telugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
telugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16 ఏప్రిల్, 2012

రామయ్య ఉపాయం


ఒక ఊరిలో రామయ్య అనే అతను ఉండేవాడు.అతడు టోపీలు కుట్టుకుని పొరుగూరిలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో జీవితం గడిపేవాడు.ఒక రోజు ఎండలో తిరిగి టోపీలు అమ్మి అలిసిపోయి ,ఒక చెట్టు క్రిందకు వచ్చిటోపీల బుట్ట ప్రక్కన పెట్టి ఆ చెట్టు క్రిందే నిద్రపోయాడు.ఆ చెట్టుపైన చాలా కోతులు ఉన్నవి.

ఆకోతులునిద్రించు రామయ్య తలపైనున్న టోపీనీ చూసి క్రిందకు వచ్చిబుట్టలోనున్నా టోపీలనీ తీసుకొని తలా ఒకటొపీనీ పెట్టుకొని గంతులు వేస్తున్నవి కోతులు. ఇంతలో రామయ్యకు మెలకువ వచ్చి టోపీల బుట్టవైపు చూసాడు.బుట్టలోని టోపీలు ఏమైనవి అని చుట్టు కలియ చూసాడు.తన టోపీలు పెట్టుకొని చెట్టుపైన ఆడుతున్న కోతులను చూసి ఏమిచేయాలో తోచలేదు.కొంతసేపు ఆలోచించినతరువాత ఒక ఆలోచన తట్టింది.వెంటనే తన తలపైనున్న టోపీ తీసి వేసి నేలపై విసిరాడు.అది గమనించిన కోతులు వాటి తలలమీద టోపీలు తీసి నేలమీదకు విసిరాయి.వెంటనే  రామయ్య టోపీలన్ని ఏరీ బుట్టలో వేసుకొని తన దారినతాను వెళ్ళిపోయాడు.

నీతి: ఉపాయంతో సమస్యలు సాధించవచ్చు.
 

14 మార్చి, 2012

ముంగిస - పిల్లాడు

ఎంతవారయినా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధ పడతుంటారు. తొందరపాటు ఎప్పడూ ప్రమాదానికి హేతువు. శివరామపుంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగిస ఉండేది. అది విష్ణుశర్మ భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. 

ఒక రోజు విష్ణుశర్మ ప్రక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగది లోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణుశర్మ భార్య వంటగదిలో పనీపాట చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అక్కడ నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చుసి పాముని గమనించింది.

ఇన్నాళ్ళ నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య ఋణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని క్రిందకు దూకింది. పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగిస పాముని చంపింది. ఆ తరువాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తల పెట్టిందని భావించింది.

 విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది. ఆ దెబ్బకి పాపం మూంగిస చచ్చిపోయింది. ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండటం చూసి విష్ణుశర్మ భార్య ప్రక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్ధం చేసుకుని అనవసరంగా తొందరపడి మంగిసను చంపినందుకు బాధపడింది 

9 జూన్, 2011

రంగు వెలిసిన ఏనుగు

అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఒకరోజు సరస్సులో ఈదుతున్న హంసలను, పొదల్లో అటుఇటు గెంతులేస్తున్న కుందేళ్ళను చూశాక ఆ ఏనుగుకు ‘నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను. హంసలు, కుందేళ్ళు తెల్లగా, చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. నా శరీరం కూడా తెల్లగా ఉంటే నేను కూడా వాటిలాగే అందంగా ఉండేదాన్నేమో!’ అనే ఆలోచన కలిగింది.ఎలాగైనా తను కూడా తెల్లగా మారాలన్న కోరిక కలిగింది. కానీ ఎలా మారాలో దానికి తెలియలేదు. ఇక ఆ రోజు నుంచి ఏనుగు దిగులుతో ఆహారం తీసుకోవడం మానేసి చిక్కి శల్యమైపోయింది.

ఈ సంగతి ఏనుగు మిత్రుడైన నక్కకు తెలిసింది. స్నేహితుడి కోరిక తీర్చడానికి అది ఒక ఉపాయం ఆలోచించింది. అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరు నుంచి తెల్లరంగు డబ్బాలు తెప్పించింది. కోతులతో, ఎలుగుబంట్లతో చెప్పి ఏనుగు శరీరం నిండా తెల్లరంగు వేయించింది. నల్లగా ఉన్నది కాస్తా తెల్లగా మారిపోయింది. ఆ విధంగా తన కోరిక తీరడంతో ఏనుగుకు ఎంతో సంతోషం కలిగింది. తెల్లటి తన శరీరాన్ని చూసుకుని మురిసిపోయింది.

కొన్నిరోజుల తరువాత ఆ అడవిలో తెల్ల ఏనుగు ఉందన్న వార్త ఆ దేశపు రాజుకు తెలిసింది. ఎలాగైనా ఆ ఏనుగును బంధించి తీసుకురమ్మని కొంతమంది భటులను పంపాడు. రాజభటులు గుంపులుగుంపులుగా వచ్చి ఆ అడవంతా జల్లెడపట్టి వెతకసాగారు. వారి రాకతో ఆ అడవి వాతావరణమంతా అతలాకుతలం అయిపోయింది. అంతవరకు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా సంచరించే జంతువులు, పక్షులు ప్రాణభయంతో పరుగులు పెట్టాయి. చివరకు తెల్లగా మారిన ఆ ఏనుగును రాజభటులు పట్టుకోగలిగారు.

ఏనుగును నలువైపులా చుట్టుముట్టి తాళ్ళతో కట్టి లాక్కుపోసాగారు భటులు. ఇంతలో వర్షం మొదలయ్యింది. చూస్తుండాగానే వర్షం పెద్దదై కుండపోతగా కురవసాగింది. ఆ వర్షపు నీటికి ఏనుగు ఒంటి మీద ఉన్న తెల్లరంగు కాస్తా కరిగిపోయి దాని అసలు రంగు బయటపడింది. నల్ల ఏనుగును చూసి రాజభటులు ముందు అవాక్కయ్యి తరువాత దాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ విధంగా ప్రాణాలతో బయటపడ్డ ఏనుగుకు బుద్ధి వచ్చింది. ఉన్న దానితో సంతృప్తి చెందాలే కాని, లేని దాని గురించి బాధపడకూడదని నిర్ణయించుకుంది. తన తప్పు తెలుసుకుని గట్టిగా లెంపలు వేసుకుంది.

4 జూన్, 2011

బీర్బల్‌ కు ఆస్థానంలో ఉన్నత పదవి


అక్బర్‌ చక్రవర్తి సభలో కొలువుదీరి వున్నప్పుడు ఒక యువకుడు మెల్లగా లోపలికి ప్రవేశించాడు. అక్బర్‌ చూపులు తనమీద పడగానే అతడు వంగి సలాం చేశాడు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు?' అని అడిగాడు అక్బర్‌ చక్రవర్తి. ప్రభూ! నా పేరు మహేశ్‌దాస్‌. ఆగ్రాకు నాలుగామడల దూరంలో వున్న కుగ్రామం మాది.

ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చాను,'' అన్నాడు ఆ యువకుడు. ``నీకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందని ఎవరు చెప్పారు?'' అని అడిగాడు అక్బర్‌. ``నా తెలివితేటల్ని చూసి, `నువ్వు చక్రవర్తి దగ్గరికి వెళ్లు, నీకు తప్పక ఉద్యోగం దొరుకుతుంది,' అని మా పంతులే చెప్పారు. ఆయన మాటవిని అంతదూరం కాలినడకనే వచ్చి, అతి ప్రయత్నం మీద తమ దర్శనం చేసుకోగలిగాను ప్రభూ,'' అన్నాడు మహేశ్‌.

  ``ప్రతి ఉపాధ్యాయుడూ, తన విద్యార్థుల గురించి అలాగే గొప్పగా అంచనా వేస్తాడు. ఉత్తమ అర్హతలు గలవారికి మాత్రమే మేము ఇక్కడ ఉద్యోగలిస్తాం,'' అన్నాడు అక్బర్‌. "నేను ఉత్తముల్లోకెల్లా ఉత్తముడినని రుజువు చేయగలను ప్రభూ,'' అన్నాడు మహేశ్‌ ఎంతో ఆత్మవిశ్వాసంతో. "చేసి చూపు మరి. ఆలస్యం దేనికి?'' అన్నాడు అక్బర్‌.
``అందుకు ప్రభువులు ఒక చిన్న కానుకను దయచేయాలి,'' అన్నాడు మహేశ్‌. ``మొదట ప్రతిభను నిరూపించుకుంటే తప్ప కానుకలు ఇవ్వరు,'' అన్నాడు అక్బర్‌. ``నేను అడిగే కానుకకు దమ్మిడీ ఖర్చుకాదు ప్రభూ!'' అన్నాడు మహేశ్‌. ``అలాగా? ఏమిటది?'' అని అడిగాడు అక్బర్‌. 30 కొరడా దెబ్బలు, ప్రభూ! అన్నాడు మహేశ్‌. అతడి కోరిక విని చక్రవర్తితో పాటు అందరూ ఆశ్చర్యపోయారు.


``నీకేమైనా పిచ్చి పట్టిందా?'' అన్నాడు అక్బర్‌ అసహనంగా. ``ఆ సంగతి తరవాత తెలుస్తుంది. మొదట నేను అడిగింది దయచేసి ఇప్పించండి ప్రభూ,'' అన్నాడు మహేశ్‌ వినయంగా. అక్బర్‌ వెంటనే కొరడా తెప్పించి, దాన్ని తెచ్చిన వాణ్ణి దగ్గరికి పిలిచి, "కొరడాతో వాణ్ణి నిజంగానే కొట్టొద్దు. కొడుతున్నట్టు అభినయిస్తూ, మెల్లగా తాకించు,'' అని చెవిలో చెప్పాడు. భటుడు వెళ్ళి అలా ఝళిపిస్తూంటే, ముందుకు వంగిన మహేశ్‌, ఒకటి, రెండూ... అంటూ లెక్కించి, పది రాగానే, "ఆగు!'' అని అరిచి తలెత్తి అక్బర్‌ చక్రవర్తిని చూస్తూ, "ప్రభూ, కానుకలో నా వాటా నేను పుచ్చుకున్నాను.

ఇక మిగిలిన దాన్ని తమ ఉద్యోగుల్లో ఇద్దరు సమంగా పంచుకుంటారు,'' అన్నాడు. ``ఏమిటి నువ్వంటున్నది?'' అని అడిగాడు అక్బర్‌ అతడు చెబుతున్నది అంతుబట్టక. "అవును ప్రభూ! భవన ద్వారం వద్ద నిలబడ్డ ఇద్దరు కాపలా భటులు ఏదైనా ఇస్తే తప్ప నన్ను లోపలికి వదలనన్నారు. `నా దగ్గర డబ్బులు లేవు. ప్రభువిచ్చే కానుకను మీతో సమానంగా పంచుకుంటాను,' అని మాట ఇచ్చి లోపలికి వచ్చాను ప్రభూ,'' అన్నాడు మహేశ్‌. ``అలాగా!'' అన్నాడు అక్బర్‌ కోపంతో. "వాళ్ళను పిలిపిస్తే అంతా తమకు తెలుస్తుంది,'' అన్నాడు మహేశ్‌. అక్బర్‌ తల పంకించాడు.కొంతసేపటికి ఆ ఇద్దరు భటులూ అక్కడికి రాగానే, ``మిత్రులారా, మీరు నాకెంతో సాయపడ్డారని ప్రభువులకు విన్నవించాను. మీ దయ లేకుంటే నాకు ప్రభువుల దర్శన భాగ్యం లభించేదికాదని చెప్పాను. ఆయన దయచేసిన కానుకలో మీకు తలా ఒక వాటా ఇవ్వాలి కదా. ప్రభువులు ఇప్పిస్తారు. పుచ్చుకోండి,'' అన్నాడు మహేశ్‌.

ఇద్దరు భటులూ, సంతోషంగా తలలూపారు. ఒక భటుణ్ణి ముందుకు రమ్మని, కొరడా పట్టుకున్న వ్యక్తి పది దెబ్బలు కొట్టాడు. ఆ తరవాత రెండవ కాపలాభటుడు కుయ్యో మొర్రో అంటూ మిగిలిన పది కొరడాదెబ్బలూ తిన్నాడు. "ఈ క్షణమే, లంచగొండులైన మిమ్మల్ని, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాను,'' అన్న అక్బర్‌ చక్రవర్తి, మహేశ్‌ కేసి తిరిగి, "నువ్వు చాలా తెలివైనవాడివి.మీ బడిపంతులు చెప్పింది నిజం. నీ సమర్థత నిరూపించుకున్నావు. ఇప్పుడే నిన్నుపేరుతో నా ఆస్థానంలో ఉన్నత పదవిలో నియమిస్తున్నాను,'' అన్నాడు చిన్నగా ననవ్వు తూ.

రాజకుమార్తెలు

కర్మపూరు రాజయిన బోపదేవుడికి మగ పిల్లలు లేరు. ఇద్దరు కుమార్తెలు మాత్రం ఉన్నారు. వారు కవలపిల్లలు. కాని వారిలో ఒకతె తెల్లనిది. ఆమె పేరు శ్వేత. రెండవ పిల్ల నల్లనిది. ఆమె పేరు కృష్ణ. రంగులో తేడా ఉన్నా, ఇద్దరూ ఒకే పోలిక. ఇద్దరు పిల్లలూ చాలా గారాబంగా పెరిగి పదేళ్ళ వయసుగల వాళ్లయ్యారు.ఒకనాడు శ్వేతా, కృష్ణా ఉద్యానంలో నడుస్తూండగా, ఒక చెట్టు మీది నుంచి ఒక పక్షిగూడు వాళ్ళ కాళ్ళముందు పడింది. వాళ్ళు బెదిరిపోయి, పెద్ద పెట్టున ఏడవసాగారు. అది విని పరిచారకులు పరిగెత్తుతూ వచ్చి, పక్షిగూడు చూశారు. అందులో రెండు గుడ్లు ఉన్నాయి. పరిచారకులు ఆ గూటిని గుడ్లతో సహా మల్లెపొదలలో పారేసి, రాజకుమార్తెలను రాజభవనంలోకి తీసుకుపోయారు.

కాని భయంతో రాజకుమార్తెలకు జ్వరం తగిలింది. ఆస్థాన వైద్యుల చికిత్సలతో ఆ జ్వరం ఏమాత్రం తగ్గలేదు. ఒక రాత్రి రాజుకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో రాజు తన ఉద్యానవనంలో ఒక పంచరంగుల పక్షిని చూశాడు. ఆ పక్షి మనుష్యభాషలో రాజుతో ఇలా అన్నది:‘‘రాజా, నేను దేవతా పక్షిని. నేను ఈ తోటలో ఒక చెట్టుమీద గూడుకట్టి, అందులో రెండు గుడ్లు పెట్టాను. వాటిని పొదిగి పిల్లలను చేసి, నీ కుమార్తెలకు బహుమానంగా ఇద్దామనుకున్నాను. కాని, మూఢులైన నీ పరిచారకులు ఆ గుడ్లను మల్లెపొదలలో పారేశారు.''

‘‘నేను ఇప్పుడే ఆ గుడ్లను వెదికి తెప్పిస్తాను,'' అన్నాడు రాజు.‘‘అది ఇప్పుడు సాధ్యం కాదు. అవి చిట్లటమూ; వాటి నుంచి పిల్లలు బయటికి వచ్చి ఎగిరి పోవటమూ జరిగింది. అవి ఇప్పుడు నీ రాజ్యంలో పడమటగా ఉన్న కొండశిఖరం మీద ఉంటున్నాయి.నువ్వు స్వయంగా ఆ శిఖరం ఎక్కి, వాటిని తీసుకువచ్చి, వాటికి ఇంపుగా ఉండే ఆహారం పెట్టాలి. అవి తృప్తిపడితే నీకు రెండు గుడ్లు ఇస్తాయి. అయిదేళ్ళ అనంతరం ఆ గుడ్లు వజ్రాలుగా మారిపోతాయి. కొండశిఖరం ఎక్కి ఆ పక్షులను నువ్వు రాజభవనానికి తీసుకురాగానే నీ పిల్లల జ్వరం తగ్గిపోతుంది,'' అన్నది పక్షి.

‘‘ఆ కొండ శిఖరం నిటారుగా ఉంటుంది. దాన్ని ఎక్కటం అసాధ్యం. ఆ శిఖరం మీదికి ఎవరూ, ఎన్నడూ ఎక్కి ఉండలేదు,'' అన్నాడు రాజు.‘‘నువ్వు ఎలా ఎక్కుతావో నాకు తెలీదు. కాని నువ్వు ఆ పక్షులను తెచ్చేదాకా నీ పిల్లల జ్వరం ఎలాంటి చికిత్సలు చేసినా తగ్గదు. ఇంకొకటి ఏమిటంటే, గుడ్లు వజ్రాలుగా మారినప్పుడు ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి గులాబి రంగులో ఉంటుంది.

శ్వేత, గులాబి రంగుగల వజ్రాన్ని తీసుకోవాలి. కృష్ణ, తెల్లని వజ్రాన్ని తీసుకోవాలి. అలా చెయ్యకపోతే ఇద్దరికీ ప్రమాదమే,'' అని చెప్పి పక్షి మాయమయింది. బోపదేవుడు వెంటనే నిద్రలేచి, రాణికి తన కల గురించి చెప్పాడు. మర్నాడు ఉదయం ఆయన తన మంత్రులను సమావేశపరిచి. వారితో తన కల గురించి చర్చించాడు. వాళ్ళు ఏమీ చెప్పలేక పోయారు. రాజు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించాడు.

అకస్మాత్తుగా దేవుడి విగ్రహం కింది నుంచి ఒక ఉడుము ఇవతలికి వచ్చి, గోడ మీదికి పాకి, మళ్ళీ గోడ దిగి, రాజుకు సమీపంగా వచ్చి నిలిచింది. రాజపురోహితుడు రాజుతో, ‘‘మహారాజా, దేవుడు తమపట్ల అనుగ్రహించి, తమకు సహాయంగా ఉడుమును పంపాడు,'' అన్నాడు.‘‘ఇది నాకు ఎలా సహాయపడుతుంది, శాస్ర్తిగారూ?'' అన్నాడు రాజు. ‘‘అదే చూపింది గద! కోటగోడలలాటివి ఎక్కటంలో ఉడుములాటిది మరొకటి లేదు.దాని పట్టు అమోఘం. దాని నడుముకు తాడు కట్టి కొండశిఖరం మీదికి పంపితే, ఆ తాడు పట్టుకుని మీరు నిశ్చింతగా పైకి ఎక్కవచ్చు,'' అన్నాడు రాజపురోహితుడు ఎంతో నమ్మకంతో.ఎందుకైనా మంచిదని శిఖరం దిగువన బలమైన వలలు, రాజుగారు కింద పడితే దెబ్బ తగలకుండా, ఏర్పాటు చేశారు. ఉడుముకు మంచి బలమైన తిండి పెట్టారు.
ఒక రోజు ఉదయం రాజు తన ఖడ్గమూ, ఆహారమూ, నీరూ తీసుకుని సైనికులు వెంటరాగా కొండకు బయలుదేరాడు.ఉడుము నడుముకు తేలికగానూ, దృఢంగానూ ఉండే తాడు కట్టి, శిఖరం మీదికి పంపారు. అది పైకి చేరగానే ఇద్దరు సైనికులు తాడును లాగి పట్టుకున్నారు. వెంటనే ఉడుము రాతిని కరుచుకున్నది. ఇద్దరూ పట్టి లాగినా ఉడుము తన పట్టు వదలలేదు. తరవాత రాజు దైవధ్యానం చేసుకుని ఆ తాడు పట్టుకుని పైకి ఎక్కి వెళ్ళాడు. దిగువన రాజుగారి మనుషులూ, రాణీ భయపడుతూ నిలబడి ఉన్నారు.

రాజు శిఖరం మీదికి చేరేసరికి సూర్యుడు అస్తమించి, పూర్ణచంద్రుడు ఉదయించాడు. రాజు తాడును ఉడుము నడుము నుంచి ఊడదీసి, దాని కొసను ఒక బలమైన కొండరాయికి బిగించాడు. చంద్రకాంతిలో ఆయనకు ఒక పొట్టి చెట్టు కనబడింది. దాన్ని సమీపించేటప్పుడు ఆయనకు దాని మీద రెండు పక్షులు కనిపించాయి. ఆ చెట్టు మొదలును ఒక రెండు తలల పాము చుట్టుకుని ఉండి, ఆయనను చూసి తన రెండు పడగలూ విప్పి, నోళ్ళు తెరిచి, కోరలు బయటపెట్టింది. రాజు తన కత్తితో బలంగా కొట్టి, పాముతలలు నరికేశాడు.బోపదేవుడు చెట్టు మీది పక్షులనూ, ఉడుమునూ తీసుకుని శిఖరం దిగి కిందికి చేరేసరికి తెల్లవారవస్తున్నది. కింద ఉంచగానే, ఉడుము చిత్రంగా రెక్కలు పెంచుకుని, ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆయన పక్షులతో సహా ఇల్లు చేరుకునే సరికి రాజకుమార్తెలకు జ్వరం పోయింది. మర్నాడు పక్షులు రెండు గుడ్లు పెట్టి, మాయమైపోయాయి.రాజు ఆ గుడ్లను ఒక వెండిబుట్టలో ఉంచి, దాన్ని ఇనపపెట్టెలో భద్రం చేయించాడు. అయిదేళ్ళు గడిచాయి. శ్వేతా, కృష్ణా పెరిగి, పదిహేనేళ్ళవాళ్ళు అయ్యారు. రాజు ఇనపపెట్టె తెరవగానే దానినుంచి కాంతికిరణాలు వెలువడ్డాయి. గుడ్ల స్థానంలో రెండు వజ్రాలు ధగధగా మెరుస్తూ కనిపించాయి. ఒకటి తెల్లగా ఉన్నది. రెండోది గులాబి రంగుగా ఉన్నది. వాటిని రాజు బయటికి తీయించినప్పుడు రాజకుమార్తెలు అక్కడే ఉన్నారు.

రాజు వారితో, ‘‘అమ్మళ్ళూ, ఈ వజ్రాలు మీకే! ఇవి మీకు అదృష్టం కలిగిస్తాయి. ఏ వజ్రం ఎవరిది అన్న విషయం మీరు విచారించకండి. ఇవాళ సాయంకాలం మీ కిద్దరికీ తెల్ల సంపంగిపూలు కూజాల్లో పెట్టి ఇస్తాను. మీరు రోజూ ఆ పూలను గమనిస్తున్నట్టయితే, ఏ వజ్రం ఎవరిదో మీకే తెలిసిపోతుంది,'' అన్నాడు.ఆ రోజే ఆయన ఆస్థాన ఐంద్రజాలికుడైన మాయాపాలుణ్ణి రహస్యంగా తన అభ్యంతర మందిరానికి పిలిపించి, ‘‘వజ్రాలు వచ్చాయి. ఇక నీ ఇంద్రజాలం ప్రయోగించే సమయం వచ్చింది,'' అన్నాడు.‘‘అదంతా మీరే సులభంగా చెయ్యవచ్చు గదా, మహారాజా! శ్వేతకు ఇచ్చే తెల్ల సంపంగిపూల పాత్రలో కొంచెం ఎరస్రిరా కలిపి, పూలకాడలు అందులో ముణిగేటట్టు అమర్చటమే గదా! క్రమంగా పూల రెక్కలు వాటంతట అవే గులాబిరంగుకు మారతాయి. ఇదంతా రెండు రోజులకు ముందే మీకు వివరంగా చెప్పేశానుగా?'' అన్నాడు మాయాపాలుడు.‘‘చెప్పావనుకో, అయినా అది నీ చేతి మీదుగా జరిగితేనే బాగుంటుంది గదా!'' అన్నాడు రాజు. ఇద్దరూ నవ్వుకున్నారు.

ఆ రాత్రి శ్వేతకూ, కృష్ణకూ రెండు గుత్తుల తెల్ల సంపంగిపూలు పాత్రలతో సహా అందాయి. పాత్రల మీద ఇద్దరి పేర్లూ స్పష్టంగా రాసి ఉన్నాయి. వాళ్ళు ఆ పాత్రలను తమతమ గదులలో ఉంచుకుని, పూలను శ్రద్ధగా గమనిస్తూ వచ్చారు. కృష్ణకు ఇచ్చిన పూలు మొదట ఉన్నట్టే తెల్లగా ఉండి పోయాయిగాని, శ్వేత కిచ్చిన పూలు మర్నాటికే రంగు మారనారంభించాయి.
ఈ సంగతి తెలియగానే బోపదేవుడు తన కుమార్తెల వద్దకు వెళ్ళి, ‘‘అమ్మాయిలూ, ఏ వజ్రం ఎవరిదో ఇప్పుడు మీకు తెలిసింది గద?'' అంటూ పళ్ళెంలో ఉన్న వజ్రాలు చూపాడు. శ్వేత, గులాబీ వజ్రాన్ని తీసుకున్నది. కృష్ణ తెల్ల వజ్రాన్ని తీసుకున్నది. మాయాపాలుడి మాటా? ఎంతో గడ్డు సమస్యను తేలిగ్గా పరిష్కరించినందుకు అతనికి బోపదేవుడి నుంచి మంచి బహుమానమే లభించింది.