కొసను ఒక బలమైన కొండరాయికి బిగించాడు. చంద్రకాంతిలో ఆయనకు ఒక పొట్టి చెట్టు కనబడింది. దాన్ని సమీపించేటప్పుడు ఆయనకు దాని మీద రెండు పక్షులు కనిపించాయి. ఆ చెట్టు మొదలును ఒక రెండు తలల పాము చుట్టుకుని ఉండి, ఆయనను చూసి తన రెండు పడగలూ విప్పి, నోళ్ళు తెరిచి, కోరలు బయటపెట్టింది. రాజు తన కత్తితో బలంగా కొట్టి, పాముతలలు నరికేశాడు.

బోపదేవుడు చెట్టు మీది పక్షులనూ, ఉడుమునూ తీసుకుని శిఖరం దిగి కిందికి చేరేసరికి తెల్లవారవస్తున్నది. కింద ఉంచగానే, ఉడుము చిత్రంగా రెక్కలు పెంచుకుని, ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆయన పక్షులతో సహా ఇల్లు చేరుకునే సరికి రాజకుమార్తెలకు జ్వరం పోయింది. మర్నాడు పక్షులు రెండు గుడ్లు పెట్టి, మాయమైపోయాయి.
రాజు ఆ గుడ్లను ఒక వెండిబుట్టలో ఉంచి, దాన్ని ఇనపపెట్టెలో భద్రం చేయించాడు. అయిదేళ్ళు గడిచాయి. శ్వేతా, కృష్ణా పెరిగి, పదిహేనేళ్ళవాళ్ళు అయ్యారు. రాజు ఇనపపెట్టె తెరవగానే దానినుంచి కాంతికిరణాలు వెలువడ్డాయి. గుడ్ల స్థానంలో రెండు వజ్రాలు ధగధగా మెరుస్తూ కనిపించాయి. ఒకటి తెల్లగా ఉన్నది. రెండోది గులాబి రంగుగా ఉన్నది. వాటిని రాజు బయటికి తీయించినప్పుడు రాజకుమార్తెలు అక్కడే ఉన్నారు.

రాజు వారితో, ‘‘అమ్మళ్ళూ, ఈ వజ్రాలు మీకే! ఇవి మీకు అదృష్టం కలిగిస్తాయి. ఏ వజ్రం ఎవరిది అన్న విషయం మీరు విచారించకండి. ఇవాళ సాయంకాలం మీ కిద్దరికీ తెల్ల సంపంగిపూలు కూజాల్లో పెట్టి ఇస్తాను. మీరు రోజూ ఆ పూలను గమనిస్తున్నట్టయితే, ఏ వజ్రం ఎవరిదో మీకే తెలిసిపోతుంది,'' అన్నాడు. ఆ రోజే ఆయన ఆస్థాన ఐంద్రజాలికుడైన మాయాపాలుణ్ణి రహస్యంగా తన అభ్యంతర మందిరానికి పిలిపించి, ‘‘వజ్రాలు వచ్చాయి. ఇక నీ ఇంద్రజాలం ప్రయోగించే సమయం వచ్చింది,'' అన్నాడు. ‘‘అదంతా మీరే సులభంగా చెయ్యవచ్చు గదా, మహారాజా! శ్వేతకు ఇచ్చే తెల్ల సంపంగిపూల పాత్రలో కొంచెం ఎరస్రిరా కలిపి, పూలకాడలు అందులో ముణిగేటట్టు అమర్చటమే గదా! క్రమంగా పూల రెక్కలు వాటంతట అవే గులాబిరంగుకు మారతాయి. ఇదంతా రెండు రోజులకు ముందే మీకు వివరంగా చెప్పేశానుగా?'' అన్నాడు మాయాపాలుడు.

‘‘చెప్పావనుకో, అయినా అది నీ చేతి మీదుగా జరిగితేనే బాగుంటుంది గదా!'' అన్నాడు రాజు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ రాత్రి శ్వేతకూ, కృష్ణకూ రెండు గుత్తుల తెల్ల సంపంగిపూలు పాత్రలతో సహా అందాయి. పాత్రల మీద ఇద్దరి పేర్లూ స్పష్టంగా రాసి ఉన్నాయి. వాళ్ళు ఆ పాత్రలను తమతమ గదులలో ఉంచుకుని, పూలను శ్రద్ధగా గమనిస్తూ వచ్చారు. కృష్ణకు ఇచ్చిన పూలు మొదట ఉన్నట్టే తెల్లగా ఉండి పోయాయిగాని, శ్వేత కిచ్చిన పూలు మర్నాటికే రంగు మారనారంభించాయి.

ఈ సంగతి తెలియగానే బోపదేవుడు తన కుమార్తెల వద్దకు వెళ్ళి, ‘‘అమ్మాయిలూ, ఏ వజ్రం ఎవరిదో ఇప్పుడు మీకు తెలిసింది గద?'' అంటూ పళ్ళెంలో ఉన్న వజ్రాలు చూపాడు. శ్వేత, గులాబీ వజ్రాన్ని తీసుకున్నది. కృష్ణ తెల్ల వజ్రాన్ని తీసుకున్నది. మాయాపాలుడి మాటా? ఎంతో గడ్డు సమస్యను తేలిగ్గా పరిష్కరించినందుకు అతనికి బోపదేవుడి నుంచి మంచి బహుమానమే లభించింది.