13 డిసెంబర్, 2011

పరమానందయ్య శిష్యుల కథలు

పరమానందయ్య గారికి ఒక శుభకార్యం జరిపినవలసి వచ్చింది.  దానికి కొంత డబ్బు అవసరమయింది.  అందుకని చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి ధన, కనక, వస్తు వాహనాలు  విరాళాలు సేకరించుకురావాలని శిష్యులను వెంటబెట్టుకుని  బయలుదేరారు. నాలుగయిదు గ్రామాలు తిరిగేసరికి వారికి విరాళాలు బాగానే వచ్చాయి. అప్పటికే సాయంత్రమయిపోయింది.

దారిలో ఒక ఏరు అడ్డు వచ్చింది. ఆ ఏరు మోకాలిలోతు మాత్రమే ప్రవహిస్తుంది.  అది చూసిన శిష్యుడికి బాగా కోపమొచ్చింది.  “మా గురువుగారితో కలసి శిష్యులం వస్తుంటే మా ప్రయాణం ఆపాలనే దుర్భుద్దేమిటి ఈ ఏరుకి? దీనికి గురువుగారన్నా భయం లేదు, అనుకుని “గురువుగారు మీరు హాయిగా విశ్రాంతి తీసుకొండి, ఈ నది పొగరు మేము చూసుకుంటాం” అంటూ గురువుగారికి విశ్రాంతి నిచ్చారు.

శిష్యులంతా బాగా అలోచించి.. ఏరుకి ‘చురుకెయ్యడానికి ‘ నిర్ణయించున్నారు. ఒకడు కాగడా తయారు చేసి మంట అంటించాడు.  ఆ కాగడాను శబ్ధం చేయకుండా ఏటిలోకి వెళ్ళాడు.  ఆ  కాగడాని ఏరులో ముంచాడు.  వెంటనే అది చుయ్మని శబ్ధం చేసింది. దానికి, ఆ శిష్యుడు భయపడిపోయి పరిగెత్తుకొంటూ వచ్చి పడ్డాడు. ఈ గోలకి గురువుగారికి మెలకువ రాలేదు.  ఆయనకు గాఢనిద్ర పట్టేసింది.  అది చూసిన మిగతా శిష్యులు , “ఏమయిందిరా?” అని అడిగారు. “ఏరు పడుకోలేదురా.. మెలకువగానే ఉంది.  నేను వాతపెట్టబోతుంటే పగబట్టిన నాగుపాములా బుస్సుమని పెద్ద పెద్ద కెర్టాలతో నన్ను కాటేసింది” అంటూ వణికిపోతూ … భోరుమని ఏడిచేశాడు.

అదే సమయంలో అటునునుంచొక యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ దాటడం చూసిన శిష్యుల ఆశ్చర్యానికి అంతులేదు.  ఈ యువకుడు ఎంత ధైర్యంగా వస్తున్నాడో ! ఏరు నిద్దరోతుందేమో.. అందుకే వాడినేమి అనలేదు అనుకుని.. “ఇది మంచి సమయం. ఏరు నిద్రపోతుందో లేదో చూసిరా.. మనం కూడా దాటేద్దాం” అన్నాడు మరో శిష్యుడు. సరేనని ఓ శిష్యుడు నుదుటన వీభూది పెట్టుకుని.. ఆంజనేయ  దండకం చదువుతూ  ఏటి ఒడ్డుకు బయలుదేరాడు.  ఏరులోకి వెల్ళి మెల్లగా శబ్ధం చేయకుండా తన చేతిలోని కాగడాను ముంచాడు.  కాగడాకి నిప్పులేదు కనుక నీళ్ళు ఏ శబ్ధం చేయలేదు.

ఏటినుండి ఏ శబ్ధం రాకపోయేసరికి ఆ శిష్యుడు పరుగెత్తిపోయి తన వారి దగ్గరకొచ్చి – “ఏరు నిద్దరోతోంది. ఇదే మంచి సమయం. అందరూ తయ్యారవ్వండి” అని హడావిడి చేశాడు. శిష్యులు – గురుగారినెంత లేపిన ఆయనకు మెలకువ రాలేదు. ఆయనను మోసుకుపోదామనుకున్నారు.  అందరూ దేవుణ్ణి ప్రార్థించుకుని, మూటల్ని గురువుగారిని ఎత్తుకుని మొత్తానికి అవతలి ఒడ్డుకు చేరారు.అయినా గురువుగారికి మెలకువ రాలేదు.  ఏరు దాటిన ఆనందంతో శిష్యులంతా గంతులేశారు. ఇంతలో వాళ్ళలో ఓ శిష్యుడు అందరినీ వరుసగా నిలబడమని చెప్పాడు.  అందరూ గోల ఏయకుండా నిశ్శబ్ధంగా వరుసలో నిలబడ్డారు.

“ఎందుకు?” అని అడిగాడు ఓ శిష్యుడు. “మనమంతా ఇవతలి ఒడ్డుకు వచ్చామో లేదో” అని అన్నాడా శిష్యుడు. “ఐతే ఇప్పుడేం చెయ్యాలి? అనం పన్నెండు మందిమి. గురువుగారు కాక శిష్యులం పన్నెండుమందిమి.” ఆ శిష్యుడు ఒక్కొక్కరిని లెక్కపెట్టడం మొదలుపెట్టాడు.  అతన్ని వదిలి మిగిలిన పదకొండుమందిని లెక్కపెట్టాడు ఆ వెర్రి శిష్యుడు. “బాబోయ్ .. మనలో ఒకర్ని ఏరు మింగేసింది” అని గట్టిగా అరిచాడతను. “అవతలి ఒడ్డున ఉండిపోయాడేమో” అన్నాడు ఓ శిష్యుడు. లేదు నేను వెనక్కి తిరిగి చూశాను కదా” చెప్పాడు శిష్యుడు. “అంటే నిజంగానే ఏరు మింగేసిందన్నమాట” అంటూ శిష్యులంతా భోరున ఏడుస్తూ ఏరుని శాపనార్థాలు పెట్టసాగారు. అంతలో అటుగా భుజాన కర్రపట్టంకుని ఓ బాటసారి వస్తున్నాడు. శిష్యులను చూసిన ఆ రైతు వారిని సమీపించి, “మీరెవరు?  ఎందుకు బాధపడ్తున్నారు” అని ప్రశ్నిచాడు.

“మా గురువుగారు పరమానందయ్యగారు, మేము ఆయన పన్నెండుమంది శిష్యులం.  మేమంతా కలసి ఏరుదాటుకొస్తుంటే అది మాలో ఒకర్ని మింగేసింది.” అని చెప్పారు శిష్యులు. “బాటసారి వారిని ఒకసారి లెక్కపెట్టి చూశాడు. శిష్యుల తెలివి తక్కువతనం అతనిని అర్థమయ్యింది.  అందుకే వారిని ఆటపటించాలనుకున్నాడు “నేనెవరిని” అని అడిగాడు బాటసరి శిష్యులని. “తెలియదు” అన్నారు శిష్యులు “ఇంతకీ మీరెవరు?” అన్నాడు ఓ శిష్యుడు. “నేనెవరో ఓరికే చెప్పేస్తానా? మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత ఇస్తే చెబుతాను” అన్నాడు బాటసారి చాలా తెలివిగా.
మనం అన్ని విషయాలు తెలుసుకొవాలని గురువుగారు చెప్పారు కదా? అందుకని ఇతనెవరో తెలుసుకుందాం అనుకున్నారంతా. బాటసారికి ఓ మూట ఇచ్చి “చెప్పు నువ్వెవరు?” అని అడిగారు.“నేను మారువేషంలో ఉన్న మాంత్రికుడిని. భూత పిశాచాలను పారద్రోలుతాను”.  అన్నాడు“నువ్వు ఏరు మింగేసిన మా వాడిని తీసుకురాగలవా?” అన్నాడు ఓ శిష్యుడు. “తీసుకువస్తాను కాని కొంచం ఖర్చవుతుంది” అన్నాడు బాటసారి.
“మనిషికంటే డబ్బు ముఖ్యం కాదని మా గురువుగారు చాలాసార్లు చెప్పారు ఇదిగో మరో మూట” అని డబ్బు ఇచ్చారు. అప్పుడు ఆ బాటసారి ఏదో ఓ పిచ్చిమంత్రం చదువుతున్నట్లు నటించాడు.  అతను శిష్యులందర్నీ వరుసగా నిలబెట్టి, ఒక్కొక్కరిని ఒక్కో అంకే లెక్కపెట్టమని చెప్పాడు. అలా లెక్కపెట్టగా పన్నెండుమంది శిష్యులు లెక్క వచ్చారు. అప్పుడు బాటసారి, “చూశావా మీ వాడిని తెప్పించేశాను” అన్నాడు . 

శిష్యుల ఆనందానికి, ఆశ్చర్యానికి  అవధులు లేవు. “మీరు సామాన్యమానవులు కారు. ఏరు మింగేస్న మావడిని తెప్పించగలిగారు.   మీకేమిచ్చి రుణం తీర్చుకోగలమని?.. అయినా మీ ప్రతిభకేదో మా వద్ద ఉన్నంత సమర్పించుకొంటాం అంటు మిగతా డబ్బు మూటలు కూడా బాటసారికి ఇచ్చేశారు. అవి తీసుకుని సంతోషంతో అక్కడనుండి వెళ్ళిపోయాను బాటసారి. అప్పుడు మెలకువ వచ్చింది గురువుగారికి. డబ్బు గురించి అడగ్గా శిష్యులు జరిగిందంతా విపులంగా చెప్పారు.  వాళ్ళ తెలివితక్కువతనానికి నెత్తినోరు బాదుకొన్నారు గురువుగారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి