moral stories in telugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
moral stories in telugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9 ఆగస్టు, 2012

కోడిపుంజును చూసి భయపడిన సింహం

ఒక అడవిలో ఒక కోడిపుంజు, గాడిద స్నేహంగా ఉండేవి. తీరికవేళల్లో అవి ఒక చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవి. ఆరోజు కూడా ఎప్పటిలాగే మిట్టమధ్యాహ్నం వేళ చెట్టు దగ్గరకు చేరి ఆ మాటా ఈ మాటా చెప్పుకుంటున్నాయి. ఇంతలో ఒక సింహం అటువైపు వచ్చింది. గాడిద వెనుక వైపు నుండి రావడం వల్ల అది సింహాన్ని చూడలేదు. కోడి చూసింది. వెంటనే అది భయపడి వింతగా అరుస్తూ చెట్టు కొమ్మ పైకి ఎగిరింది.


విచిత్రంగా వినపడ్డ కోడి అరుపు వినగానే సింహం ఉలిక్కిపడింది. సింహం కోడిపుంజును చూడలేదు. ‘‘అమ్మో! మిట్టమధ్యాహ్నం చెట్ల కింద పిశాచాలు జుట్టు విరబోసుకుని కూర్చుంటాయట. ఆ చెట్టు కింద ఏదో ఉంది బాబోయ్’’ అనుకుంటూ సింహం వెనక్కి పరుగెత్తసాగింది.సింహం పరుగెత్తిన శబ్దం విని గాడిద తిరిగి చూసింది.పరుగెడుతున్న సింహం కనిపించింది. అది తనని చూసే భయపడి పారిపోతోందనుకుంది. అంతే... మరుక్షణం గాడిద గట్టిగా అరుస్తూ ‘‘ఒరేయ్ ఆగరా! ఎక్కడికి పారిపోతున్నావు? నా చేతికి దొరికావంటే నీకు ఇదే ఆఖరి రోజవుతుంది’’ అంటూ వెంటబడింది. ఇదంతా చెట్టు పైనుండి కోడి చూస్తోంది. తన అరుపులకు సింహం భయపడిందని గ్రహించి ‘‘మిత్రమా, వెళ్ళకు! వెనక్కి రా!’’ అంటూ కేకలు పెట్టింది. గాడిద కోడిపుంజు మాటలు పట్టించుకోలేదు. అలాగే కాస్తదూరం సింహాన్ని అనుసరిస్తూ వెళ్ళింది.

కొద్దిదూరం వెళ్ళాక సింహం పరుగెత్తటం ఆపి వెనుకకు తిరిగి తన వెంటే వస్తున్న గాడిదను చూసింది. గాడిద తన దగ్గరకు రాగానే సింహం దాని మూతి మీద పంజాతో ఒక్కటిచ్చింది. దానితో గాడిద కుయ్యో మొర్రో అంటూ అక్కడి నుండి పారిపోయి వచ్చేసింది.


15 మార్చి, 2012

బంగారు పక్షి

అనగా అనగా ఒక ఊళ్ళో మల్లయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య సుబ్బమ్మ. ఒకరోజున, మల్లయ్య పొలానికి వెళ్తుండగా అతనికి ఒక బంగారు పక్షి కనబడ్డది. అది ఒక అరుగు మీద కూర్చొని ఉన్నది. మల్లయ్యకు దాన్ని చూస్తే ముచ్చట వేసింది. అయితే అదే సమయానికి గుంటనక్క ఒకటి పక్షి వెనకగా వచ్చి దాన్ని పట్టుకోబోయింది. మల్లయ్య వెంటనే తన చేతిలో‌ఉన్న కర్రను నక్కమీదికి విసిరేసాడు. బంగారు పక్షి ఉలిక్కిపడి చూసేసరికి, గుంటనక్క తన వెనుకనే ఉన్నది. వెంటనే అది ఎగిరిపోయింది; గుంటనక్క కూడా అడవిలోకి పరుగుతీసింది.

ఆ బంగారు పక్షి చాలా మంచిది. “నన్ను రక్షించినందుకు నీకు చాలా ధన్యవాదాలు మనిషీ” అనుకున్నది అది, తన మనసులో. మరుసటిరోజున అది మల్లయ్యకోసం అదే అరుగు మీద కూర్చొని ఎదురుచూసింది. కానీ‌ మల్లయ్య రాలేదు. ఎందుకంటే, మల్లయ్యకు ఆరోగ్యం‌ బాగా లేకుండింది. ఆ తరువాత మల్లయ్య రెండు రోజులు మాత్రమే బ్రతికాడు- తరువాత అతను చనిపోయాడు.

బంగారు పక్షి అతనికోసం ప్రతిరోజూ ఎదురుచూసేది. చివరికి అది మల్లయ్యను వెతుక్కుంటూ అతని ఇంటికి పోయింది. అప్పుడుగాని దానికి అర్థం కాలేదు- మల్లయ్య తనకు ఎందుకు కనబడలేదో. భర్త లేని సుబ్బమ్మను చూస్తే దానికి జాలి వేసింది. ఆనాటినుండీ అది ప్రతిరోజూ వచ్చి, మల్లయ్య ఇంటి ముందు ఒక బంగారు ఈకను వదిలి వెళ్ళటం మొదలు పెట్టింది.

సుబ్బమ్మ ఆ ఈకల్ని ఒక్కటొక్కటిగా ప్రక్క ఊళ్ళో అమ్ముకొనేది. ఒక్కొక్క బంగారు ఈకకు చాలా డబ్బులు వచ్చేవి. అంతలో బంగారు పక్షి మరిన్ని ఈకలు వదిలి వెళ్ళేది. అలా రానురాను సుబ్బమ్మ ఊళ్ళోకెల్లా ధనవంతురాలైంది.

సంపద పెరిగిన కొద్దీ సుబ్బమ్మకు ఆశకూడా హెచ్చింది. తనకు ఈకలు ఇస్తున్న బంగారు పక్షిని పట్టుకొని దాని ఈకలన్నిటినీ పీక్కోవాలని ఆమె కలలు కనటం మొదలు పెట్టింది. బంగారు పక్షికోసం మాటువేసి, ఆమె ఒకరోజున దాన్ని పట్టుకోబోయింది. చురుకుగా ఉన్న పక్షి, ఆమెనుండి తప్పించుకొని పారిపోయింది. సుబ్బమ్మ దానికోసం తరువాత చాలా రోజులపాటు ఎదురుచూసింది గానీ, అది ఇక తిరిగి అటువైపుకు రాలేదు.
ఆశపోతు సుబ్బమ్మకు మామూలుగా వచ్చే బంగారుఈక కూడా దొరకకుండా అయ్యింది!

14 మార్చి, 2012

ముంగిస - పిల్లాడు

ఎంతవారయినా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధ పడతుంటారు. తొందరపాటు ఎప్పడూ ప్రమాదానికి హేతువు. శివరామపుంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగిస ఉండేది. అది విష్ణుశర్మ భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. 

ఒక రోజు విష్ణుశర్మ ప్రక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగది లోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణుశర్మ భార్య వంటగదిలో పనీపాట చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అక్కడ నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చుసి పాముని గమనించింది.

ఇన్నాళ్ళ నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య ఋణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని క్రిందకు దూకింది. పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగిస పాముని చంపింది. ఆ తరువాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తల పెట్టిందని భావించింది.

 విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది. ఆ దెబ్బకి పాపం మూంగిస చచ్చిపోయింది. ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండటం చూసి విష్ణుశర్మ భార్య ప్రక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్ధం చేసుకుని అనవసరంగా తొందరపడి మంగిసను చంపినందుకు బాధపడింది