telugu moral stories లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
telugu moral stories లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9 ఆగస్టు, 2012

రంగయ్య ఉపాయం

ఒక గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతని పొరుగింట్లో ఉండే సాంబయ్య కోళ్ళ వ్యాపారం చేసేవాడు. సాంబయ్య కోళ్ళు ప్రతిరోజూ రంగయ్య పెరడులోకి వచ్చేవి. రంగయ్య భార్య గింజలు ఎండకు ఆరబోస్తే, కావల సినంత తిని, కాళ్ళతో తొక్కి చెల్లాచెదురు చేసేవి. రంగయ్య రోజూ సాంబయ్యతో కోళ్ళను తన పెరడులోకి తోలవద్దని చెప్పేవాడు.‘‘అవి మనలాగ మనుషులా ఏమిటి? చెప్పిన మాట వినడానికి. మూగప్రాణులయ్యా! ఎటుపడితే అటు వెళ్తుంటాయి. మనమే జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ సాంబయ్య నిర్లక్ష్యంగా జవాబిచ్చేవాడు. 

కొన్నిరోజులు ఇలాగే గడిచాయి. ఒకరోజు సాంబయ్య పొరుగూరు సంతకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఇంట్లోకి వెళుతూ తన కోళ్ళ కోసం రంగయ్య ఇంటి పెరడులోకి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు.రంగయ్య నేల మీద అక్కడక్కడ పడున్న గుడ్లను ఒక బుట్టలోకి ఏరుకుంటున్నాడు. ‘‘రంగయ్యా! నీ దగ్గర కోళ్ళు లేవుగా! మరి ఈ గుడ్లు ఎక్కడివి?’’ అని అడిగాడు సాంబయ్య.‘‘ఇందాక నీ కోళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళాయి. బహుశ అవే పెట్టి ఉంటాయి’’ అంటూ అమాయకంగా జవాబు చెప్పి లోపలికి వెళ్ళి పోయాడు రంగయ్య. సాంబయ్య నోరు వెళ్ళబెట్టాడు. ఇక ఆరోజు నుండి అతను తన కోళ్ళు రంగయ్య పెరడులోకి వెళ్ళకుండా జాగ్రత్త పడ్డాడు. నిజానికి ఆ గుడ్లు సాంబయ్య కోళ్లు పెట్టినవి కావు. రంగయ్యే కోళ్ళ బెడద తప్పించుకోవడానికి అలా ఉపాయం పన్నాడు. 


కోడిపుంజును చూసి భయపడిన సింహం

ఒక అడవిలో ఒక కోడిపుంజు, గాడిద స్నేహంగా ఉండేవి. తీరికవేళల్లో అవి ఒక చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవి. ఆరోజు కూడా ఎప్పటిలాగే మిట్టమధ్యాహ్నం వేళ చెట్టు దగ్గరకు చేరి ఆ మాటా ఈ మాటా చెప్పుకుంటున్నాయి. ఇంతలో ఒక సింహం అటువైపు వచ్చింది. గాడిద వెనుక వైపు నుండి రావడం వల్ల అది సింహాన్ని చూడలేదు. కోడి చూసింది. వెంటనే అది భయపడి వింతగా అరుస్తూ చెట్టు కొమ్మ పైకి ఎగిరింది.


విచిత్రంగా వినపడ్డ కోడి అరుపు వినగానే సింహం ఉలిక్కిపడింది. సింహం కోడిపుంజును చూడలేదు. ‘‘అమ్మో! మిట్టమధ్యాహ్నం చెట్ల కింద పిశాచాలు జుట్టు విరబోసుకుని కూర్చుంటాయట. ఆ చెట్టు కింద ఏదో ఉంది బాబోయ్’’ అనుకుంటూ సింహం వెనక్కి పరుగెత్తసాగింది.సింహం పరుగెత్తిన శబ్దం విని గాడిద తిరిగి చూసింది.పరుగెడుతున్న సింహం కనిపించింది. అది తనని చూసే భయపడి పారిపోతోందనుకుంది. అంతే... మరుక్షణం గాడిద గట్టిగా అరుస్తూ ‘‘ఒరేయ్ ఆగరా! ఎక్కడికి పారిపోతున్నావు? నా చేతికి దొరికావంటే నీకు ఇదే ఆఖరి రోజవుతుంది’’ అంటూ వెంటబడింది. ఇదంతా చెట్టు పైనుండి కోడి చూస్తోంది. తన అరుపులకు సింహం భయపడిందని గ్రహించి ‘‘మిత్రమా, వెళ్ళకు! వెనక్కి రా!’’ అంటూ కేకలు పెట్టింది. గాడిద కోడిపుంజు మాటలు పట్టించుకోలేదు. అలాగే కాస్తదూరం సింహాన్ని అనుసరిస్తూ వెళ్ళింది.

కొద్దిదూరం వెళ్ళాక సింహం పరుగెత్తటం ఆపి వెనుకకు తిరిగి తన వెంటే వస్తున్న గాడిదను చూసింది. గాడిద తన దగ్గరకు రాగానే సింహం దాని మూతి మీద పంజాతో ఒక్కటిచ్చింది. దానితో గాడిద కుయ్యో మొర్రో అంటూ అక్కడి నుండి పారిపోయి వచ్చేసింది.


9 జూన్, 2012

బ్రాహ్మణబాలుడి కథ


పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు తంత్రవర్మ. ఇతడు కాస్తభోగలాలసుడూ, మరికాస్త స్వార్ధపరుడూనూ. అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడి మంత్రులు కొంత బుద్ధిమంతులు. అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతూ ఉండేది.

ఇలా ఉండగా, ఓ రోజు, ఈ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. మధ్యాహ్నం వరకూ జంతువుల వేటలో గడిపాడు. ఇక విశ్రాంతి తీసికొందామని నది ఒడ్డు చేరాడు. అక్కడ అతడి కొక అందమైన యువతి కన్పించింది. ఆమెని చూడగానే రాజుకి కన్ను చెదిరింది. మెల్లిగా ఆమెని చేరి “ఓ సుందరీ! నీవెవ్వరు? ఇంత నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు?” అనడిగాడు. అందుకామె అలవోకగా ఓ చిరునవ్వు నవ్వి “రాజా! నేను ముని కన్యను! ఈ అరణ్యంలోనే మా నివాసం” అంది.

రాజు ఆమె పైన తనకు గల మోహన్ని వ్యక్తపరిచాడు. ఆమె “రాజా! నేను ముని వృత్తిలో నున్నదానిని. మీరు దేశాన్నేలే మహారాజులు. మీలాంటి వారు మాలాంటి వారాని కోరదగునా? కానీ, కోరి మీరు నన్నడిగినప్పడు కాదనడం సరికాదు. నాతల్లిదండ్రులను అర్ధించి నన్ను పొందండి” అంది. వీరిలా మాట్లాడు కొంటూ ఉండగా, హఠాత్తుగా వాళ్ళ ముందో రాక్షసుడు ప్రత్యక్షమయ్యడు. చెట్టంత రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ఒక్కవుదుటున రాజుని గుప్పిట బంధించి మ్రింగబోయాడు. తంత్రవర్మ ఒక్కపెట్టున పెద్దగా ఏడుస్తూ “వద్దు. వద్దు! నన్ను చంపవద్దు” అన్నాడు.“ఒక్క షరతు మీద నిన్ను వదిలేస్తాను” అన్నాడు రాక్షసుడు. “చెప్పు. తప్పక నెరవేరుస్తా” అన్నాడు రాజు. "నీరాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బాలుణ్ణి, నీకు బదులుగా నాకు సమర్పించేటట్లయితే, నిన్నువదిలేస్తాను" అన్నాడు రాక్షసుడు.

రాజు తంత్రవర్మ సరేనన్నాడు. రాక్షసుడు వదిలిందే క్షణం, రాజధానికి పరుగెత్తాడు. సైనికుల్ని పంపి రాజ్యంలో పేదవారి గురించి ఆరా తీయించాడు. చివరికి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ పేద వారింట భార్యా,భర్త, ముగ్గురు కొడుకులూ ఉన్నారు. వారు ఆపూట కూటికి కూడా లేని పేదవారు. రాజు బ్రాహ్మణ దంపతలకి పెద్దఎత్తున డబ్బాశ పెట్టి వారి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని తనకి ధారాదత్తం చెయ్యమని అడిగాడు. బ్రాహ్మణుడు "రాజా! నాపెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం. రేపు నేను ఛస్తే నాకు తలకొరివి పెట్టవలసింది వాడే కదా! అందుచేత నాపెద్దకొడుకుని ఇవ్వను. మిగిలిన ఇద్దరిలో నీకు కావలసిన వాణ్ణి తీసుకుపో!" అన్నాడు.

అంతలో అతడి భార్య "మహారాజా! నాచిన్నకొడుకంటే నాకు తీరని ముద్దు. అంతే గాక రేపు నేను ఛస్తే, నాకు తలకొరివి పెట్టవలసినవాడు చిన్నవాడు. అందుచేత నా చిన్నకొడుకుని మీరు తీసికెళతానంటే నేను ఒప్పకోను. కావాలంటే మా రెండవకొడుకుని తీసుకుపొండి" అన్నది.రాజు వారికి డబ్బుచ్చి, రెండో కొడుకుని కొనుక్కున్నాడు. ఆ బాలుణ్ణి తీసికెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు. ముదురుగా, అరిషర్వర్గపూరితమైన, దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా, తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణబాలుడి లేత శరీరాన్ని ఆబగా చూస్తూ రాక్షసుడు పిల్లవాణ్ణి మింగబోయాడు.


సరిగ్గా ఆ పిల్లవాణ్ణి గుప్పట బిగించి, నోట బెట్టబోతుండగా ఆ బాలుడు గట్టిగా ఫకాలు మని నవ్వాడు. మరుక్షణం రాక్షసుడు పిల్లవాణ్ణి నేలదించి తలెత్తకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భేతాళుడింత వరకూ కథచెప్పి, విక్రమాదిత్యుణ్ణి చూసి "విక్రమాదిత్య మహారాజా! ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు? అది చూసి రాక్షసుడు బాలుణ్ణి మ్రింగకుండా ఎందుకు వదిలి పెట్టిపోయాడు? తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తలవెయ్యివక్కలౌతుంది. జవాబు చెప్పి మౌనభంగం చేశావో నేను నీకు అధీనం కాను" అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులమీద చిరునవ్వు మెరుస్తుండగా, "భేతాళా! ఆబాలుడి నవ్వులో "ఇరుగు పొరుగు వారు కొట్టవచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే దయమాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు. రాజే కృరుడై ప్రజలని బాధిస్తుంటే కాపాడవలసినది దైవం. అలాంటి దైవమే దయమాలి నన్ను చంపబోతుంటే ఇంక నేమి గతి?" అన్నభావం ఉన్నది. అది చూసి రాక్షసుడే అయినా బాలుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకూ దైవత్వాన్ని గుర్తిరిగి రాక్షసుడు పిల్లవాణ్ణి విడిచి పెట్టిపోయాడు" అన్నాడు.

16 ఏప్రిల్, 2012

రామయ్య ఉపాయం


ఒక ఊరిలో రామయ్య అనే అతను ఉండేవాడు.అతడు టోపీలు కుట్టుకుని పొరుగూరిలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో జీవితం గడిపేవాడు.ఒక రోజు ఎండలో తిరిగి టోపీలు అమ్మి అలిసిపోయి ,ఒక చెట్టు క్రిందకు వచ్చిటోపీల బుట్ట ప్రక్కన పెట్టి ఆ చెట్టు క్రిందే నిద్రపోయాడు.ఆ చెట్టుపైన చాలా కోతులు ఉన్నవి.

ఆకోతులునిద్రించు రామయ్య తలపైనున్న టోపీనీ చూసి క్రిందకు వచ్చిబుట్టలోనున్నా టోపీలనీ తీసుకొని తలా ఒకటొపీనీ పెట్టుకొని గంతులు వేస్తున్నవి కోతులు. ఇంతలో రామయ్యకు మెలకువ వచ్చి టోపీల బుట్టవైపు చూసాడు.బుట్టలోని టోపీలు ఏమైనవి అని చుట్టు కలియ చూసాడు.తన టోపీలు పెట్టుకొని చెట్టుపైన ఆడుతున్న కోతులను చూసి ఏమిచేయాలో తోచలేదు.కొంతసేపు ఆలోచించినతరువాత ఒక ఆలోచన తట్టింది.వెంటనే తన తలపైనున్న టోపీ తీసి వేసి నేలపై విసిరాడు.అది గమనించిన కోతులు వాటి తలలమీద టోపీలు తీసి నేలమీదకు విసిరాయి.వెంటనే  రామయ్య టోపీలన్ని ఏరీ బుట్టలో వేసుకొని తన దారినతాను వెళ్ళిపోయాడు.

నీతి: ఉపాయంతో సమస్యలు సాధించవచ్చు.
 

13 ఏప్రిల్, 2012

ఎలుగుబంటి ఉపాయం

ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానిది కష్టపడి పనిచేసే మనస్తత్వం. తను ఉండటానికి ఎంతో శ్రమపడి ఒక గుహను నిర్మించుకుంది. రంగురంగుల పువ్వులు, రకరకాల ఆకులు ఏరుకునివచ్చి గుహకు అలంకరించింది. దాంతో ఎలుగుబంటి గుహ చాలా అందంగా తయారైంది. జంతువులన్నీ వచ్చి ఆ గుహను చూసి ఎలుగుబంటిని అభినందించసాగాయి. ఆనోటా ఈనోటా ఈ విషయం ఆ అడవికి రాజైన సింహానికి తెలిసింది. దానికి ఈర్ష్య కలిగింది. ‘అడవికి రాజును నేను. అంత అందమైన గుహ నా దగ్గర తప్ప మరొకరి దగ్గర ఉండటానికి వీల్లేదు’ అనుకుని వెంటనే ఆ గుహను వెతుక్కుంటూ బయలుదేరింది.

సింహం ఆ గుహను చూసింది. ‘నిజంగా చాలా బాగుంది. నేనిక్కడే ఉంటాను’ అనుకుంటూ లోపలకి వెళ్లింది. అక్కడున్న ఎలుగుబంటితో ‘‘ఇకనుండి ఈ గుహ నాది. నువ్వు బయటకు వెళ్లి మరో గుహ కట్టుకోపో’’ అని శాసించింది.ఎలుగుబంటికి ఏం చేయాలో తోచలేదు, పాపం ఏడుస్తూ వెళ్ళిపోసాగింది. దారిలో ఒక నక్క ఎదురైంది. జరిగిన విషయం విని నక్క ‘‘బాధ పడకు. నేను చెప్పినట్టు చెయ్యి’’ అంటూ ఒక ఉపాయం చెప్పింది.

మరునాడు ఎలుగుబంటి ఒక సంచి తీసుకుని సింహం దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో సింహం నిద్రపోతోంది. ఎలుగుబంటి నెమ్మదిగా ఆ సంచిని అక్కడే ఉన్న ఒక బల్ల మీద పెట్టి బయటకు వచ్చేసింది. కాస్సేపటి తరువాత సింహం నిద్ర లేచింది. బల్లమీద సంచి కనబడగానే ఆసక్తిగా దాన్ని విప్పి చూసింది. సంచి మూతి తెరుచుకోగానే ‘గుయ్‌’ మని కొన్ని వందల తేనెటీగలు బయటకు వచ్చాయి. అంతసేపు సంచిలో బంధింపబడి ఉండటం వల్ల అవి చాలా కోపంగా ఉన్నాయి. ఒక్కసారిగా అవి సింహం మీదకు దాడి చేసాయి. 

వాటిని తప్పించుకోవడానికి సింహం గుహ బయటకు పరుగెత్తింది. తేనెటీగలు దాన్ని వదలక వెంటబడి మరీ కుట్టసాగాయి. అలా తేనెటీగలు సింహాన్ని చాలా దూరం తరిమాయి. సింహం ఎలాగోలా వాటి బారి నుండి తప్పించుకుంది. ఆ సంఘటనతో భయపడ్డ సింహం మళ్ళీ ఎలుగుబంటి గుహ పేరెత్తలేదు. సింహం పీడ విరగడవడంతో ఎలుగుబంటి తిరిగి తన గుహలో ఆనందంగా ఉండసాగింది.

1 ఏప్రిల్, 2012

ఆవు-పులి కథ

నాకు తెలిసి ఈ కథ వినని తెలుగువాడు వుండడు, కానీ మనమందరం మన తెలుగులోని ఈ అపురూప నీతి కథలని మర్చిపోతున్నాం, ఇలాంటి కథలు నర్సరీల్లో పిల్లలకు నేర్పరు మనమే చొరవచేసుకుని మన పిల్లలకి అలనాటి నీతి కథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం.

ఒక ఊళ్ళో ఒక ఆవు వుండేది, అది అందరితో చాలా మంచిగా, కలహించుకోకుండా, యజమాని మెప్పినట్లు నడుచుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది, ఒకరోజు అది అడవిలో మేతమేస్తుండగా , బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంట బడింది, పులి ఎంతో అందంగా బలంగా నిగ నిగ లాడుతున్న ఆవుచూడగానే అప్పటివరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది, ఇది గమనించిన ఆవు ఆగు ఆగు పులిరాజ నేను చెప్పే మాటలు కొంచం ఆలకించు..నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు నీవు దయ తలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో, కొన్ని మంచి బుద్దులు నేర్పి వస్తాను అని వేడుకుంది.

ఆవు మాటలకు పులి ఫక్కున నవ్వింది, ఒహో ఎంత నమ్మకంగా పలుకుతున్నావు చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమన్న పిచ్చిదాన్నా, చాలా ఆకలిమీదున్నాను నీ మాయమాటలకి పడిపోయి నిన్ను వదుల్తా ననుకున్నావా. అయ్యో!  పులి రాజ నన్ను నమ్ము నేనెప్పుడూ అసత్యమాడలేదు, నువ్వుదయతలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలు ఇచ్చివస్తాను, నిన్ను మోసగించి నేను బతకగలనా అయినా ఆ అసత్యపు జీవితం నాకు ఏల ఆకలితో అలమటిస్తున్న నీకు ఆకలి తీర్చడంకన్నా పుణ్య కార్యముందా నన్ను నమ్ము.

పులి ఆవుమాటలకు నవ్వి సరే వెల్లు కాని మళ్ళీ తిరిగిరాకపోయావో ఈ రోజుకాకపోయినా మరునాడు నువ్వు నాకు చిక్కకపోవు అప్పుడు చెపుతా నీ సంగతి అంది.అంతమాటలకే సంతోషించిన ఆవు ఆగమేగాలమీద ఇళ్ళు చేరుకుని తన బిడ్డకి కడుపునిండా పాలిచ్చి, బిడ్డా ఇదే నా ఆఖరిచూపు, మంచి దానిగా మసులుకో, బుద్దిమంతురాలుగా యజమానికి సహకరించు, తోటి వారితో సఖ్యంగా ఉండు గొడవలద్దు, జీవితంలో ఎప్పుడూ అబద్దం ఆడరాదు, సత్యాన్నే పలుకు అది నీకు మేలు చేస్తుంది, అందరిలోకి మంచిదానవుగా పేరు తెచ్చుకో జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్దులు చెప్పి సెలవుతీసుకుని అడవికి బయలుదేరింది.

అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పులి, దూరంగా ఆవు రావడం కనిపించి ఆశ్చర్యపోయింది, ఆహా ఈ ఆవు ఎంత నమ్మకమైనది, అన్న మాట ప్రకారం నాకు ఆహారంగా అవడనికి తిరిగి వస్తుంది, తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం అని అన్న ఈ ఆవు ఎంత గొప్పది, ఇలాంటి సత్యవచణురాలిని చంపితే నాకు పాపం తప్పదు అనుకుంది.ఆవు దగ్గరికి రాగానే, ఓ మహోత్తమురాల నువ్వు ఎంత సత్యవచణురాలివి ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారమవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహా పాపం చుట్టుకుంటుంది, నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు ఎదో విధంగా తీర్చుకుంటాను నువ్వు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అంది.ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది.
నీతి: అబద్దమాడకూడదు, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది