moral stories లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
moral stories లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19 అక్టోబర్, 2013

వ్యాపారి ధైర్యo

పూర్వం ఓ వ్యాపారి తన వస్తు సామాగ్రిని మరో దేశంలో అమ్మడానికి అనుచరులతో బయలుదేరాడు. దారిలో వారు ఒక ఎడారి చేరుకున్నారు. ఎండవేడిమికి ఇసుక కాలుతోంది. అలాంటప్పుడు అందులో ప్రయాణించడం దుర్లభం. అందరూ దిగాలు పడ్డారు. అరికాళ్లు బొబ్బలెక్కేటంత ఎండ మండిపోతోంది. ఎడ్లయినా, ఒంటెలైనా నడవడం చాలా కష్టం. అందునా వాళ్ల దగ్గర తగినన్ని మంచినీళ్లు లేవు. నీళ్లు లేకుండా ఎలా ప్రయాణం కొనసాగించాలా అని విచారించసాగారు. 

వ్యాపారి "నేనూ అధైర్యపడితే వీళ్లు మరీ నీరుగారిపోతారు. ఈ పరిస్ధితుల్లో ఇలా వదిలేయడం నాయకత్వమనిపించుకోదు. ఏదో ఒకటి చేయాలి. లేకుంటే సరుకులు, ఇంత శ్రమా వృధా అయిపోతుంది. వీళ్లని రక్షించే మార్గమేదైనా ఆలోచించాలి" అనుకున్నాడు.  కనుచూపుమేరలో గడ్డి పరకలు కనిపించాయి. "నీరు లేకుండా ఏ మొక్కా ఎడారిలోనైనా పెరగదుగదా" అనుకున్నాడు. వెంటనే తన అనుచరుల్లో చలాకీగా వున్న వారిని పిలిచి అక్కడ గొయ్యి తవ్వమన్నాడు. తవ్వగా తవ్వగా వాళ్లకి రాయి అడ్డు వచ్చింది. విసిగెత్తి నాయికుడిని తిట్టుకున్నారు. "ఇదంతా వృధాశ్రమ, సమయాన్ని వృధా చేస్తున్నాం!!" అన్నారు. కానీ వ్యాపారి మాత్రం "స్నేహితులారా, అలా నిరుత్సాహపడద్దు ప్రయత్నించండి. కాదంటే మనం, మన ఎడ్లు ఆకలిదప్పులతో నాశనమవుతాం... ఉత్సాహం కోల్పోవద్దు" అన్నాడు. 

అతను అలా అన్నాడో లేదో, రాయి పగిలి గుంట ఏర్పడింది. దానిపై వొంగి అతను చెవి పెట్టి దాని అడుగున నీటి రొద విన్నాడు. వెంటనే తవ్వుతున్న కుర్రాణ్ణి పిలిచి, "ఆగిపోకు, అందరూ ఇబ్బంది పడతాం... ఇదుగో ఈ గొడ్డలి తీసుకుని రాయిని బద్దలకొట్టు" అని ఉత్సాహపరిచాడు.  ఆ కుర్రాడు గొడ్డలితో బలంగా రాతిని కొట్టాడు. అది పగిలింది. వెంటనే ఎంతో వేగంగా నీరు పైకి రావడం చూసి ఆశ్చర్యపోయాడా కుర్రాడు. అంతా ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఆ నీటిని తాగారు, స్నానం చేశారు. పశువులకి స్నానం చేయించారు. వంట చేసుకుని తిన్నారు. 

అక్కడి నుంచి వాళ్లంతా బయలుదేరే ముందు అక్కడ నీళ్లున్నాయన్న సంగతి అందరికీ తెలిసేలా ఓ ధ్వజం పాతారు. సుదూర ప్రాంతాట నుంచి వచ్చే యాత్రికులకు అక్కడ ఎర్రటి ఎండతో మాడే ఎడారి మధ్యలో కొత్త నీటి వూట వుందన్నది తెలిసేలా చేశారు. వారి ప్రయాణం కొనసాగించి సురక్షితంగా ముగించారు.

అసమర్ధునికి అంత:పురం బాధ్యత

ప్రతాపవర్మ అనే రాజుకు వేట అంటే అమితమైన నినోదం. రాజ్య వ్యవహారాలకంటే వేటకే ఎక్కువ సమయాన్ని కేటాయించేవాడు. తరచుగా అడవికి వెళ్లి కొద్ది రోజుల పాటు వేటాడి ఆ వినోదం తీరాక రాజ్యానికి వచ్చేవాడు. అలాగే ఒకసారి అడవికి వెళ్తూ భద్రయ్య అనే పనివాడికి అంత:పురం బాధ్యతను అప్పగించాడు. అంత:పురాన్ని భద్రంగా చూసుకుంటానని మాటఇచ్చాడు భద్రయ్య. 

కొద్ది రోజులకు రాజు వేట సరదా తీరిన తర్వాత తిరిగి రాజ్యానికి వచ్చాడు. భద్రయ్య రాజుకు స్వాగతం పలికాడు. పరిచారికలు రాజుకు హారతి ఇచ్చి పాటలు పాడి ఆహ్వానించారు. అంతా సవ్యంగానే ఉందనుకుంటూ సంతోషించిన రాజు భద్రయ్యతో "భద్రయ్యా! అంతా క్షేమమేనా?" అని అడిగాడు. భద్రయ్య భద్రంగా తలూపుతూ "అంతా భద్రంగా ఉంది ప్రభూ" అని బదులిచ్చాడు. "రాణిగారెక్కడ?" అని అడిగాడు తన వేట ముచ్చట్లను అడిగి తెలుకోవడానికి. రాణి కనిపించలేదేమిటా! అని కలయచూస్తూ.  "యువరాజు గారిని చూడడానికి ఆస్దాన వైద్యుడి విడిదికి వెళ్లారు" అన్నాడు భద్రయ్య. 

"యువరాజు అక్కడ ఎందుకు ఉన్నారు? వారికి ఏమైది?" అన్నాడు రాజు.  "పొరుగు రాజ్యం యువరాజుతో తలపడినప్పుడు తీవ్రమైన గాయాలయ్యాయి ప్రభూ" అన్నాడు భద్రయ్య.  రాజు మనసు కీడు శంకించింది. "పొరుగు రాజ్యం యువరాజుతో ఎందుకు తలపడాల్సి వచ్చింది? ఏ ప్రమాదం మంచుకొచ్చింది" అన్నాడు.  "మన యువరాణి గారిని అపహరించుకుని వెళ్లడానికి వచ్చారు ప్రభూ, అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో మన యువరాజు గారు గాయపడ్డారు" అన్నాడు. 

"ఏమిటీ? మన యువరాణిని అపహరిద్దామని వచ్చారా? ఇంతకీ యువరాణిగారు ఎలా ఉన్నారు?" కంగారుగా అడిగాడు రాజు.  "అపహరించుకుని వెళ్లిపోయారు ప్రభూ! బహుశా రాక్షసంగా వివాహమాడి ఉండవచ్చు" వినయంగా సమాధానమిచ్చాడు భద్రయ్య. రాజు వినోదానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి రాజ్యవ్యవహారాలను పక్కన పెట్టాడు. ఆ పరిణామం రాజ్యానికే కాకుండా అంత:పురంలోని మహిళలకు రక్షణ కరువయ్యే పరిస్దితికి దారితీసింది. తన బాధ్యతను తాను నిర్వర్తించక పోవడం ఒక్కటే కాకుండా అసమర్ధుడికి అంతటి ప్రధాన బాధ్యతను అప్పగించడం వల్ల ఎంతటి అనర్ధం ముంచుకు వచ్చిందో అర్ధం చే్సుకున్నాడు. సరిదిద్దుకోలేని పొరపాటు జరిగిన తర్వాత కానీ ఆ రాజుకు తన బాధ్యత తెలిసి రాలేదు.

18 ఆగస్టు, 2012

కప్ప చెడు స్నేహం


ఒక కప్పా, పాము మంచి స్నేహితులుగా వుండేవి. కప్ప పాముకు కప్పకూత నేర్పించింది. పాము కప్పకు భుసకొట్టడం నేర్పించింది.పాము నీటిలోకి వెళ్ళి కప్పకూత కూస్తే చుట్టుపక్కల కప్పలు దాని దెగ్గిరకు వెళ్ళేవి. పాము చటుక్కున వాటిని తినేసేది.

కప్ప నీళ్ళల్లో భుస కొడుతుంటే దాని దెగ్గిరకు పాములు వచ్చేవి కాదు. కప్ప నిర్భయంగా వుండేది. ఇలా కొంత కాలం కొనసాగింది.కాల క్రమేణా పాము చేసే పని కప్పలకు తెలిసి అవి పాము దెగ్గిరకు వెళ్ళడం మానేసాయి. పాము తినడానికి యేమి లేక చిక్కి క్షీణించుకు పోయింది. ఆకలి తట్టుకోలేక తన స్నేహితుడైన కప్పను తినేసింది.

చెడు స్నేహం చేస్తే అది ఎప్పటికైన మనకే చేటు.

9 ఆగస్టు, 2012

రంగయ్య ఉపాయం

ఒక గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతని పొరుగింట్లో ఉండే సాంబయ్య కోళ్ళ వ్యాపారం చేసేవాడు. సాంబయ్య కోళ్ళు ప్రతిరోజూ రంగయ్య పెరడులోకి వచ్చేవి. రంగయ్య భార్య గింజలు ఎండకు ఆరబోస్తే, కావల సినంత తిని, కాళ్ళతో తొక్కి చెల్లాచెదురు చేసేవి. రంగయ్య రోజూ సాంబయ్యతో కోళ్ళను తన పెరడులోకి తోలవద్దని చెప్పేవాడు.‘‘అవి మనలాగ మనుషులా ఏమిటి? చెప్పిన మాట వినడానికి. మూగప్రాణులయ్యా! ఎటుపడితే అటు వెళ్తుంటాయి. మనమే జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ సాంబయ్య నిర్లక్ష్యంగా జవాబిచ్చేవాడు. 

కొన్నిరోజులు ఇలాగే గడిచాయి. ఒకరోజు సాంబయ్య పొరుగూరు సంతకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఇంట్లోకి వెళుతూ తన కోళ్ళ కోసం రంగయ్య ఇంటి పెరడులోకి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు.రంగయ్య నేల మీద అక్కడక్కడ పడున్న గుడ్లను ఒక బుట్టలోకి ఏరుకుంటున్నాడు. ‘‘రంగయ్యా! నీ దగ్గర కోళ్ళు లేవుగా! మరి ఈ గుడ్లు ఎక్కడివి?’’ అని అడిగాడు సాంబయ్య.‘‘ఇందాక నీ కోళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళాయి. బహుశ అవే పెట్టి ఉంటాయి’’ అంటూ అమాయకంగా జవాబు చెప్పి లోపలికి వెళ్ళి పోయాడు రంగయ్య. సాంబయ్య నోరు వెళ్ళబెట్టాడు. ఇక ఆరోజు నుండి అతను తన కోళ్ళు రంగయ్య పెరడులోకి వెళ్ళకుండా జాగ్రత్త పడ్డాడు. నిజానికి ఆ గుడ్లు సాంబయ్య కోళ్లు పెట్టినవి కావు. రంగయ్యే కోళ్ళ బెడద తప్పించుకోవడానికి అలా ఉపాయం పన్నాడు. 


16 ఏప్రిల్, 2012

రామయ్య ఉపాయం


ఒక ఊరిలో రామయ్య అనే అతను ఉండేవాడు.అతడు టోపీలు కుట్టుకుని పొరుగూరిలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో జీవితం గడిపేవాడు.ఒక రోజు ఎండలో తిరిగి టోపీలు అమ్మి అలిసిపోయి ,ఒక చెట్టు క్రిందకు వచ్చిటోపీల బుట్ట ప్రక్కన పెట్టి ఆ చెట్టు క్రిందే నిద్రపోయాడు.ఆ చెట్టుపైన చాలా కోతులు ఉన్నవి.

ఆకోతులునిద్రించు రామయ్య తలపైనున్న టోపీనీ చూసి క్రిందకు వచ్చిబుట్టలోనున్నా టోపీలనీ తీసుకొని తలా ఒకటొపీనీ పెట్టుకొని గంతులు వేస్తున్నవి కోతులు. ఇంతలో రామయ్యకు మెలకువ వచ్చి టోపీల బుట్టవైపు చూసాడు.బుట్టలోని టోపీలు ఏమైనవి అని చుట్టు కలియ చూసాడు.తన టోపీలు పెట్టుకొని చెట్టుపైన ఆడుతున్న కోతులను చూసి ఏమిచేయాలో తోచలేదు.కొంతసేపు ఆలోచించినతరువాత ఒక ఆలోచన తట్టింది.వెంటనే తన తలపైనున్న టోపీ తీసి వేసి నేలపై విసిరాడు.అది గమనించిన కోతులు వాటి తలలమీద టోపీలు తీసి నేలమీదకు విసిరాయి.వెంటనే  రామయ్య టోపీలన్ని ఏరీ బుట్టలో వేసుకొని తన దారినతాను వెళ్ళిపోయాడు.

నీతి: ఉపాయంతో సమస్యలు సాధించవచ్చు.
 

15 మార్చి, 2012

బంగారు పక్షి

అనగా అనగా ఒక ఊళ్ళో మల్లయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య సుబ్బమ్మ. ఒకరోజున, మల్లయ్య పొలానికి వెళ్తుండగా అతనికి ఒక బంగారు పక్షి కనబడ్డది. అది ఒక అరుగు మీద కూర్చొని ఉన్నది. మల్లయ్యకు దాన్ని చూస్తే ముచ్చట వేసింది. అయితే అదే సమయానికి గుంటనక్క ఒకటి పక్షి వెనకగా వచ్చి దాన్ని పట్టుకోబోయింది. మల్లయ్య వెంటనే తన చేతిలో‌ఉన్న కర్రను నక్కమీదికి విసిరేసాడు. బంగారు పక్షి ఉలిక్కిపడి చూసేసరికి, గుంటనక్క తన వెనుకనే ఉన్నది. వెంటనే అది ఎగిరిపోయింది; గుంటనక్క కూడా అడవిలోకి పరుగుతీసింది.

ఆ బంగారు పక్షి చాలా మంచిది. “నన్ను రక్షించినందుకు నీకు చాలా ధన్యవాదాలు మనిషీ” అనుకున్నది అది, తన మనసులో. మరుసటిరోజున అది మల్లయ్యకోసం అదే అరుగు మీద కూర్చొని ఎదురుచూసింది. కానీ‌ మల్లయ్య రాలేదు. ఎందుకంటే, మల్లయ్యకు ఆరోగ్యం‌ బాగా లేకుండింది. ఆ తరువాత మల్లయ్య రెండు రోజులు మాత్రమే బ్రతికాడు- తరువాత అతను చనిపోయాడు.

బంగారు పక్షి అతనికోసం ప్రతిరోజూ ఎదురుచూసేది. చివరికి అది మల్లయ్యను వెతుక్కుంటూ అతని ఇంటికి పోయింది. అప్పుడుగాని దానికి అర్థం కాలేదు- మల్లయ్య తనకు ఎందుకు కనబడలేదో. భర్త లేని సుబ్బమ్మను చూస్తే దానికి జాలి వేసింది. ఆనాటినుండీ అది ప్రతిరోజూ వచ్చి, మల్లయ్య ఇంటి ముందు ఒక బంగారు ఈకను వదిలి వెళ్ళటం మొదలు పెట్టింది.

సుబ్బమ్మ ఆ ఈకల్ని ఒక్కటొక్కటిగా ప్రక్క ఊళ్ళో అమ్ముకొనేది. ఒక్కొక్క బంగారు ఈకకు చాలా డబ్బులు వచ్చేవి. అంతలో బంగారు పక్షి మరిన్ని ఈకలు వదిలి వెళ్ళేది. అలా రానురాను సుబ్బమ్మ ఊళ్ళోకెల్లా ధనవంతురాలైంది.

సంపద పెరిగిన కొద్దీ సుబ్బమ్మకు ఆశకూడా హెచ్చింది. తనకు ఈకలు ఇస్తున్న బంగారు పక్షిని పట్టుకొని దాని ఈకలన్నిటినీ పీక్కోవాలని ఆమె కలలు కనటం మొదలు పెట్టింది. బంగారు పక్షికోసం మాటువేసి, ఆమె ఒకరోజున దాన్ని పట్టుకోబోయింది. చురుకుగా ఉన్న పక్షి, ఆమెనుండి తప్పించుకొని పారిపోయింది. సుబ్బమ్మ దానికోసం తరువాత చాలా రోజులపాటు ఎదురుచూసింది గానీ, అది ఇక తిరిగి అటువైపుకు రాలేదు.
ఆశపోతు సుబ్బమ్మకు మామూలుగా వచ్చే బంగారుఈక కూడా దొరకకుండా అయ్యింది!