2 అక్టోబర్, 2012

ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరుగదు

అనగనగనగా ఒక కోటలో ఓ రాజు ఉండేవాడు. అందరు రాజులకు మల్లే వేట అంటే అతడికి మహాపిచ్చి.వేటకు చిక్కి బలయ్యే జంతువుల మాంసమంటే పిచ్చి పిచ్చి ఆ రాజుకి. ఒక రోజు కోట దాటి రాజ్యం పొలిమేరల్లో ఉండే మహారణ్యంలోకి వేటకు వెళ్లాడుబంధుమిత్రులు, సైన్య సపరివార సమేతం రాజుకు తోడు ఉన్నారనుకోండి. రాజు భయపడాల్సిన పనిలేదు మరి. ఓపిక ఉన్నంత వరకూ వేటాడారు.  అదేం ఖర్మో గాని ఆరోజు రాజు వేట పారలేదు. ఎంతదూరం పోయినా జంతువు అలికిడి లేదు. పక్షుల జాడలేదు.తిరిగారు తిరిగారు తిరిగారు.. తిరిగి అలసిపోయారు.  ఉన్నట్లుండి సింహం అరుపు వినబడింది.  రాజుకు ఊపిరి పీల్చుకున్నట్లయింది.  కాని రాజు కూర్చున్న గుర్రానికి మాత్రం పై ప్రాణం పైనే ఎగిరిపోయినట్లయింది. అక్కడే ఉంటే ఈ రోజుతోటే భూమ్మీద తనకు నూకలు చెల్లిపోతాయనుకుందేమో..ఒక్కసారిగా లంఘించి ముందుకురికింది.  అందరూ చూస్తుండగానే రాజుతో పాటు కనుమరుగయిపోయింది.  రాజభటులు తెప్పరిల్లి వెతికితే..గుర్రమూ లేదు... రాజూ లేడు...వేటమాని అడివంతా రాజుకోసం గాలించడం వారి పనయింది. 

తోవతప్పిన రాజు గుర్రమెటు తిరిగితే అటు పోతున్నాడు.పాపం. రాజు కదా.. దారి తెలీదు. దార్లూ గట్రా చూసిపెట్టేందుకు సేవకులూ లేరు కదా.. చేసేదేమీలేక గుర్రం మీద పోయాడు పోయాడు పోయాడు.. ఎలాగైతేనే అడివి మార్గంలో పూటకూళ్ల ఇంటికి చేరుకున్నాడు. ఆరోజుల్లో అడవిలో కూడా బాటసారులకు తిండి గట్రా చూసేందుకు పూటకూళ్లమ్మలు ఉండేవాళ్లులే. రాజు పూటకూళ్లమ్మ ఇంటికి చేరుకున్నాడు. గుర్రాన్ని దాణాకోసం విడిచి దాని దాణా కోసం కాసులిచ్చాడు. తానూ కాళ్లూ చేతులూ కడుక్కుని పూటకూళ్ల ఇంట్లో చక్కాలు ముక్కాలు వేసుకుని కూచున్నాడు. 

అకలితో కడుపు నకనకలాడిపోతోంది. పూటకూళ్లమ్మేమో ఎప్పటిలాగే మామూలు బాటసారుల్లాగే రాజుకు పచ్చడి మెతుకులు పెట్టింది.వేటకోసం పోయి దారితప్పి డస్సిపోయిన రాజుకు ప్రాణం లేచి వచ్చినట్లయింది.  ఆ పచ్చడిలో ఏం మహత్తు ఉందో.. ఏం వేసి పచ్చడి రుబ్బారో.. వేరు శనక్కాయల పచ్చడి... ఆపై ఆకలి. దహించుకుపోతున్న జిహ్వ.. రాజు ముందూ వెనుకా చూడలేదు.  ఆబగా తినేశాడు. విస్తరిలో ఒక్కటంటే ఒక్క అన్నం మెతుకు కూడా మిగల్చలేదు... మొత్తానికి రాజుకు ఆకలి తీరింది.నాలుగు వరహాలు పూటకూళ్లమ్మకిచ్చి బయలుదేరాడు. పోగా పోగా పోగా... ఎట్టకేలకు కోటదారి పట్టుకున్నాడు.  వేటకు వెళ్లి తప్పిపోయిన రాజసేవకులూ, సైన్యమూ, సవరివారసమేతమూ తిరిగి వచ్చేసింది.

పాపం రాజుకు పచ్చడి మెతుకుల రుచి పోలేదు.  కోటకు వచ్చిన వెంటనే రాజు వంటవాడిని పిలిపించాడు. ఒరేయ్ రేపు మధ్యాహ్నం నాకు వేరుశనగగింజలతో ఊరుమిండి చేసి పెట్టండిరా అని ఆజ్ఞాపించాడు. తలా తోకా లేకుండా రాజు జారీజేసిన ఆజ్ఞతో వంటవాళ్లకు మతిపోయింది.పంచభక్ష్యపరమాన్నాలను ఆరగించే రాజు.. మాంసం ముక్క చప్పరించనిదే ముద్ద దిగని రాజు.. ఎక్కడెక్కడినుంచో వరహాలు గుమ్మరించి తెప్పించిన ద్రాక్షసారా సేవించనిదే భోజన కార్యక్రమం ముగించని రాజు... ఊరుమిండి చేసి పెట్టమంటాడేమిటీ.. అయినా.. రాజంటే రాజే..రాజు మాటంటే మాటే మరి.. రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా మరి..వంటవాళ్లు రంగంలోకి దిగారు.. రాజ్యంలో పండగా రాజభటులు సేకరించిన మేలు రకం వేరుశనగ్గింజలను తెప్పించుకున్నారు.ఊరుమిండికి కావలసిన పదార్ధాలకు అదనంగా మరికొన్నింటిని కలిపారు.

ఎంతైనా రాజు వంటవాళ్లు కదా..ఊరుమిండి వాసన చూస్తే రాజు అదిరిపోవాలి అనుకున్నారు.

ఆరోజు గడిచింది..తెల్లవారింది..  రాజుకూ, వంటవాళ్లకు కూడా.. రాజు ఎప్పటిలాగే సభకు వెళ్లాడు.వంటవాళ్లు తమ పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని రంగరించి పోసి ఊరుమిండిని తయారు చేశారు.దాంట్లో ఏం దినుసులు కూర్చారో, ఏ పోపులు పెట్టారో..ఏ మసాలాలు దట్టింటారో..వంటశాల అంతా ఊరుమిండి వాసనేస్తోంది. వాళ్ల వంటను చూసి వంటవాళ్లు తమకు తామే ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఆహా. ఓహో.. భలే కుదిరింది.. అంటూ లొట్టలేసుకుంటున్నారు. మధ్యాహ్నం దాటింది.  సభ ముగిసినట్లుగా గంట మోగింది. రాజు బయలుదేరాడు.అంతఃపురం చేరుకుని శుచిగా తయారయ్యాడు. భోజనశాలకు చేరుకున్నాడు.. వంటవాళ్లు సిద్ధంగా ఉన్నారు. రాజు కూర్చున్నాడు. వంటవాళ్లు ఒక్కటొక్కటిగా వడ్డిస్తున్నారు. రాజుకోసం ప్రత్యేకంగా వండిన ఊరుమిండి గుండ తీసి రాజు పళ్లెంలో పెట్టారు. 


ఊరుమిండితో కలిపిన ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. కాసేపటి తర్వాత ఒక వంటశాలనుంచి ఒక ఉరుము ఉరిమింది.ఎవరక్కడ? ఆ కేక ప్రతిధ్వనించి రాజభటులు పరుగెత్తుకొచ్చారు. చిత్తం ప్రభూ..  ఈ వంటవాళ్లను తీసుకుపోయి శిరచ్ఛేదం చేయండి. ఆజ్ఞాపించాడు..వంటవాళ్లు లబలబలాడారు. మొత్తుకున్నారు. తామే పాపం చేయలేదని ప్రాధేయపడ్డారు.  కాని రాజాజ్ఞ అంటే రాజాజ్ఞే మరి..

వంటవాళ్లది ఇందులో ఏ తప్పూలేదు. మరి ఎందుకు శిక్ష పడింది అంటే. ఒక పూటంతా ఆకలితో నకనకలాడిన రాజు పూటకూళ్లమ్మ ఉల్లిపాయలు, మిరపకాయలు, చింతపండు జోడించి చేసిన ఊరుమిండిని అమృతంలాగా భావించి విస్తరిలో మెతుకు లేకుండా ఆబగా తినడానికి.... పంచభక్ష్యపరమాన్నాలు లభ్యమయ్యే కోటలో పచ్చడి మెతుకులు తినడానికి మధ్య తేడా లేదా మరి.
                                                                             అందుకే ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరుగదు....

1 అక్టోబర్, 2012

కోడిపుంజు తెలివి

ఒక ఊర్లో కోడిపుంజు ఒకటి ఎత్తైన ప్రదేశంలో కూర్చుని ఉండటాన్ని చూసింది నక్క. "అరే... మంచి విందు భోజనం దొరికిందే" అని సంతోషపడుతూ, ఎలాగైనా సరే దాన్ని పట్టుకోవాలని అనుకుంది. అప్పటికప్పుడే పథకం ఆలోచించిన నక్క."పుంజు తమ్ముడూ...! నీకో శుభవార్త" అంటూ పలకరించింది.శుభవార్తా...? నాకా? ఏంటది? అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది కోడిపుంజు. స్వర్గం నుండి ఒక ఆజ్ఞ వచ్చింది. ఇక నుంచి పక్షులు, జంతువులు అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉండాలని, ఒకరినొకరు చంపుకోకూడదని, ముఖ్యంగా నక్కలు కోళ్ళని తినకూడదని దేవుడి ఆజ్ఞ అంటూ చెప్పుకొచ్చింది నక్క.

కాబట్టి నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కిందికి దిగివస్తే బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం అంటూ కోడిపుంజును కిందికి దిగిరమ్మని చెప్పింది నక్క. అరె... ఇది చాలా మంచి విషయమే. అందుకేనేమో నీ స్నేహితులు నిన్ను కలిసేందుకు వస్తున్నారు అని చెప్పింది కోడిపుంజు.నా స్నేహితులా...!? ఎక్కడ...? ఎవరబ్బా..!? అంటూ అటువైపుకి తిరిగి చూసింది నక్క.అమ్మో...! వేటకుక్కలు. అవి తనవైపే వస్తుండటాన్ని చూసిన నక్క పారిపోయేందుకు ప్రయత్నించింది. అది చూసిన కోడిపుంజు...అదేంటి నక్క బావా, అంతగా భయపడుతున్నావు. ఇప్పుడు అందరం స్నేహితులమే కదా...!? అంటూ నవ్వింది.నిజమే... కానీ ఈ విషయం వేటకుక్కలకు ఇంకా తెలియదు కదా.! అని కోడిపుంజుకు బదులిచ్చి... బ్రతుకుజీవుడా అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది నక్క.

దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తే మొదటికే మోసం

అనగా అనగా ఒక అడవి.. ఆ అడవిలో పాముల పుట్ట. చాలా పాములు ఆ పుట్టలో సఖ్యంగా ఉండేవి. ఒక రోజు బాగా బలిసిన ముళ్లపంది ఆ పుట్ట దాపుకు వచ్చిది. దాని గురగుర శబ్దానికి ఉలిక్కిపడి పాములు బయటకు వచ్చాయి. ముళ్ల పందిని చూసి ఏంటి కథ అని అడిగాయి. "ఈ రోజు నా అదృష్టం పండింది. తిండి బాగా దొరకడంతో ఆబగా తినేశా. భుక్తాయాసం ఎక్కువై ఎక్కడైనా నిద్రపోదామని చూస్తే బయట అంతటా పక్షికూతలు, ఇతర శబ్దాలతో గోల గోలగా ఉంది. మీ పుట్టలో కాస్త చోటిస్తే కాస్సేపు నిద్రపోయి తిరిగి వస్తాను: అని అడుక్కుంది ముళ్లపంది. 

"అబ్బే లోపల పెద్దగా స్థలం లేదే. ఫరవాలేదు మేం కాస్త ఒదిగి పడుకుంటాం. ఇదిగా ఈ మూల నువ్వు సర్దుకో" అంటూ కొద్దిగా చోటి్చ్చాయి. ముళ్లపంది మెల్లగా లోపలకు దూరింది. పుట్టలోపల చాలా వెచ్చగా ఉండటంతో అది వెంటనే నిద్రలోకి జారుకుంది.పంది నిద్రపోగానే దాని సహజ స్వభావం కొద్దీ దాని ఒంటి మీదగల ఒక్కొక్క ముల్లు విచ్చుకుంటూ పాములకు గుచ్చుకోసాగాయి. పాములు దాని ముందుకెళ్లి అవతలకు పో అని ఒక్క అరుపు అరిచాయి. 

ఇదిగో నాకు ఇక్కడ హాయిగా ఉంది. పైగా బాగా నిద్రవస్తోంది కూడా. నా నిద్ర పాడు చేయకండి. అంతకూ మీకు ఇబ్బందిగా ఉంటే మీరే బయటకు పోండి అంటూ ముళ్లను ఇంగా బాగా చాపింది. దీంతో ఆ ముళ్లు పాములకు బాగా గుచ్చుకున్నాయి. పాపం పాములు. ఇంకేం చేస్తాయి. దీన్ని  రానిచ్చామే అని తమలో తాము తిట్టుకుంటూ బయటకు పోయాయి. 

30 ఆగస్టు, 2012

భలే శుంఠ

విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయుల ఆస్థానంలో తెనాలి రామలింగడు కవి. ఎప్పటికప్పుడు తన తెలివితేటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించి, తన పాండిత్యంతో రాజును మెప్పించేవాడు.రాయలవారి ఆస్థానంలో ప్రతి ఏటా "భలే శుంఠ" అనే పోటీలు జరుగుతుండేవి. ఈ పోటీలలో అందరికంటే గొప్ప శుంఠను గుర్తించి 5 వేల బంగారు నాణాలతో రాజు సత్కరించేవారు. అయితే, ప్రతిసారీ ఈ బహుమతిని తెనాలి రామలింగడే తన తెలివితేటలతో గెలుచుకుంటుండేవాడు.


దీన్ని గమనించిన ఆ రాజ్యంలోని సేనాధిపతికి కోపంతో "ఎప్పుడూ రామలింగడే గెలుచుకుంటున్నాడు. ఈసారి వేరొకరికి ఈ బహుమతి వచ్చేలా చేయాలి" అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సరిగ్గా పోటీలు మొదలయిన రోజు రామలింగడి గదికి బయటినుండి గడియ పెట్టించాడు.ఒకవైపు రామలింగడు ఆ గదిలోంచి బయటకు రాలేక నానా అవస్థలు పడుతుంటే... మరోవైపు రాయలవారు పోటీలను తిలకిస్తూ, శుంఠ ఎవరో తేల్చే పనిలో మునిగిపోయి ఉన్నారు. చివరకు ఎలాగోలా రామలింగడు గదిలోంచి బయటపడి నేరుగా పోటీలు జరిగే చోటుకు చేరుకున్నాడు.

దీన్ని గమనించిన రాయలవారు "అదేంటి రామలింగా...! ఎందుకింత ఆలస్యంగా వచ్చావు...?" అంటూ ప్రశ్నించారు. సమాధానంగా రామలింగడు మాట్లాడుతూ... "ప్రభూ...! నాకు ఉన్నట్లుండి వంద బంగారు నాణేల అవసరం వచ్చింది. వాటిని ఏర్పాటు చేసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది" అని అన్నాడు."ఏంటీ... వంద బంగారు నాణేల కోసం ఇంత సమయం వృధా చేశావా...? ఈ పోటీకి వచ్చి, గెలిస్తే నీకు 5వేల బంగారు నాణేలు దక్కేవి కదా...! ఆ మాత్రం నీ బుర్రకు తట్టలేదా...? ఒట్టి శుంఠ లాగున్నావే...!" అంటూ నవ్వుతూ అన్నాడు రాయలవారు. "అవును ప్రభూ...! నేను శుంఠనే..!" అని అన్నాడు రామలింగడు రెట్టిస్తూ... "నిజంగా నువ్వు శుంఠవే...!" కోపంగా అన్నాడు శ్రీకృష్ణదేవరాయులు. 

 అప్పుడు రామలింగడు తెలివిగా... "ప్రభూ...! నిజంగా శుంఠను నేనే కదా...! అయితే ఈ పోటీ నేనే నెగ్గినట్లు కదా...!" అన్నాడు. దాంతో నాలిక్కరుచుకున్న రాయలవారు రామలింగడి తెలివికి మెచ్చి, 5వేల బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చి, విజేతగా ప్రకటించాడు

  

19 ఆగస్టు, 2012

రాజగురువు తెలివి

ఒకప్పుడు విజయభట్ అనే రాజగురువు వుండేవాడు. ఆ ఆస్థానంలో పన్నెండు అగ్రహారాలు వుండేవి. అందులో సురేంధ్రనగర్ అగ్రహారంలో భట్ నివసించేవాడు. ఆస్థానమంతా అర్జున్ సింగ్, సాబర్ సింగ్, అనబడే అన్నదమ్ముల ఆధీనంలో వుండేది. ఇందులో అర్జున్ సింగ్ యోగ్యుడు, బుద్దిమంతుడు, ఈ విషయం రాజగురువు భట్‌కు బాగా తెలుసు. కొన్నాళ్ళకు ఆ అన్నదమ్ములు విడిపోవాలని నిశ్చయించుకొన్నారు. అయితే సురేంధ్రనగర్ అగ్రహారం కోసం ఇద్దరూ వాదులాడుకోవడం ప్రారంభించారు. ఈ విషయం రాజగురువుదాకా వెళ్ళింది. ఆయన ఆ అన్నదమ్ముల వద్దకు వచ్చాడు. వారు గురువును చూచి ఎంతో గౌరవంగా పిలిచారు. తమ సమస్యను తీర్చ వలసిందిగా కోరారు. అప్పుడు రాజగురువు వారికొక కధ చెప్పాడు.

పూర్వము ఒకప్పుడు ఒక మహర్షి వుండేవాడు. ఆయనవద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. విధ్యాభాసం పూర్తయ్యాక వారు గురువును సెలవు కోరారు. అప్పుడు గురువు ఇద్దరికీ పిడికెడు విభూతి ఇచ్చి వెళ్ళి సుఖంగా వుండమని దీవించాడు. అందులో ఒకడు విభూతిని ఎంతో భక్తితో స్వీకరించి తినివేశాడు. మరొకడు చిన్నచూపుతో దాన్ని పారవేశాడు. విభూతిని స్వీకరించినవాడికి సకల విధ్యలు అబ్బినాయి. అన్ని వేళలలో నిష్ణాతుడయ్యాడు. రెండవ వాడు మాత్రం మందబుద్దితో తిరిగి వచ్చి గురువును తూలనాడాడు. రాజగురువు పై కధ చెప్పి నా తీర్పువిన్నాక రెండవ శిష్యునివలే తనను నిదించకూడదని అన్నాడు. అందుకు వారు అంగీకరించారు. సమస్యను రేపు పరిష్కరిస్తానని రాజగురువు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి కధలో మొదటి శిష్యుడు చేసినట్లు చేయవలసిందిగా అర్జున్ కు రాజగురువు రహస్యంగా వర్తమానం పంపాడు. సురేంధ్రనగర్ అర్జున్ సింగ్ ఆధీనంలోకి రావాలన్నదే రాజగురువు ఆశ కూడ.

మరుసటి నాడు రాజ గురువు రెండు చీటీలను ఉండలుగా చుట్టి అర్జున్ సింగ్ ను సాబల్ సింగ్ ను ఇష్టానుసారం తీసుకోమని చెప్పాడు. అర్జున్ సింగ్ చీటీ తీసుకొని మ్రింగివేసాడు, సాబల్ సింగ్ చీటీ చూచుకొన్నాడు. అందులో "సురేంద్ర నగర్ మీదికాదు" అని రాసి వుంది. మాట ప్రకారం సాబల్ సింగ్ సురేంద్ర నగరను అర్జున్ సింగ్ కు వదిలి పెట్టాడు. అయితే రాజగురువు రెండు చీటీలనూ ఒకే విధంగా అంటే "సురేంద్ర నగర్ మీదికాదు" అని రాసినట్లు తెలియదు. ఎంతో తెలివిగా ఆయన సురేంద్రనగర్ ను బుధ్ధిమంతుడైన అర్జున్ సింగ్ కు వచ్చేలా చూశాడు. మంత్రి సుబుధ్ధితో ఈ విషయం వివరించాడు.




18 ఆగస్టు, 2012

కప్ప చెడు స్నేహం


ఒక కప్పా, పాము మంచి స్నేహితులుగా వుండేవి. కప్ప పాముకు కప్పకూత నేర్పించింది. పాము కప్పకు భుసకొట్టడం నేర్పించింది.పాము నీటిలోకి వెళ్ళి కప్పకూత కూస్తే చుట్టుపక్కల కప్పలు దాని దెగ్గిరకు వెళ్ళేవి. పాము చటుక్కున వాటిని తినేసేది.

కప్ప నీళ్ళల్లో భుస కొడుతుంటే దాని దెగ్గిరకు పాములు వచ్చేవి కాదు. కప్ప నిర్భయంగా వుండేది. ఇలా కొంత కాలం కొనసాగింది.కాల క్రమేణా పాము చేసే పని కప్పలకు తెలిసి అవి పాము దెగ్గిరకు వెళ్ళడం మానేసాయి. పాము తినడానికి యేమి లేక చిక్కి క్షీణించుకు పోయింది. ఆకలి తట్టుకోలేక తన స్నేహితుడైన కప్పను తినేసింది.

చెడు స్నేహం చేస్తే అది ఎప్పటికైన మనకే చేటు.

17 ఆగస్టు, 2012

నక్క రంగులు


పులి దర్జా గా అడివిలో తిరుగుతూ వుంటే అన్ని జంతువులు ఈ పక్క, ఆ పక్కా భయంతో పారిపోతూ వుండేవి. అది చూసి ఓ నక్క చాలా కుళ్ళుకునేది. అన్ని జంతువులు పులికి భయపడతాయి, దీనికి కారణం ఏమిటి అని ఆలొచిస్తే కారణం పులి చారలే అయి వుంటాయని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఓ కంసాలాడి దెగ్గిరికి వెళ్ళి అలా పులిలా చారలు పెట్టమని అడిగింది. అతను బాగా ఇనప కడ్డి కాల్చి వాత పెట్టాడు. ఒక వాత పెట్టే సరికే భరించలేక కేకలు పెట్టి, “చారలు కావాలికాని నొప్పి కాదు, ఇంకేదైన చేయి” అంది నక్క. “ఐతే రంగులు పులివించుకో” అన్నాడు కంసాలాడు.


రంగులు వేసే వాడి దెగ్గిరకు వెళ్ళి రంగులు పులవమని అడిగింది. అతను నక్క అడిగినట్టే రంగులద్దాడు. ఆ రంగులు చూసుకుని మురిసిపోయింది నక్క. వెంటనే అడివిలోకి వెళ్ళి, పులి లాగ గాండ్రించబొయి, ఒక ఊళ్ళ పెట్టింది. ఆ ఊళ్ళ విని పారిపోబోతున్న జంతువులు కూడా దాని చుట్టూరా తిరుగుతూ ఆశ్చర్యంగా చూసాయి. ఇంతలో వాన పడి నక్క తనపై అద్దించుకున్న చారలన్ని నీళ్ళల్లో కలిసి చెరిగి పోయాయి. ఇది చూసి చిన్న చిన్న జంతువులు కూడ నక్కను వెక్కిరించడం మొదలెట్టాయి.


ఒకళ్ళని చూసి మన తీరు మార్చుకోకూడదని నక్కకు ఆ రోజు బాగా తెలిసొచ్చింది.


అద్దం ముక్క మెరుపు


ఒక రోజు ఒక అద్దం ముక్క ఒక రాయి తో ఇలా అంది: “నన్ను చూడు, నేను ఎంత మెరుస్తున్నానో? ఆ సూర్యుడే నన్ను మెచ్చుకుని నాకీ మెరుపునిచ్చాడు”.  ఆ రాయి, “అలాగా, నా అభినందనలు” అని సమాధానమిచ్చింది.

కొన్ని రోజుల తరువాత ఒక పిడుగు అద్దం మీద పడింది. అద్దం పిడుగు మంటకు కాలిపోయి, దాని మొత్తం మెరుపును కోల్పోయింది.ఆ రాయి, “నీ మెరుపు ఏమైంది?” అని అద్దాన్ని అడిగింది.

“ఒహ్, ఆ పిడుగు వచ్చి నా దెగ్గిర అరువు తీసుకుంది” అన్నదా అద్దం. “ఒక్క సారి మన గొప్ప చాటుకున్నాక ఎన్ని అబద్ధాలాడాలో” అనుకుంది రాయి.

16 ఆగస్టు, 2012

గుడ్లగూబ విచక్షణ


ఒక అడివిలో ఒక కోతికి ఓ అద్దం దొరికింది. అది ఆ అద్దాన్ని అడవిలో జంతువులన్నిటికీ చూపించింది. భల్లూకం అందులో తన ప్రతిబింబం చూసుకుని, “అయ్యో, నేను ఇంత కురూపినా” అనుకున్నాడు. తోడేలు చూసి నేను కూడ జింకలాగా వుంటే బాగుండేది, అనుకుంది.

ఇలా ఒకటి తరవాతోకటి అన్ని జంతువులు వాటి ప్రతిమలను చూసుకుని ఇలా వుంటే బాగుండేది, అలా వుంటే బాగుండేది అనుకున్నాయి.చివరికి కోతి ఆ అద్దం ఒక వివేకవంతమైన గుడ్లగూబ దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ గుడ్లగూబ, “వద్దు నాకు చూపించద్దు. ఆ అద్దం చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి పడడం తప్ప దాని వల్ల వాళ్ళకు వచ్చిన ఙానము లేదు, విచక్షణ లేదు. అలాంటి దాన్ని చూసి బాధ పడడం అనవసరం” అని అంది. కోతి ఒప్పుకుని ఆ అద్దాన్ని నదిలోకి విసిరేసింది.

పగుళ్ళ కుండ భాధ

ఒక ఊరిలో నీళ్ళు మోసే పనివాడొకడుండేవాడు. అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్ళు మోసుకొచ్చేవాడు. ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారు పోతుంటే, మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది.చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్ళు తీసుకొచ్చేసరికి, కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేసరికి మిగిలేవి. నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచికుండ అగర్వంతో పొంగిపోయేది. కాని పగుళ్ళకుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఎన్నో నెలల తర్వాత పగుళ్ళు గల కుండ పనివాడితో "నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమించు" అంది.

"ఎందుకు? నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు?" అడిగాడు పనివాడు. "ఇన్ని రోజులు నేను సగం నీళ్ళే మోయగలగుతున్నాను. ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నావల్ల నీకు అదనపు పని అవుతుంది. నీకష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు" అని నసిగిందా పగుళ్ళ కుండ. దాని బాధ అర్ధం చేసుకున్న పనివాడు "బాధపడకు, ఈ రోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు" అన్నాడు. కుతూహలంగా ఆ పగుళ్ళ కుండ ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది.

పనివాడు ఆ కుండతో "కేవలం నీవైపే అందమైన పుష్పాలు ఉన్నాయి. మరో కుండ వైపు లేవు. అది నువ్వు గమనించావా? ఎప్పుడూ నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా చేస్తాను. నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే నువ్వే వాటికి నీరు పోస్తావన్నమాట. తద్వారా ఈ అందమైన పుష్పాలు యజమాని టేబుల్‌ అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు. నువ్వు పగుళ్ళతో లేకపోతే అతని ఇంట్లో కళకళలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండవు" అన్నాడు. పగుళ్ళ కుండ తన భాధను అర్ధం చేసుకోవడమే కాకుండా, తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది.


9 ఆగస్టు, 2012

రంగయ్య ఉపాయం

ఒక గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతని పొరుగింట్లో ఉండే సాంబయ్య కోళ్ళ వ్యాపారం చేసేవాడు. సాంబయ్య కోళ్ళు ప్రతిరోజూ రంగయ్య పెరడులోకి వచ్చేవి. రంగయ్య భార్య గింజలు ఎండకు ఆరబోస్తే, కావల సినంత తిని, కాళ్ళతో తొక్కి చెల్లాచెదురు చేసేవి. రంగయ్య రోజూ సాంబయ్యతో కోళ్ళను తన పెరడులోకి తోలవద్దని చెప్పేవాడు.‘‘అవి మనలాగ మనుషులా ఏమిటి? చెప్పిన మాట వినడానికి. మూగప్రాణులయ్యా! ఎటుపడితే అటు వెళ్తుంటాయి. మనమే జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ సాంబయ్య నిర్లక్ష్యంగా జవాబిచ్చేవాడు. 

కొన్నిరోజులు ఇలాగే గడిచాయి. ఒకరోజు సాంబయ్య పొరుగూరు సంతకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఇంట్లోకి వెళుతూ తన కోళ్ళ కోసం రంగయ్య ఇంటి పెరడులోకి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు.రంగయ్య నేల మీద అక్కడక్కడ పడున్న గుడ్లను ఒక బుట్టలోకి ఏరుకుంటున్నాడు. ‘‘రంగయ్యా! నీ దగ్గర కోళ్ళు లేవుగా! మరి ఈ గుడ్లు ఎక్కడివి?’’ అని అడిగాడు సాంబయ్య.‘‘ఇందాక నీ కోళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళాయి. బహుశ అవే పెట్టి ఉంటాయి’’ అంటూ అమాయకంగా జవాబు చెప్పి లోపలికి వెళ్ళి పోయాడు రంగయ్య. సాంబయ్య నోరు వెళ్ళబెట్టాడు. ఇక ఆరోజు నుండి అతను తన కోళ్ళు రంగయ్య పెరడులోకి వెళ్ళకుండా జాగ్రత్త పడ్డాడు. నిజానికి ఆ గుడ్లు సాంబయ్య కోళ్లు పెట్టినవి కావు. రంగయ్యే కోళ్ళ బెడద తప్పించుకోవడానికి అలా ఉపాయం పన్నాడు. 


కోడిపుంజును చూసి భయపడిన సింహం

ఒక అడవిలో ఒక కోడిపుంజు, గాడిద స్నేహంగా ఉండేవి. తీరికవేళల్లో అవి ఒక చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవి. ఆరోజు కూడా ఎప్పటిలాగే మిట్టమధ్యాహ్నం వేళ చెట్టు దగ్గరకు చేరి ఆ మాటా ఈ మాటా చెప్పుకుంటున్నాయి. ఇంతలో ఒక సింహం అటువైపు వచ్చింది. గాడిద వెనుక వైపు నుండి రావడం వల్ల అది సింహాన్ని చూడలేదు. కోడి చూసింది. వెంటనే అది భయపడి వింతగా అరుస్తూ చెట్టు కొమ్మ పైకి ఎగిరింది.


విచిత్రంగా వినపడ్డ కోడి అరుపు వినగానే సింహం ఉలిక్కిపడింది. సింహం కోడిపుంజును చూడలేదు. ‘‘అమ్మో! మిట్టమధ్యాహ్నం చెట్ల కింద పిశాచాలు జుట్టు విరబోసుకుని కూర్చుంటాయట. ఆ చెట్టు కింద ఏదో ఉంది బాబోయ్’’ అనుకుంటూ సింహం వెనక్కి పరుగెత్తసాగింది.సింహం పరుగెత్తిన శబ్దం విని గాడిద తిరిగి చూసింది.పరుగెడుతున్న సింహం కనిపించింది. అది తనని చూసే భయపడి పారిపోతోందనుకుంది. అంతే... మరుక్షణం గాడిద గట్టిగా అరుస్తూ ‘‘ఒరేయ్ ఆగరా! ఎక్కడికి పారిపోతున్నావు? నా చేతికి దొరికావంటే నీకు ఇదే ఆఖరి రోజవుతుంది’’ అంటూ వెంటబడింది. ఇదంతా చెట్టు పైనుండి కోడి చూస్తోంది. తన అరుపులకు సింహం భయపడిందని గ్రహించి ‘‘మిత్రమా, వెళ్ళకు! వెనక్కి రా!’’ అంటూ కేకలు పెట్టింది. గాడిద కోడిపుంజు మాటలు పట్టించుకోలేదు. అలాగే కాస్తదూరం సింహాన్ని అనుసరిస్తూ వెళ్ళింది.

కొద్దిదూరం వెళ్ళాక సింహం పరుగెత్తటం ఆపి వెనుకకు తిరిగి తన వెంటే వస్తున్న గాడిదను చూసింది. గాడిద తన దగ్గరకు రాగానే సింహం దాని మూతి మీద పంజాతో ఒక్కటిచ్చింది. దానితో గాడిద కుయ్యో మొర్రో అంటూ అక్కడి నుండి పారిపోయి వచ్చేసింది.


26 జులై, 2012

రెండు నాలుకల ధోరణి

ఒక అడవిలో ఒక నక్కను కొన్ని తోడేళ్లు తరుముతున్నాయి. నక్క గుక్క తిప్పుకోకుండా, ప్రాణభయంతో, ఊపిరి బిగబట్టి పరుగుతీస్తోంది. తోడేళ్లు తమ ఆహారాన్ని వదలలేక మరింత వేగంగా దూసుకొస్తున్నాయి. నక్క ఇక పరిగెత్తలేక ఒక గుడిసె వెనకాల దాక్కుంది. ఆ గుడిసె ముందు చెట్టుపై ఒకతను కట్టెలు కొడుతున్నాడు. నక్క అతన్ని చూసి "అయ్యా! నేను ప్రాణ భయంతో పరిగెత్తుకు వస్తున్నాను. నన్ను తోడేళ్లు తరుముతున్నాయి. అవి వస్తే దయచేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పకు" అని అంది. బదులుగా అతను "సరే ! నువ్వు ప్రాణం అరచేతిలో పెట్టుకుని వస్తున్నావు. నువ్వు ఇక్కడ దాక్కున్నావని చెప్పనులే" అన్నాడు.

అంతలో తోడేళ్లు రొప్పుతూ అతని ముందుకొచ్చాయి. " అయ్యా! మేము ఒక నక్క కోసం వెతుకుతున్నాం. ఆ నక్క గాని ఇటు వైపు వచ్చిందా? చెప్పండి. మీకు మేము రుణపడి ఉంటాం", అని అన్నాయి తోడేళ్లు ముక్తకంఠంతో. కొద్దిసేపు ఆలోచించి ఆ కట్టెలు కొట్టేవాడు, ఒక వైపు చేయి నక్కవైపు, మరో చేయి రోడ్డువైపు చూపిస్తూ, " అటుగా వెళ్ళింది" అని పలికాడు. అతని సంజ్ఞను అర్ధం చేసుకోలేని వెర్రి తోడేళ్లు అతను చూపించిన రోడ్డువైపు పరిగెత్తాయి. "హమ్మయ్య" అని బయటకొచ్చిన నక్క తన దారిలో తాను వెళ్తుంటే కట్టెలు కొట్టేవాడు నక్కతో, " నువ్వు మామూలు వాడివి అయితే కృతజ్ఞతలు చెప్పేదాన్ని. కానీ నువ్వు రెండు నాలుకలవాడివి. నావైపు చూపిస్తూ మరోవైపు వెళ్లిందని చెప్పావు. నీలాంటి వాడికి కృతజ్ఞతలు చెప్పడం కూడా సంస్కారం అనిపించుకోదు" అంది నక్క.

30 జూన్, 2012

విక్రమసింహుడు

మహేంద్రపుర రాజ్యాన్ని విజయసింహుడు పరిపాలించేవాడు. అతను ప్రజలను తన బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పాలించేవాడు. విజయ సింహుని తరువాత అతని కుమారుడు విక్రమసింహుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. విక్రసింహుడు కూడా తండ్రి లాగా పరిపాలించాలనుకున్నాడు. కాని మంత్రి, తక్కిన అధికారులు అతనికి సహకరించేవారు కాదు. 

ఒకరోజు రాత్రి నా తండ్రి ఎంత ప్రజారంజకంగా పరిపాలించాడు. నేను అలా పరిపాలిద్దాం అనుకుంటే మంత్రి, అధికారులు సహకరించడం లేదే?? ప్రజలకు నా మీద నమ్మకం పోతుందేమో. నేను ఈ బాధ్యత మోయలేనేమో, ఎక్కడికైనా దూరంగా పారిపవాలి!" అని మనసులో అనుకుంటూ మంచం మీద నుంచి లేచాడు. రాజభవనం ద్వారం దాటి బయటకు వచ్చాడు. "ఎంత దూరం పారిపోగలను? నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను గుర్తుపడతారు," అని మళ్లీ తన మనసులో అనుకుని, తిరిగి మందిరానికి వచ్చాడు. అలా కొంచెం సేపు ఆలోచించి, చివరికి రాజభవనం మీద నుండి దూకి చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ప్రజలను బాగా పరిపాలించలేకపోతున్నాననే బాధ అతను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. 

విక్రమసింహుడు రాజభవనం మీదకి చేరుకున్నాడు. ఏదో ఆలోచిస్తూ భవనం గోడ దగ్గర నిలబడ్డాడు. అక్కడ అతనికి ఒక చీమ తన నోటితో ఒక చక్కెర పలుకును కరుచుకొని గోడ వారగా వెళ్లడం కనిపించింది. ఆ చీమ అలా వెళుతూ గోడ పగుళ్లలో ఉన్న తన నివాసంలోకి వెళ్లిపోయింది. అది చూసిన విక్రమసింహుడు, ఔరా! ఈ చీమను చూడు. ఈ రాజభవనంలో ఎక్కడో మూలన ఉన్న వంట గది నుండి పంచదార పలుకుని కరుచుకొని, మూడు అంతస్తులు ఉన్న ఈ రాజ భవనం మీదకు చేరింది. ఒక చిన్న చీమనే ఇంత పైకి రాగలిగితే, దాని కన్నా ఎన్నో రెట్లు పెద్దగా, బలంగా ఉన్న నేను నా ప్రజల సంక్షేమం కోసం పాటుపడలేనా? అనుకున్నాడు. ఆ ఆలోచనతో అతనిలో ఉన్న నిరాశ పటాపంచలయ్యింది. చనిపోదాం అనుకున్న విక్రమసింహుడు తన మనస్సు మార్చుకుని, కొత్త ఉత్సాహంతో తన మందిరానికి చేరుకున్నాడు. అప్పటి నుండి మంత్రులను, అధికారులను తనకు సహకరించేలా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించసాగాడు.


20 జూన్, 2012

సుకుమార రాకుమారి


ఒక రాణి దేశంలోకెల్లా అతి పెద్ద సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉండేది. ఆమె ఏకైక పుత్రుడే ఆ రాజ్యానికి కాబోయే మహారాజు. యువరాజు ఆరడుగుల ఎత్తులో ఎంతో అందంగా, సుకుమారంగా ఉండేవాడు. అతనికి యుక్త వయసు వచ్చింది. పెళ్ళి చెయాలని భావించింది రాణి. కాబోయే కోడలు కూడా చాలా అందంగా, సుకుమారంగా ఉండాలని కోరుకుంది. 

యువరాజుకి ఎన్నో రాజ కుటుంబాల నుండి సంబంధాలు వచ్చాయి. కాని ఆ రాజకుమార్తెలెవరూ రాణి కోరుకున్న లక్షణాలకు తగ్గట్టుగా లేరు. రాణి ఎన్నో సంబంధాలను కాదన్నదనే వార్త దేశమంతటా పొక్కింది. అది విన్న ఒక అందమైన రాకుమారి... రాణి గారిని కలుసుకోవాలని నిర్ణయించుకుంది. రాణిగారు ఎలాంటి రాకుమారిని తన కోడలుగా కోరుకుంటున్నారో తెలుకోవాలని అనిపించింది. అందుకని రాణి గారిని వ్యక్తిగతంగానే వెళ్ళి కలవాలనుకుంది. 

సైనికులు ద్వారా తన రాకను రాణి గారికి తెలియజేసింది రాకుమారి. ఆమె కోసం రాణి తన భవనంలోని అందమైన గదిని సిద్ధంగా ఉంచిది. రాకుమారి రాణి గారి భవనానికి రాగానే రాణిగారి పరిచారికలు ఆమెను ఆ అందమైన గదిలోకి తీసుకు వెళ్ళారు. రాకుమారి ఎంత సున్నితమైనదో తెలుసుకోవాలని గదిలోని మంచం మీద కొన్ని గులక 
రాళ్లు పెట్టి, వాటి మీద ఏడు పరుపులు పరిచారు. రాత్రి కాగానే ఆ మంచంపై పడుకున్న రాకుమారికి ఆ  గులక రాళ్ల వల్ల అస్సలు నిద్ర పట్టలేదు. 

ఆమె వీపు మీద ఎర్రని మచ్చలు ఏర్పడ్డయి. ఒళ్ళంతా కంది పోయింది. రాకుమారిని చూసేందుకు వచ్చిన రాణి కందిపోయిన ఆమె ఒంటిని చూసి ఆమె అత్యంత సున్నితమైనదని, తనకు కోడలిగా, తన కొడుకుకు సరైన భార్యగా రాణిస్తుందని నిర్ణయించుకుంది.

19 జూన్, 2012

బ్రహ్మరాక్షసుడు



 భీకరారణ్యంలో ఓ మఱ్ఱిచెట్టు. దాన్ని ఆశ్రయించి ఎన్నో భూత ప్రేత పిశాచాలు. అక్కడే ఓ బ్రహ్మరాక్షసుడు తన నివాసాన్ని ఏర్పరచుకొన్నాడు. అడవిలో ఎన్నో ఔషధాలు విరాజిల్లడం మూలానేమో వాటి గాలి సోకి సోకి ఆ బ్రహ్మరాక్షసుడికి కాలక్రమేణా తాను ఆ వికృతాకారము నుండి విముక్తి పొందాలనే సద్భావం కలిగింది. ఎవరైనా తనకు సన్మార్గం చూపేవాళ్ళుంటారేమోనని అన్వేషిస్తుంటే శాపగ్రస్తురాలైన ఓ పులి దైవవశాత్తు అటుగావచ్చింది. ఆ శార్దూలరాజు కళ్ళలోని నైర్మల్యాన్ని గమనించి ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు “ఓ వ్యాఘ్రేశ్వరా! నాయందు దయవుంచి నాకీ జన్మ నుండి విముక్తి కలిగే మార్గం చెప్పగలవా”?

“పూర్వ జన్మల దుష్కర్మలే ఈ వికృత జన్మలకు హేతువు. నీవు పూర్వ జన్మలో సద్బ్రాహ్మణునిగా పుట్టియు నీకు వచ్చిన విద్యను ఎవ్వరికీ అందించకుండా సమాజశ్రెయస్సుకు వినియోగించకుండా నీవద్దనే ఉంచుకున్నావు. ఆ దోషకారణముగా నీవిప్పుడు బ్రహ్మరాక్షసుడవైనావు. ఏదైనా సత్కర్మ చేస్తే నీకు విముక్తి కలుగుతుంది” అని ఆ పులి హితవు చెప్పింది. ఆ సత్యభాషణములు విని ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు “జంతువై ఇంత జ్ఞానం ఎలా సంపాదించావు”? “నేను సద్గురువును అధిక్షేపించడం వలన ఈ దేహం పొందాను. ఎదైనా సత్కార్యం చేదామని ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ రూపాన్ని చూసే ఎవరూ నాదెగ్గరకైనా రవటంలేదు. ఇప్పుడు నీవేదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో నీవు నీచేత సత్కర్మ చేయించినందుకు నేను ఇద్దరం బైటపడతాం” అని పులి అన్నది.

సత్కర్మ చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసునకు ఓ ఆగంతకుడు కనిపించాడు. తనని ఆ రూపంలో చూస్తే భయపడతాడని ఓ సాధువు వేషంలో ఆ బాటసారి వద్దకు పోయి యోగ క్షేమాలు విచారించాడు. ఆ పాంథుడిలా తన విచారాన్ని వ్యక్త పఱచాడు “ఒక 100 వరహాలు కావాలి. ఎలా సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నాను”. ఆ రత్నాలతో ఏమి చేస్తావని ఆత్రుతగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు. “రాజకుమారిని పెళ్ళాడాలి” అన్నాడు ఆగంతకుడు. పెళ్ళికి రత్నాలెందుకని ప్రశ్నించగా “ఆ ఎక్కడో హిమవత్ పర్వతాల దగ్గర ఏవో రత్నాలున్నాయిట. అవి తెస్తేగాని పెళ్ళిచేయరట. ఈ దండకారణ్యంలో ఎందరో యోగులు బ్రహ్మరాక్షసులు ఉంటారని విని వాళ్ళ ద్వారా ఆ రత్నాలు సంపాదిద్దాం అని ఇక్కడ కొచ్చాను” అన్నాడు బాటసారి.

“ఏ రాజకుమారి? అవంతీ రాజకుమారి ఆ?” అని ప్రశ్నించిన బ్రహ్మరాక్షసునితో “అవును. నీకెలా తెలుసు” అని అన్నాడు బాటసారి. “అది వీరశుల్కం. వరుని ధైర్యసాహసాలు వీరత్వం పరీక్షించడానికా నియమం. పైగా వారడిగినది 50 రత్నాలేకదా”? అన్నాడు బ్రహ్మరాక్షసుడు. “వాళ్ళకంతా ఇచ్చేస్తే మరి నా భార్యాపిల్లలకో” అన్నాడు బాటసారి.

ఓరి దుర్మార్గుడా! రాజ్యాన్ని రాజకుమారిని మోసగిద్దాం అనుకున్నావా! నీలాంటి దేశద్రోహికి సహాయపడి నేనింకా పాపం మూట కట్టుకోలేను అని అనుకొని అమాంతంగా ఆ బాటసారిని మ్రింగివేశాడు బ్రహ్మరాక్షసుడు. తత్‍క్షణమే పులిగాశాపం పొందిన శిష్యుడు నరరూపంలో ప్రత్యక్షమై “మిత్రమా! దుష్టుడైన దేశద్రోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన నిన్ను నన్ను ఆ ధర్మదేవుడు కరుణించినాడు. రా” అంటున్న నూతన మిత్రునితో దివ్యలోకాలు చేరుకున్నాడు బ్రహ్మరాక్షసుడు.


10 జూన్, 2012

సాటిలేని విలుకాడు నసీరుద్దీన్


ఒక సారి ఎవరో నసీరుద్దీన్ సాటిలేని విలుకాడు అంటుంటే, పాదూషా విన్నాడు. దాంతో ఆయనకి చాలా కుతూహలంగా అనిపించింది. సరే అని నసీరుద్దీన్ ని పిలిపించాడు. వాళ్ళు ఇద్దరూ నడుచుకుంటూ వెళుతున్నారు. ఇంతలో ఒక చెట్టు కనిపించింది. వెంటనే పాదూషా నసీరుద్దీన్ ని ఆ దూరంగా కనిపిస్తున్న చెట్టుని గురి చూసికొట్టమని కానీ 3 మాత్రమే అవకాశాలు అని చెప్పాడు. నసీరుద్దీన్ మొదటి బాణం పొరపాటున గురి తప్పింది. పాదూషా వెటకారంగా నవ్వాడు.

"నవ్వకండి, ప్రభూ! యిది తమరి నైపుణ్యం” అన్నాడు నసీరుద్దీన్. తరవాత రెండో బాణం కూడా గురితప్పింది. పాదూషా మళ్ళీ నవ్వాడు."నవ్వద్దు, ప్రభూ!యిది తమరి మంత్రుల నైపుణ్యం” అన్నాడు నసీరుద్దీన్. తరవాత మూడో బాణం మాత్రం సూటిగా వెళ్ళి కాండానికి గుచ్చుకుంది. 

నసీరుద్దీన్ వంగి సలామ్ చేస్తూ “వినయంగా చెప్పాలంటే యిది నసీరుద్దీన్ నైపుణ్యం” అన్నాడు. పాదూషా గతుక్కుమన్నాడు. గతుక్కుమన్నది నసీరుద్దీన్ చివరి మాటకి కాదు. `ఇందాకటి దాకా నసీరుద్దీన్ తనని, తన మంత్రులని అన్నప్పుడు తను నసీరుద్దీన్ కొట్టలేడు అన్న ఉద్దేశంతో పట్టించుకోలేదు కానీ తన మీద నసీరుద్దీన్ విసిరిన చలోక్తులకి ఎవరైనా నవ్వుతారేమోనని.’

9 జూన్, 2012

నసీరుద్దీన్ కథలు


అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే దేశం. ఆ దేశాన్ని తైమూర్ పాలిస్తుండేవాడు. ఇతడు పేరుకే రాజుగానీ, పరమ పిసినారి, స్వార్ధపరుడూను. అతడికి ఈర్ష్యాసూయలు కూడా ఎక్కువే.  ఎప్పుడూ నసీరుద్దీన్ నుండి సలహాలు తీసుకొంటాడే గానీ ఏనాడు మంచి పారితోషికం ఇవ్వడు.నసీరుద్దీన్ తనకి ఒక గుర్రం కావాలని తైమూర్ ని అర్ధించాడు. పిసినారి తైమూర్ కి నసీరుద్దీన్ కి గుర్రాన్నివ్వడం ఇష్టంలేదు. ఇవ్వక తప్పేట్లు లేదు.

దాంతో ఓ ముసలి చచ్చు గుర్రాన్ని నసీరుద్దీన్ కిచ్చాడు. ఇలా ఉండగా ఓ రోజు తైమూర్ తన పరివారంతో కలిసి వేటకి బయలుదేరాడు. నసీరుద్దీన్ కూడా వాళ్ళ వెంట ఉన్నాడు. అందరూ గోబీ ఎడారి చేరారు. ఇంతలో గాలి, దుమ్ము రేగాయి. మేఘాలు కమ్ముకొచ్చాయి. అంతలోనే ఉరుములు మెరుపులతో కుంభవృష్టి మొదలయ్యింది.

తైమూర్, అతని సైనికులు ఎక్కిన గుర్రాలు బలంగా ఉన్నాయి. ఆ గుర్రాలు మీద వాళ్ళంతా ఒక్క ఉదుటున దౌడు తీయిస్తూ వెనక్కి ఊళ్ళోకి మళ్ళారు. అయినా గానీ ఊరు చేరే లోగా తడిసి ముద్దయ్యారు. నసీరుద్దీన్ గుర్రం ముసలిది, ఒక్కచిక్కినది అయిన చచ్చు గుర్రంమయ్యే.గాలి మొదలవ్వగానే అది అడుగు తీసి అడుగు వెయ్యకుండా, ఉన్న చోటునే బిర్ర బిగిసినట్లు నిలబడి పోయింది. ఎంత అదిలించినా కదల్లేదు, మెదల్లేదు. చేసేది లేక నసీరుద్దీన్ గుర్రం దిగాడు. వర్షం మొదలయ్యేలోగా బట్టలు విప్పి ఆ గుర్రం క్రింద దాచాడు. ఎడారిలో తడుస్తూ అలాగే నిలబడ్డాడు. 

వర్షం తగ్గాక ఒళ్ళార్చుకొని, గుర్రం క్రింద దాచిన దుస్తులు తొడుక్కొని గుర్రమెక్కి ఊళ్ళోకి వచ్చాడు. కొంచెమైనా తడవకుండా, పొడి దుస్తులతో వచ్చిన నసీరుద్దీన్ ని చూచి తైమూర్ ఆశ్చర్యపోయాడు. "అదేమిటయ్యా నసీరుద్దీన్. ఎంత వేగంగా వచ్చినా మేం ముద్దగా తడిసిపోయాము. నువ్వెలా తడవకుండా వచ్చావు? ఎక్కడున్నావు ఇప్పటి దాకా?" కుతుహలంగా అడిగాడు తైమూర్.

"అహా..హా! ఏం చెప్పను హూజూర్! అద్బుతం. అమోఘం.” ఇంకా పరవశంలోనే ఉన్నట్లు నటిస్తూ మైమరుపుగా అన్నాడు నసీరుద్దీన్. తైమూర్ కుతుహలం మరింత పెరిగిపోయింది."ఏమిటి అద్భుతం? త్వరగా చెప్పవయ్యా!” అంటూ తొందర పెట్టాడు తైమూర్. "హూజూర్! ముందుగా నేను మీకు కృతఙ్ఞతలు చెప్పుకోవాలి” అన్నాడు నసీరుద్దీన్. "ఎందుకు?" ఆత్రంగా అడిగాడు తైమూర్."ఇంత అద్భుతమైన గుర్రాన్ని నాకు ఇచ్చినందుకు హూజూర్!” మరింత వినయంగా అన్నాడు నసీరుద్దీన్. అయోమయంగా చూశాడు తైమూర్. 

"నన్ను వివరంగా చెప్పనివ్వండి హూజూర్! గాలీ వానా మొదలవ్వగానే మీరంతా వేగంగా ఊరి వైపు దౌడు తీశారా? సరిగ్గా అప్పడే నేనూ నా గుర్రాన్ని అదిలించాను. అప్పుడు జరిగింది అద్భుతం! మీరిచ్చిన గుర్రం సామాన్యమైనది కాదు హూజూర్! అది ఆకాశంలో ఎగర గలదు. వాన మొదలు కాగానే అది నన్ను మబ్బుల్లోకి తీసికెళ్ళింది. ఎంత పైకంటే అప్పుడు కురుస్తోన్న మేఘం కంటే పైకి. ఆ మేఘల్లోని నందనవనం లాంటి తోటకి తీసికెళ్ళింది. అక్కడ ఎంత బాగుందనుకొన్నారు హూజూర్! పరిమళాలు వెదజల్లే పూలు, మధురమైన ఫలాలు, పక్షులు కిలకిలా రావాలు. అక్కడ ఎంచక్కా విహరించాను. తిరిగి రావాలనే అనిపించలేదు. కానీ మీరు నాగురించి వాకబు చేసి, నేనేమయ్యానో అని కంగారు పడతారని వచ్చేసాను” భావాన్ని అభినయీస్తూ, దృశ్యాన్ని కళ్ళకి కట్టినట్లు వివరించాడు నసీరుద్దీన్. 

తైమూర్ కి మతిపోయింది.అంత అద్భుతమైన గుర్రాన్ని తేరగా నసీరుద్దీన్ కి ఇచ్చేసినందుకు ఏడుపొచ్చింది. ఎలాగైనా ఆ గుర్రాన్ని తిరిగి పొందాలని “నసీరుద్దీన్. నీకిచ్చిన గుర్రం ముసలిది. ఆకాశంలో ఎగర గలదేమో గానీ, మామూలు సమయాల్లో వేగంగా పరిగెత్తలేదు. అది నాకు తిరిగి ఇచ్చేయ్. నీకు మరో మంచి గుర్రం ఇస్తాను” అన్నాడు.

నసీరుద్దీన్ నసుగుతూ “హూజూర్! ఇచ్చిన వస్తువు తిరిగి తీసికొన్నారనీ చెడ్డపేరు మీకు వస్తుందేమో! నా మూలంగా మీకు చెడ్డపేరు రావడం నాకిష్టం లేదు” అన్నాడు.నసీరుద్దీన్ ని బ్రతిమాలి బామాలి, ఎదురు డబ్బిచ్చి, మరో మంచి గుర్రాన్నిచ్చి నసీరుద్దీన్ దగ్గరున్న ముసలి చచ్చు గుర్రాన్ని తిరిగి కొనుక్కున్నాడు తైమూర్. 

మర్నాడు వాళ్ళు మళ్ళీ వేటకి వెళ్ళారు. గోబీ ఎడారి లోకి ప్రవేశించగానే, ముందు రోజులాగే ఆ రోజూ గాలీ వానా వచ్చాయి.మంచి బలమైన గుర్రం ఎక్కిన నసీరుద్దీన్ ఆఘామేఘాల మీద ఊళ్ళోకి దౌడాయించాడు. తైమూర్ ఎక్కిన ముసలి చచ్చూ గుర్రం, గాలీ వానా మొదలవ్వగానే శిలా విగ్రహం లాగా నిలబడిపోయింది. తైమూర్ దాన్ని కొరడాతో కొట్టాడు. పిడిగుద్దులు గుద్దాడు. బండతిట్లు తిట్టాడు. తన్నాడు. ఉహూ! ఏం చేసినా ఆ ముసలి గుర్రం అడుగు తీసి అడుగు వేయ్యలేదు. వర్షంలో ముద్దగా తడిసిపోయాడు తైమూర్. 

ఆ తడిసిన దుస్తులతోనే వర్షం తగ్గాక ఊళ్ళోకి తిరిగి వచ్చాడు. దాంతో బాగా జలుబు చేసి జ్వరం వచ్చింది. ఆ రాత్రి నీరసంగా పక్కమీదకి వాలుతున్నప్పుడు అర్ధమయ్యింది తైమూర్ కి తను, ముసలి గుర్రాన్నిచ్చినందుకే నసీరుద్దీన్ తనకి గుణపాఠం నేర్పాడని. అంతే! కన్నంలో తేలు కుట్టిన దొంగలా కిక్కురమన కుండా ఉండిపోయాడు.

బ్రాహ్మణబాలుడి కథ


పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు తంత్రవర్మ. ఇతడు కాస్తభోగలాలసుడూ, మరికాస్త స్వార్ధపరుడూనూ. అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడి మంత్రులు కొంత బుద్ధిమంతులు. అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతూ ఉండేది.

ఇలా ఉండగా, ఓ రోజు, ఈ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. మధ్యాహ్నం వరకూ జంతువుల వేటలో గడిపాడు. ఇక విశ్రాంతి తీసికొందామని నది ఒడ్డు చేరాడు. అక్కడ అతడి కొక అందమైన యువతి కన్పించింది. ఆమెని చూడగానే రాజుకి కన్ను చెదిరింది. మెల్లిగా ఆమెని చేరి “ఓ సుందరీ! నీవెవ్వరు? ఇంత నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు?” అనడిగాడు. అందుకామె అలవోకగా ఓ చిరునవ్వు నవ్వి “రాజా! నేను ముని కన్యను! ఈ అరణ్యంలోనే మా నివాసం” అంది.

రాజు ఆమె పైన తనకు గల మోహన్ని వ్యక్తపరిచాడు. ఆమె “రాజా! నేను ముని వృత్తిలో నున్నదానిని. మీరు దేశాన్నేలే మహారాజులు. మీలాంటి వారు మాలాంటి వారాని కోరదగునా? కానీ, కోరి మీరు నన్నడిగినప్పడు కాదనడం సరికాదు. నాతల్లిదండ్రులను అర్ధించి నన్ను పొందండి” అంది. వీరిలా మాట్లాడు కొంటూ ఉండగా, హఠాత్తుగా వాళ్ళ ముందో రాక్షసుడు ప్రత్యక్షమయ్యడు. చెట్టంత రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ఒక్కవుదుటున రాజుని గుప్పిట బంధించి మ్రింగబోయాడు. తంత్రవర్మ ఒక్కపెట్టున పెద్దగా ఏడుస్తూ “వద్దు. వద్దు! నన్ను చంపవద్దు” అన్నాడు.“ఒక్క షరతు మీద నిన్ను వదిలేస్తాను” అన్నాడు రాక్షసుడు. “చెప్పు. తప్పక నెరవేరుస్తా” అన్నాడు రాజు. "నీరాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బాలుణ్ణి, నీకు బదులుగా నాకు సమర్పించేటట్లయితే, నిన్నువదిలేస్తాను" అన్నాడు రాక్షసుడు.

రాజు తంత్రవర్మ సరేనన్నాడు. రాక్షసుడు వదిలిందే క్షణం, రాజధానికి పరుగెత్తాడు. సైనికుల్ని పంపి రాజ్యంలో పేదవారి గురించి ఆరా తీయించాడు. చివరికి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ పేద వారింట భార్యా,భర్త, ముగ్గురు కొడుకులూ ఉన్నారు. వారు ఆపూట కూటికి కూడా లేని పేదవారు. రాజు బ్రాహ్మణ దంపతలకి పెద్దఎత్తున డబ్బాశ పెట్టి వారి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని తనకి ధారాదత్తం చెయ్యమని అడిగాడు. బ్రాహ్మణుడు "రాజా! నాపెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం. రేపు నేను ఛస్తే నాకు తలకొరివి పెట్టవలసింది వాడే కదా! అందుచేత నాపెద్దకొడుకుని ఇవ్వను. మిగిలిన ఇద్దరిలో నీకు కావలసిన వాణ్ణి తీసుకుపో!" అన్నాడు.

అంతలో అతడి భార్య "మహారాజా! నాచిన్నకొడుకంటే నాకు తీరని ముద్దు. అంతే గాక రేపు నేను ఛస్తే, నాకు తలకొరివి పెట్టవలసినవాడు చిన్నవాడు. అందుచేత నా చిన్నకొడుకుని మీరు తీసికెళతానంటే నేను ఒప్పకోను. కావాలంటే మా రెండవకొడుకుని తీసుకుపొండి" అన్నది.రాజు వారికి డబ్బుచ్చి, రెండో కొడుకుని కొనుక్కున్నాడు. ఆ బాలుణ్ణి తీసికెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు. ముదురుగా, అరిషర్వర్గపూరితమైన, దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా, తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణబాలుడి లేత శరీరాన్ని ఆబగా చూస్తూ రాక్షసుడు పిల్లవాణ్ణి మింగబోయాడు.


సరిగ్గా ఆ పిల్లవాణ్ణి గుప్పట బిగించి, నోట బెట్టబోతుండగా ఆ బాలుడు గట్టిగా ఫకాలు మని నవ్వాడు. మరుక్షణం రాక్షసుడు పిల్లవాణ్ణి నేలదించి తలెత్తకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భేతాళుడింత వరకూ కథచెప్పి, విక్రమాదిత్యుణ్ణి చూసి "విక్రమాదిత్య మహారాజా! ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు? అది చూసి రాక్షసుడు బాలుణ్ణి మ్రింగకుండా ఎందుకు వదిలి పెట్టిపోయాడు? తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తలవెయ్యివక్కలౌతుంది. జవాబు చెప్పి మౌనభంగం చేశావో నేను నీకు అధీనం కాను" అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులమీద చిరునవ్వు మెరుస్తుండగా, "భేతాళా! ఆబాలుడి నవ్వులో "ఇరుగు పొరుగు వారు కొట్టవచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే దయమాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు. రాజే కృరుడై ప్రజలని బాధిస్తుంటే కాపాడవలసినది దైవం. అలాంటి దైవమే దయమాలి నన్ను చంపబోతుంటే ఇంక నేమి గతి?" అన్నభావం ఉన్నది. అది చూసి రాక్షసుడే అయినా బాలుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకూ దైవత్వాన్ని గుర్తిరిగి రాక్షసుడు పిల్లవాణ్ణి విడిచి పెట్టిపోయాడు" అన్నాడు.

2 మే, 2012

ఎవరికి కేటాయించిన పనిని వారు చేయకపోతే పట్టే గతి

పొలం గట్టుపైన ఉన్న చెట్లలోంచి రెండు గింజలు కిందపడి దొర్లుకుంటూ పొలంలోకి వచ్చాయి. భూమి పొరల్లో దాక్కున్నాయి. మరికొన్ని రోజులకు చినుకులు పడటంతో గింజల్లో కదలిక వచ్చింది. అప్పుడు ఒకదానితో ఒకటి మాట్లాడుతూ... "మనం ఇంకా ఈ భూమిలో దాక్కోవడంలో అర్థం లేదు. మొలకెత్తి, మొక్కలుగా, వృక్షాలుగా మారి మన బాధ్యతలను నిర్వర్తించాలి" అని చెప్పింది మొదటి గింజ. నీకెందుకు అంత తొందర. మొలకెత్తినప్పట్నించీ మనకు అన్నీ కష్టాలే కదా. చిగుర్లు వేసినప్పటినుంచీ కష్టాల పరంపర మొదలవుతుంది" అని వాపోయింది రెండో గింజ. ఇంకా... చిగుర్లెత్తగానే పశువులు తినేస్తాయని భయం, పెద్దయ్యేదాకా అదే బాధ, పండ్లు కాస్తే ఫర్వాలేదుగానీ, లేకపోతే నరికి పారేస్తారు. ఆ గుండెకోతను నేను భరించలేనంటూ చెప్పుకుపోయింది.

కాబట్టి... ఈ బాధలన్నీ తప్పించుకోవాలంటే మనం భూమిలోనే ఉండిపోతే మంచిది. లేకపోతే కష్టాలు తప్పవని చెప్పింది రెండో గింజ. అయితే... వీటన్నింటినీ ఓపిగ్గా విన్న మొదటి గింజ విత్తనాలుగా మొలకెత్తడం మన బాధ్యత. మనదగ్గరకు వచ్చి సేదతీరే వారికి చల్లని నీడను, పండ్లను ఇవ్వడంలోనే మన జీవితానికి అర్థం దాగి ఉందని చెప్పింది.  ఇతరులకు సహాయపడటం ద్వారా వచ్చే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఇతరులకు అన్నివిధాలా సహాయపడే అవకాశం ఎంతమందికి వస్తుంది? ఆ తృప్తి, ఆనందం అనుభవిస్తేగానీ తెలియదు. నీ సంగతి సరే...! కానీ.. నేను మాత్రం మొలకెత్తి తీరుతాను అని తేల్చి చెప్పింది మొదటి గింజ."ఎంత చెప్పినా వినకుండా కోరి కోరి కష్టాల్లో పడతానంటే నేను మాత్రం ఏం చేయగలను. నీ ఖర్మ అంటూ" భూమిలోనే ఉండిపోయింది రెండో గింజ. అలా కొన్ని రోజులు గడిచాయి.

మొదటి గింజ మొలకెత్తి ఒక మోస్తరుగా తయారయ్యి నునులేత చిగుళ్లతో ఆకర్షణీయంగా తయారైంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ రైతు ముళ్లకంచె వేసి దానికి రక్షణ కల్పించాడు. రెండో గింజ మాత్రం భూమిలోపల వెచ్చగా దాక్కుంది. అలా గడుస్తుండగా... ఒకరోజు గింజ దాక్కున్న చోటికే ఓ కోడిపుంజుల గుంపు భూమి పొరను కాళ్లతో తవ్వుకుంటూ వచ్చాయి. అలా తవ్వుతుండగా బయటపడ్డ రెండో గింజనుచూసిన కోడిపుంజు గబుక్కున మింగేసింది. ఇంకేముందీ... "అయ్యో...! తన స్నేహితుడు చెప్పినట్టు చేసిఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు గదా. ఎవరికి కేటాయించిన పనిని వారు చేయకపోతే నాలాంటి గతే పడుతుందని" ఏడుస్తూ... కోడిపుంజుకు ఆహారమైంది రెండో గింజ.






 

25 ఏప్రిల్, 2012

మతిలేని మృగరాజు

ఒక దట్టమైన అడవిలో ఒక సింహం నివసించేది. అడవికి రాజైన ఆ సింహం, ప్రతిరోజు జంతువులని తినేది, ఒకేసారి ఒక్కటి, ఒక్కోసారి రెండు లేదా మూడింటిని కూడా తింటూ ఉండేది. జంతువులన్నీ తమ రాజుతో విసిగిపోయాయి. అందుకని అవి ఒకరోజు సమావేశం ఏర్పాటుచేసి, ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమంటే, ఒకవేళ సింహం తన గుహనుండి బయటికి రాకుండా ఉండాలంటే అవి రోజుకి ఒక జంతువును ఆహారంగా ఆ సింహం వద్దకే పంపించాలి. రోజుకో జంతువు తనకి తానుగా సింహం దగ్గరికి వెళితే, మిగతావి మనశ్శాంతిగా అడవిలో జీవించగలవు.


రోజులు గడుస్తున్నాయి. జంతువుల సంఖ్య తరిగిపోతూనే ఉంది. మృగరాజు తన గుహలోనే కుర్చుని తన దగ్గరకు వచ్చిన భోజనాన్ని ఆనందిస్తూ తినేది. ఒక రోజు ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు భయపడుతూనే గుహకు బయలుదేరింది. అది తాబేలులాగా నెమ్మదిగా నడుస్తూ గుహ చేరుకునేసరికి సాయంత్రం అయింది. ఆకలితో అలమటిస్తున్న సింహానికి కుందేలుపైన ఎంతగానో కోపం వచ్చింది.


కుందేలు భయంతో ఏడవడం మొదలు పెట్టింది. "ఓ రాజా! ఇది నా తప్పు కాదు. మా జంతువుల సభ తప్పు కుడా కాదు. మా సభ వాస్తవానికి ఏడు కుందేళ్ళని పంపిందికానీ, మమ్మల్ని దారిలో ఒక దుర్మార్గుడు ఆపాడు. వాడు మిమ్మల్ని తిట్టాడు అంతేకాక నా స్నేహితులందర్నీ తినేసానని మీకు చెప్పమని ఆజ్ణాపించాడు" అని అంది. సింహం వెంటనే, అది పడుకున్న చోట నుండి లేచింది. "అదెక్కడుంటుందో నాకు ముందుచెప్పు? నేను దానిని బతికుండగానే తినేస్తాను" అంది కోపంగా.


"అది ఆముదం చెట్టు వెనుక ఉన్న ఒక బావిలో గుహ ఏర్పరచుకుని అందులో ఉంటోంది రాజా!" అని కుందేలు బదులు పలికింది.కుందేలును వెంటబెట్టుకుని సింహం బావి దగ్గరికి వచ్చింది. సింహం బావి గోడలపైన నిలబడి బావిలోపలికి తొంగి చుసింది. బావిలో దానికి మరో సింహం కనిపించింది. కానీ, వాస్తవానికి అక్కడ కనిపించింది నీటిలో తన ప్రతిబింబమే. కానీ, సింహం దాన్ని మరో సింహం అనుకుంది. అది తన భయంకరమైన పళ్ళు చూపింది. ఇంకో సింహం కూడా తన పళ్ళు చూపించింది. సింహం గట్టిగా గాడ్రించింది. రెండోది కూడా అదే చేసింది. బావిలో నుండి సింహం గొంతు ప్రతిధ్వనించి తిరిగి దానికే మరింత భయంకరంగా వినిపించింది.


ఇంకో సింహం ఆ ఆడవిలోకి వచ్చిందనుకుంది సింహం. మరేమీ ఆలోచించకుండా బావిలో ఉన్న ఆ కొత్త సింహం మీదకి ఉరికింది. దానితో అది బావిలో పడి, నీటిలో మునిగి చనిపోయింది. కుందేలు సంతోషంతో వేగంగా గెంతుతూ తిరిగి వెళ్ళిపోయింది. అది ప్రాణాలతో రావడం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. జరిగినదంతా విడమర్చి చెప్పింది కుందేలు, సింహం పీడ పోయినందుకు అన్నీ సంతోషించాయి.

23 ఏప్రిల్, 2012

టక్కరి నక్క

ఒక అడవిలో టక్కరి నక్క ఒకటి ఉండేది. ఆ అడవిలోనే ఓ పశువుల కాపరి గుడిసె వేసుకుని నివసించేవాడు. అతడికి కోళ్లు, కుక్కలు, బర్రెలు, ఆవులతో పాటు మేకలు కూడా ఉండేవి. వాటిని అడవిలో మేపి, పాలు పితికి జీవనం సాగించేవాడు కాపరి.ఆ గుడిసెలోని చిన్నవైన మేకపిల్లలపై టక్కరి నక్క కన్నుపడింది. ఎలాగైనా సరే వాటిని తినేయాలని అది చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. అయితే వాటికి ఎప్పుడూ తల్లి మేక కాపలాగా ఉండటం వల్ల దీనికి సాధ్యం కాలేదు.

ఒకరోజు తల్లి మేక మేతకు అడవికి వెళ్ళటంతో చిన్నవైన పిల్లలు గుడిసెలోనే ఉండిపోయాయి. తల్లి మేక వెళ్తూ వెళ్తూ తాను తప్ప ఎవరు వచ్చి తలుపు తట్టినా తీయవద్దని పిల్లలకు జాగ్రత్త చెప్పి మరీ వెళ్ళింది. ఇదంతా ఓ చాటున దాక్కుని వింటోన్న టక్కరి నక్క, ఇదే మంచి సమయమని, ఎలాగైనా ఈరోజు తన పని కానిచ్చేయాలని పథకం వేసింది.
తల్లిమేక వెళ్లిన కాసేపటికి నక్క గుడిసె వద్దకు వెళ్లి, "నేనే మీ అమ్మను, తలుపు తియ్యండర్రా...!" అని అరచింది.లోపల ఉన్న చిన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులాగా అనిపించక పోవటంతో... "నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మ గొంతు ఇంత కరుకుగా ఉండదు" అని అన్నాయి. తన పని సాధ్యం కాదని భావించిన నక్క అక్కడ్నించీ వెళ్ళిపోయింది. అయితే మనసు ఉండబట్టక తిరిగీ గుడిసె దగ్గరకు వచ్చి "తలుపు తియ్యమని బ్రతిమాలుకుంది" అమ్మ వచ్చేసిందన్న సంతోషంతో తలుపు సందులోంచి తొంగి చూశాయి మేకపిల్లలు. వాటికి నల్లటి కాళ్ళు తప్ప మరేమీ కనిపించలేదు. "నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మకి తెల్ల కాళ్లుంటాయి" అని అన్నాయి.

ఆహా! అలాగా అనుకుంటూ అక్కడ్నించీ వెళ్లిపోయిన నక్క ఈసారి కాళ్లకు తెల్లరంగు పులుముకుని వచ్చింది. గొంతు, కాళ్ళు వాటి అమ్మవిలాగే అనిపించటంతో మేకపిల్లలు తలుపుతీశాయి. అంతే ఒక్కసారిగా వాటిపై పడిన నక్క గబుక్కున మింగేసి, అక్కడ్నించి పారిపోయింది. 

22 ఏప్రిల్, 2012

బీర్బల్ తెలివితేటలకు ముగ్దుడైన అక్బర్

ఒకనాడు అక్బర్ చక్రవర్తి నిండు సభను కొలువు దీర్చి ఉన్నాడు. ఆ సందర్భంగా ఆయనకు ఒక సందేహం వచ్చింది. సభను ఒకసారి పరికించి చూసాడు. అక్బర్ పాదుషా చూపు వెనుక అర్థం తెలియక సభలోని వారందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అక్బర్ కంఠస్వరం సభలో ఖంగుమని వినిపించింది. "సత్యానికి అసత్యానికి మధ్య గల తేడాను రెండు మూడు పదాల్లో ఎవరైనా చెప్పగలరా?"
సభలోని వారెవ్వరూ పాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ముందుకు రాలేదు. ఏమి సమాధానం చెప్తే పీకల మీదకు ఏమి ముంచుకొస్తుందో అని నిమ్మకు నీరేత్తినట్లు సభికులు కూర్చుండిపోయారు. కొంత సేపు గడిచిన పిదప అక్బర్, బీర్బల్ వైపు చూశాడు. అదేసమయానికి పాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని తన ఆలోచనల్లో వెదుక్కునే పనిలో నిమగ్నమై బీర్బల్ కనిపించాడు.
అక్బర్ : బీర్బల్ నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు
బీర్బల్ : చిత్తం ప్రభూ! సత్యం-అసత్యాల మధ్య చేతికున్న నాలుగు వేళ్లే అంతరం జహపనా!
అక్బర్‌తో పాటు సభలోనివారందరికీ బీర్బల్ సమాధానం వెనుక అంతరార్ధం బోధపడలేదు.
అక్బర్ : బీర్బల్ నీ సమాధానాన్ని మరింతగా వివరిస్తావా?
బీర్బల్ : తప్పకుండా ప్రభూ! మహారాజా కంటికి, చెవికి మధ్య దూరం నాలుగు వేళ్లేనన్నది అందరికి తెలిసిందే. చెవితో వినే మాటలు అసత్యమైతే కంటి ద్వారా చూసేది సత్యమవుతుంది. బీర్బల్ వివరణకు అక్బర్‌తో పాటు సభికులు సైతం హర్షధ్వానాలు ప్రకటించారు. బీర్బల్ తెలివితేటలకు ముగ్దుడైన అక్బర్, అతనిని వేయి బంగారు నాణేలతో సత్కరించాడు.

చేప ముందుచూపు

అనగనగా ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి. అసలే ఎండాకాలం, చెరువులో ఎప్పటికప్పుడు నీళ్లు తగ్గిపోతుండటంతో చేపలన్నీ చచ్చిపోతున్నాయి. దీంతో కలత చెందిన మూడు చేపలు ఒకచోట సమావేశమైనాయి. అయ్యో.. ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడటం లేదు. మన చెరువులో చూస్తే... నీళ్ళు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈరోజు కొంతమంది జాలర్లు వచ్చి, ఇంకో పది రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వచ్చి ఈ చేపలన్నింటినీ వలవేసి పట్టుకెళ్లిపోవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోవడం ఖాయం" అని అనుకున్నాయి.


మొదటి చేప మాట్లాడుతూ... ఇక్కడికి దగ్గర్లోనే ఇంకో పెద్ద చెరువు ఉంది, మనందరం అక్కడికి వెళ్లిపోదాము అని అంది. ఇది విన్న రెండో చేప... "సర్లే ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకి అపాయం. అప్పటిదాకా ఖంగారు పడాల్సిందేమీలేదు" అని తేల్చి చెప్పింది. ఇక మూడో చేప... "నీళ్ళు ఇంకిపోయినప్పుడు, జాలర్లు వచ్చినప్పుడు కదా... ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పట్లో లేదంటూ" ఎంచక్కా వెళ్లిపోయింది.
ఎంతచెప్పినా మిగతా రెండు చేపలు వినక పోవడంతో... మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్లిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి.చెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి. అది తెలిసిన జాలర్లు వల తీసుకుని చెరువుకు వచ్చారు. జాలర్లను చూసిన రెండో చేప కాస్తంత తెలివిగా ఆలోచించి చచ్చిన దానిలాగా పడుకుంది. ఛీ..ఛీ చచ్చిపోయిన చేప మనకెందుకులే అనుకుంటూ జాలర్లు ఎత్తి దూరంగా విసిరి పారేశారు. జాలర్లు విసిరిన విసుర్లో... అది పక్కనే ఉన్న చిన్న నీటి కొలనులో పడి ప్రాణాలు దక్కించుకుంది.


ఇక చెప్పిన మాట వినని మూడో చేప మాత్రం వలలో పడి గిజ గిజ తన్నుకుంటూ జాలర్ల కంట్లో పడింది. ఆహా ఎంత పెద్ద చేపో... భలేగా వలలో పడిందని వాళ్లు సంతోషిస్తూ... ఇంటికి తీసుకెళ్లి వండుకుని తినేశారు.



గొప్ప మంత్రి బీర్బల్‌

ఒకసారి అక్బర్‌ చక్రవర్తి కొలువుకు ఒక సాధువు విచ్చేశాడు. 'ప్రభూ, మీ కొలువులో 'నవరత్నాలు' అని పిలువబడే తొమ్మిదిమంది మహాపండితులున్నారని విన్నాను. మీరు అనుమతిస్తే వారిని పరీక్షించాలను కుంటున్నా. ఆ తొమ్మిదిమందిలో ఒక్కరైనా నా ప్రశ్నకు సమాధానం యిస్తే మీ సామ్రాజ్యాన్ని దీవించి వెళ్తా. ఇవ్వలేకుంటే మాత్రం జరగబోయే అరిష్టానికి సిద్ధపడి వుండండి' అన్నాడు. 'ఆయన సవాల్‌ను స్వీకరించాలా? వద్దా?' అని చక్రవర్తితో సహా అందరూ మీమాంసలో పడిపోయారు.

కొద్దిసేపటి తర్వాత బీర్బల్‌ లేచి నిల్చుని, 'అయ్యా, అతని సవాల్‌ను స్వీకరించండి. ఆయన ప్రశ్నకు నేను సమాధానం చెప్తా' అన్నాడు. చక్రవర్తి అనుమతితో సాధువు మొదలుపెట్టాడు, 'ఒకసారి ముగ్గురు ప్రయాణీకులు చీకటిపడే వేళకు ఒక సత్రం వద్దకు చేరుకున్నారు. 'మా ముగ్గురికి మూడు గదులు ఇవ్వండి' అని అడిగారు. అందుకు సత్రం అధికారి 'ప్రస్తుతం మూడు గదులు ఖాళీగా లేవు. కానీ ఒక పెద్ద గది, అందులో మూడు మంచాలు ఉన్నాయి. అందులో మీరు ముగ్గురూ వుండొచ్చు' అన్నాడు. అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. 'ఆ గదికి ముప్పయి కంచునాణేలు కిరాయి' అని అధికారి చెప్తే, వెంటనే చెల్లించారు. ఆ తర్వాత ఆ సత్రం లెక్కలు రాసే గుమాస్తా, అధికారి వద్దకు వచ్చి, 'అయ్యా ఆ గదికి అసలు అద్దె 25 నాణాలే. మీరు 5 నాణేలు ఎక్కువ వసూలు చేశారు' అని చెప్పాడు. ఆ అధికారి చాలా నిజాయితీపరుడు. ఆయన వెంటనే ఒక నౌకరును పిలిచి, 'అధికంగా తీసుకున్న 5 నాణేలు అతనికి ఇచ్చి వాటిని ఆ ముగ్గురికి తిరిగి ఇచ్చెయ్యమని ఆదేశించాడు.

కాని ఆ నౌకరు అంత నిజాయితీపరుడేం కాదు. '5 నాణేలను ముగ్గురికి పంచటం అసంభవం', అనుకుని అతడు రెండు నాణేలు తన జేబులో వేసుకుని, మిగతా మూడు నాణేలను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున తిరిగి ఇచ్చేశాడు. అసలు సమస్య ఏమిటంటే మొత్తం నాణేలు 30. అందులో నౌకరు 2 నాణేలు తీసుకున్నాడు. గది కిరాయి 27 నాణేలు. అంటే మొత్తం 29 నాణేలు. మరి ఆ 30 వ నాణెం ఎటుపోయింది? ' అని అడిగాడు సాధువు.

సమస్య సాధారణంగానే అనిపించినా, జవాబు జఠిలంగా ఉంది. సదస్సులో ఉన్న వాళ్ళంతా లెక్కలు మళ్ళీ మళ్ళీ చేశారు. కానీ జవాబు తెలుసుకోలేకపోయారు. ఆఖరికి వాళ్ళు అందరూ బీర్బల్‌ వైపు చూశారు, 'నీవే శరణ్యం' అన్నట్టుగా. అప్పుడు బీర్బల్‌, 'అయ్యా, సాధువు గారూ, మీరు చాలా సులభమైన ప్రశ్న అడిగారు. మీరు మీ మాటల ద్వారా ఆ సమస్య చాలా జఠిలమైందని అందరూ తికమకపడేలా చేశారు.

అసలు సమస్య ప్రకారం ముగ్గురు ప్రయాణీకులు 30 నాణేలు చెల్లించారు. 3 నాణెలు వాపస్‌ తీసుకున్నారు. అంటే నిజానికి వాళ్లు 27 నాణేలే చెల్లించారు అనుకుందాం. గుమాస్తా కూడా 27 నాణేలు అంగీకరించాడు. కానీ జవాబు చాలా సులభమైంది. ఆ ప్రయాణీకులు చెల్లించిన 27 నాణేలలో, 2 నాణేలు నౌకరు తీసుకున్నాడు. మిగిలిన 25 నాణేలు గది అద్దె. కాబట్టి ఒక నాణెం ఏమైంది అనే ప్రశ్నే ఉదయించదు. ఇది జనాలను మూర్ఖులను చేయటానికి ఉపయోగించిన చిన్న చిట్కా. అంతేనా? ఏమంటారు?' అన్నాడు.

'భలే చెప్పావు బీర్బల్‌?' అన్నాడు సాధువు మెచ్చుకోలుగా. తర్వాత అక్బర్‌ వైపు తిరిగి, 'ప్రభూ మీరు చరిత్రలో గొప్ప మొఘల్‌ చక్రవర్తిగా, బీర్బల్‌ గొప్ప మంత్రిగా శాశ్వతంగా నిలిచిపోతారు. ఇవే నా ఆశీస్సులు!' అని దీవించాడు.

21 ఏప్రిల్, 2012

బీర్బల్ తెలివి తేటలకు ఇరాన్ రాజు పరీక్ష

ఒక సారిఇరాన్ రాజుకి బీర్బల్ ను చూడాలనిపించింది ఒక సారి తమ దేశం సందర్శించమని ఆ రాజు బెర్బల్కి సందేశం పంపించాడు మరో రెండు నెలలో ఇరాన్ కి వస్తానని బీర్బల్ వర్తమానం పంపాడుబీర్బల్ వచ్చే సమయానికి ఇరాన్ రాజు అచ్చం తనలాగే దుస్తులు టోపీ లూ పెట్టించి మరో ఐదుగుర్ని తనతో పాటు సింహాసనం పై కుర్చోబెట్టుకున్నాడు బీర్బల్ తెలివి తేటలకు ఇదిఒక పరీక్ష అనుకున్నాడు .
.
బీర్బల్ రాణే వచ్చాడు రాజభటులు బీర్బల్ను సాదరంగా రాజ సభకు తీసుకువచ్చారు బీర్బల్ని చూద్దామని వచ్చిన ప్రజలతో సభ కిక్కిరిసిపోయింది సభలో అడుగు పెట్టగానే బీర్బల్ ఆశ్చర్యపోయాడు ఆరుగురు రాజులు కూర్చొని వుండటం చూసి తనకు పరీక్షా పెట్టటానికే ఈ ఏర్పాటు అనుకున్నాడు ఒక్క నిమిషం చూసి సరాసరి అసలు రాజు దగ్గరికి వెళ్లి అభివాదం చేసాడు ఇరాన్ రాజు ఆశ్చర్యానికి అంతులేదు ..... ఇంటమందిలో నీనే రాజునని ఎలా తెలుసుకున్నారు మీరు ? అని బీర్బల్ని అడిగాడు ఏముంది రాజా ! మీరు తిన్నగా చూస్తువుంటే ఈ నకిలీ రాజులు మిమల్నే చూస్తున్నారు అన్నాడు బీర్బల్ .

ఇంత నిశిత పరిశీలనా వుండి కాబట్టే మీరు మహా మేధావి మిమల్ని కలవటం మా అదృష్టం అని ఇరాన్ రాజు బీర్బల్ ని కౌగిలించుకున్నాడు సభ లో ప్రజలందురు బీర్బల్ తెలివికి జోహర్లు అర్పించారు

దొంగ సాధువు

అక్బరు చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలో సుల్తాన్‌పురి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది, అందులో ఒక గుడ్డివాడైన సాధువు నివసిస్తుండేవాడు. ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండే ఆ సాధువుకు ఊరి జనాలందరి భవిష్యత్తు తెలుసని ప్రజలందరూ నమ్ముతూ ఉండేవారు. ఒకరోజు అతడి ఆశ్రమానికి ఒక వ్యక్తి తన అన్నకూతురును తీసుకొస్తాడు. ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల క్రితం ఆమె కళ్లెదురుగానే ఆమె అమ్మా, నాన్నలను ఎవరో దారుణంగా చంపేశారు. ఆ అఘాయిత్యాన్ని కళ్లారా చూసిన ఆ అమ్మాయికి అప్పటినుండి బుద్ధి స్వాధీనంలో లేకుండా తయారవుతుంది.


  దీనికి బాధపడ్డ ఆ అమ్మాయి చిన్నాన్న ఈ సాధువు బాగుచేస్తాడన్న నమ్మకంతో వైద్యం కోసం తీసుకొస్తాడు. అయితే ఆ అమ్మాయి ఆ సాధువును చూడగానే... ఏడుపు మొదలుపెట్టింది. తన అమ్మానాన్నలను చంపింది అతడే అని ఏడుస్తూ చెప్పింది. అది విన్న జనాలంతా ఆశ్చర్యపోయారు. మహానుభావుడైన సాధువు ఎవరినైనా ఎందుకు చంపుతాడు. పైగా గుడ్డివాడు ఆ పని ఎలా చేస్తాడని తమలో తాము అనుకోసాగారు. అంతే కాదు ఆ అమ్మాయికి పిచ్చిపట్టిందని, అందుకే ఏవేవో మాట్లాడుతోందని అన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ సాధువు కూడా ఆ విషయాన్నే నిర్ధారించి ఆశ్రమం నుండి వాళ్లను వెళ్లగొట్టించాడు.అయితే ఆ అమ్మాయి రోజంతా అలాగే ఏడుస్తూనే ఉంటుంది. దీంతో ఆమె చెప్పిన మాటలు నిజమేనన్న సందేహంతో ఆమె చిన్నాన్న బీర్బల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. జరిగినదంతా విన్న బీర్బల్ మరుసటిరోజు ఆ అమ్మాయిని, ఆమె చిన్నాన్నను, గుడ్డివాడైన సాధువును రాజు సభకు పిలిపించాడు.

నువ్వు ఈ అమ్మాయి అమ్మానాన్నలను చంపావా? అని గుడ్డి సాధువు ప్రశ్నించాడు బీర్బల్. "నేను గుడ్డివాడిని, నేనెలా చంపగలను?" అన్నాడు సాధువు సమాధానంగా. అలాగా..?! అంటూ ఒక్క నిమిషం వ్యవధిలో కత్తి తీసి సాధువు మీదికి ఉరికాడు బీర్బల్. అంతే.... తనకు అపాయం ముంచుకొస్తోందని గ్రహించిన సాధువు వెంటనే మరో కత్తి తీసుకుని బీర్బల్ పైకి ఎదురుదాడికి దిగాడు దొంగసాధువు.అసలు రూపాన్ని బయటపెడుతూ తనపైకి దాడికి దిగిన దొంగ సాధువు తలను ఒక్క దెబ్బతో తెగ్గొట్టాడు బీర్బల్. అంతేగాకుండా అతడివల్ల నష్టపోయిన ఆ అమ్మాయికి రాజు ఆస్థానంలోనే ఆశ్రయం కల్పించాడు