31 జులై, 2013

తెనాలి రామలింగడి కథలు


ఒకసారి చైనా చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లనీ వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజ ప్రతినిధి దేవరాయులకు విన్నవించాడు.


పళ్లెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్లందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును వొలిచి నోట్లో వేసుకుని భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీ కృష్ణ దేవరాయలకు చెప్పనలవి కాని కోపమొచ్చింది. 

అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు. నా అనుమతి లేకుండా తీసుకున్నావ్... నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపకా నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావని? అడిగారు. నవ్వక ఏం చేయమంటారు? ప్రభూ.. ఏ పండ్లు తింటే మృత్యుంజయులవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు. 

మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా? అన్నాడు రామలింగడు నవ్వుతూ, ఈ మాటలతో రాయలకు నవ్వుమొలకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు. మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక , అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు.

దొంగకు రామలింగడు చేసిన మోసం


 తెనాలి రామలింగడి ఊళ్లో దొంగల భయం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజూ ఎవరో ఒకరి ఇంట్లో దొంగలుపడి దోచుకుంటూ ఉండేవారు. తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని అనుకున్నాడు రామలింగడు. దీంతో తన భార్యతో కలిసి ఒక ఉపాయం పన్నాడు.

ఒక తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి, దాన్ని గూట్లో పెట్టి, ఏమేం చేయాలో అన్ని భార్యతో చెప్పాడు రామలింగడు. సరిగ్గా ఆ రోజు రాత్రే ఒక దొంగ రామలింగడి ఇంట్లోకి జొరబడ్డాడు. ఇది గమనించిన ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు...

"ఏమేవ్...! మొన్న మా పెద్దన్న ఉంగరం తెచ్చి ఇచ్చాడు గదా... అది ఎక్కడ పెట్టావు" అని అన్నాడు. దీనికి ఆమె "ఏదీ ఆ వజ్రాల ఉంగరమేనా..? అయ్యో నా మతిమండా, అగ్గిపెట్టెలో పెట్టి గూట్లో ఉంచానండీ.. దాన్ని తీసి పెట్టెలో పెడదామని మర్చేపోయాను" అంది.

"ఎంతపని చేశావే. అదసలే లక్షల విలువ చేసే వజ్రాల ఉంగరం. అది కాస్తా ఏ దొంగో ఎత్తుకుపోయాడంటే మన గతేంకాను" అన్నాడు రామలింగడు. "ఏమీకాదుగానీ పడుకోండి. పొద్దున్నే పెద్ద పెట్టెలో పెట్టేస్తాగా..!" అంది భార్య. అంతే అంతటితో వాళ్లు నిద్రపోయినట్లుగా నటిస్తూ పడుకుండిపోయారు.

జరిగిందంతా విన్న దొంగ.. రామలింగడి దంపతులు గుర్రుపెట్టి నిద్రపోవడం గమనించి మెల్లిగా గూట్లో చెయ్యిపెట్టి అగ్గిపెట్టె అందుకున్నాడు. దాన్ని తెరిచి ఉంగరం కోసం వేలు పెట్టాడు. ఇంకేముంది. తేలు దొంగ వేలును కుట్టేసింది. దీంతో నొప్పికి తాళలేని దొంగ విలవిలాడిపోయాడు. అయినా కూడా చప్పుడు చేస్తే.. నలుగురూ వచ్చి తనను పట్టుకుంటారన్న భయంతో కిక్కురుమనకుండా మెల్లిగా జారుకున్నాడు.

ఇదంతా గమనిస్తూ ఉన్న రామలింగడి దంపతులు నవ్వుకున్నారు. అప్పుడు రామలింగడు తన భార్యతో... "మా పెద్దన్న ఉంగరం దొంగన్నకు బిర్రు అయినట్లుంది పాపం" అన్నాడు ఎగతాళిగా. దొంగకు రామలింగడు చేసిన మోసం తెలిసిపోయి.. ఇంకెప్పుడూ అతడింటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాడు.

30 జులై, 2013

ఎన్ని రూపాలలో ఉన్నప్పటికీ దేవుడు ఒక్కడే

ఒకరోజు అక్బర్‌ బీర్బల్‌ను ఇరుకున పెట్టాలనుకున్నాడు. ముస్లింలు అల్లాను, బౌద్ధులు బుద్ధుడిని, క్రైస్తవులు క్రీస్తును పూజిస్తారు మరి హిందువులు ఎందుకయ్యా అంతమంది దేవుళ్లను పూజిస్తారు? అని అడిగాడు. దానికి బీర్బల్‌ దేవుడు ఒక్కడే... రూపాలు అనేకం అన్నాడు. అదెలా సాధ్యం? అన్నాడు .

అక్బర్‌. చెబుతానంటూ బీర్బల్‌ ఒక సైనికుడిని పిలిచాడు. తలకు చుట్టుకున్న దానిని చూపి అదేమిటి అని అడిగాడు. 'తలపాగా' అన్నాడు సైనికుడు. దానిని విప్పి భుజంపై వేసుకోమన్నాడు. ఇప్పుడిదేమిటి అంటే 'కండువా' అన్నాడు. తరువాత దానిని నడుముకు చుట్టుకోమని ఇదేమిటీ అని అడగ్గా 'అంగీ' అన్నాడు. నీటిచుక్క ఆకాశంలో మేఘం రూపంలో ఉంటుంది. కిందపడితే నదిగా మారుతుంది. గడ్డకడితే మంచు అవుతుంది. చూశారా! మహారాజా వస్త్రం, నీటి చుక్కలు స్థలాన్ని బట్టి ఎన్ని రూపాలెత్తాయో? దేవుడూ అంతే అన్నాడు.

ఏ వృత్తీ చెడ్డది కాదు

అక్బర్‌కు అనేకమంది మంత్రులు ఉన్నారు. వారిలో ముల్లా దో పైజా అనే మంత్రి ఒకడు. ఒకరోజు అందరి ముందు బీర్బల్‌ను అవమానించాలని నిర్ణయించు కున్నాడు. ఆ రోజు వారిమధ్య సంభాషణ ఇలా జరిగింది.
'బీర్బల్‌ మీరు మంత్రిగాకముందు ఏం చేసేవారు? వ్యవసాయం, మా తండ్రి కూడా రైతే ! అయితే ఆయనెలా మరణించాడు? చలికాలంలో పొలం వెళ్లి అక్కడే మరణించారు. మరి మీ తాత? ఆయనా పొలంలోనే మరణించారు. నీరుందా లేదా అని చూస్తూ కాలుజారి బావిలో పడ్డారు. అందుకేనయ్యా నే చెబుతా వ్యవసాయం చాలా చెడ్డది.
అయితే ముల్లాజీ మీ కుటుంబ సాంప్రదాయ వృత్తేమిటి? మాది తరతరాలుగా సైనికుల కుటుంబం. అలాగా! అయితే మీ తండ్రి ఎలా మరణించారు? ఆయనో సైనికుడు. యుద్ధరంగంలోనే వీరమరణం పొందాడు. మరి మీతాత? ఆయనా యుద్ధంలోనే మరణించారు. అందుకే నేను చెబుతున్నా సైనిక జీవితం మీ కుటుంబానికి చెడ్డది. కనుక వేరే వృత్తి చూసుకోవటం మంచిది అన్నాడు బీర్బల్‌.
అప్పుడు ఏ వృత్తీ చెడ్డది కాదని ముల్లాకు అర్ధమైంది..

పరమ గయ్యాళి భార్య

అక్బర్ చక్రవర్తి భార్యలలో ఒక రాణి పరమ గయ్యాళి. ఆమె మీద అక్బర్‌కు చాలా ఫిర్యాదులు అందాయి.ఒకనాడైతే ఆమె అక్బర్‌తోనే చాలా మొరటుగా మాట్లాడింది. దాంతో ఆయనకు విపరీతమైన కోపం వచ్చి ‘‘నువ్వు వెంటనే మీ పుట్టింటికి వెళ్ళిపో’’ అని ఆజ్ఞాపించాడు. ఆవేశంలో ఏదో అంది కానీ, ఆయన వెళ్ళిపొమ్మనే సరికి ఒక్కసారిగా దుఃఖం పెల్లుబికి వచ్చింది. ‘‘నా మాటలకు, చేతలకు సిగ్గు పడుతున్నా. దయచేసి నన్ను క్షమించి మా పుట్టింటికి పంపొద్దు’’ అని వేడుకుందామె.


అక్బర్‌కు కూడా జాలి కలిగింది. కానీ, ఇచ్చిన ఆజ్ఞను ఉపసంహరించడం ఎట్లా? అందుకే, ‘‘నువ్వు వెళ్ళేటప్పుడు నీకు అన్నిటికంటే ఇష్టమైన దాన్ని తీసుకెళ్ళొచ్చు’’ అని కొంచెం సడలించాడు. చక్రవర్తి తనని క్షమించాడని తనకి అర్థమైంది. కానీ, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఆమెకు బీర్బల్ గుర్తుకొచ్చాడు. అతని సహాయం కోరాలనుకుంది. కానీ, ఆమె అతణ్ణి కూడా గతంలో ఎన్నోసార్లు దూషించింది. ఏ ముఖం పెట్టుకుని అడుగగలదు? ఏది ఏమైనప్పటికీ ఆమె అతనికి కబురు పంపించగానే వచ్చాడు.



‘‘బీర్బల్! నాకు నీ సహాయం అత్యవసరంగా కావాలి. కానీ, నిన్ను సహాయం అర్థించడానికి సిగ్గుపడుతున్నా’’ అంది పశ్చాత్తాపం నిండిన స్వరంతో. ‘‘బేగం సాహెబా! గతం మర్చిపోండి. దయచేసి నేను మీకు చేయగల సహాయం ఏంటో చెప్పండి’’ అన్నాడు బీర్బల్ సహృదయంతో. ఆమె జరిగిందంతా పూస గుచ్చినట్లు వివరించింది. బీర్బల్ అంతా విని కొంచెం సేపు ఆలోచించి ‘‘....ఇలా చేయండి’’ అని ఆమెకు గుసగుసగా చెప్పాడు. ఆ బేగం ఆ సలహాతో ఎంతో సంతోషించింది. తర్వాత ఆమె ఆ సాయంకాలం ‘తాను ఈ రాత్రికే వెళ్ళిపోతున్నానని, ఈ సాయంత్రం చివరిసారిగా తన ఆతిథ్యం స్వీకరించమని’ అక్బర్‌కు కబురు పంపింది.

ఆ ప్రకారమే ఆమె మందిరానికి వచ్చాడు అక్బర్. ‘‘నా సామాన్లన్నీ సర్దుకున్నాను. ఈ షర్బత్ మీ కోసం ప్రత్యేకంగా తయారు చేశాను. దయచేసి తాగండి’’ అని అడిగింది బేగమ్. బేగమ్ తన ఆజ ప్రకారం వెళ్ళిపోతున్నందుకు సంతోషించిన అక్బర్ ఆమె ఇచ్చిన షర్బత్ తాగాడు. కొద్దిసేపట్లోనే మైకం కమ్మినట్లై, మత్తుగా నిద్రపోయాడు.



అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న బేగమ్ నిద్రపోతున్న అక్బర్‌నూ పల్లకీలోకి చేర్చింది నౌకర్లతో. తాను కూడా ఎక్కి కూర్చొని పుట్టింటికి ప్రయాణమైంది. మరునాడు పొద్దున మెలకువ వచ్చిన అక్బర్‌కు పరిసరాలన్నీ కొత్తగా కనిపించటంతో ‘‘ఏంటిది? నేను ఎక్కడున్నాను?’’ అన్నాడు ఆశ్చర్యంగా. అతణ్ణి కనిపెట్టుకుని ఉన్న బేగం ‘‘మందిరంలోనే ఉన్నారు ప్రభూ!’’ అంది. ‘‘కానీ, ఇది మా మందిరం కాదే?’’ అన్నాడు అక్బర్ సందేహంగా కిటికీలోంచి బయటికి చూస్తూ. ‘‘ప్రభూ! మీరు నన్ను మా పుట్టింటికి నాకత్యంత ప్రీతిపావూతమైన దాన్ని తీసుకుని పొమ్మన్నారు కదా. నా కత్యంతం ఇష్టమైంది మీరే కాబట్టి, మిమ్మల్ని తీసుకుని మా పుట్టింటికి వచ్చాను’’ అంది. ఆ మాటలకు ఆయన కోపం పోయింది.బీర్బల్ తప్ప ఆమెకు ఇలాంటి సలహా మరెవరూ ఇచ్చి ఉండరని గ్రహించిన ఆయన నవ్వుకున్నాడు.

29 జులై, 2013

రెండు గాడిదల బరువు


ఒకరోజు ఉదయాన అక్బర్ యువరాజు సలీం మరియు బీర్బల్‌తో కలిసి వాహ్యాళికి వెళ్లాడు. అలా వారు నది ఒడ్డుకు వచ్చారు. అది ఎండాకాలం కావడంతో ఒక చెట్టునీడన కూర్చున్నారు.


కొద్దిసేపయ్యాక అక్బర్, ‘నదిలో స్నానం చేద్దామా?’ అన్నాడు. బీర్బల్ నీళ్లలో చెయ్యిపెట్టి చూసి, ‘అమ్మో, చాలా చల్లగా ఉన్నాయి. నేను మాత్రం చెయ్యను ప్రభూ’ అన్నాడు. అక్బర్, ‘సరే మంచిది. సలీం, నేనూ స్నానం చేస్తాము. నువ్వు ఇక్కడే ఉండి మా దుస్తులు పట్టుకో’’ అన్నాడు.



అలా అని అక్బర్, సలీం తమ తమ దుస్తులు విప్పి బీర్బల్‌కు ఇచ్చి నదిలో దిగి స్నానం చెయ్యసాగారు. అక్బర్, సలీంతో ‘‘బీర్బల్ ఒక మూర్ఖుడు. ఎండలో నిల్చుని మన బట్టలు మోస్తున్నాడు. నా కంటికి చాకలివాని గాడిదలా కనిపిస్తున్నాడు. 


ఇప్పుడొక తమాషా చేస్తా చూడు’’ అని‘‘ఏయ్! బీర్బల్, నువ్వొక గాడిద బరువు మోస్తున్నావు’’ అన్నాడు వ్యంగ్యంగా వెంటనే బీర్బల్, ‘‘కాదు ప్రభూ, రెండు గాడిదల బరువు మోస్తున్నా’’ అన్నాడు. అక్బర్ ముఖం మాడిపోయిoది

ఎద్దు పాలు


ఓ సారి అక్బర్ చక్రవర్తి- బీర్బల్‌ను ‘‘నాకొక గ్లాసుడు ఎద్దు పాలు కావాలి’’అని అడిగాడు. చక్రవర్తి అభ్యర్థన అసాధారణంగా వున్నా బీర్బల్ పైకి ఏమీ అనకుండా, ‘‘అలాగే సంపాదిస్తా ప్రభూ. కానీ నాకొక వారం రోజులు సమయమివ్వండి’’అని అడిగాడు. అలాగే  అన్నాడు అక్బర్.సాయంత్రం అయ్యాక ఇంటికెళ్ళాడు బీర్బల్. చక్రవర్తిగారు ఎద్దు పాలు తెమ్మని వారం రోజుల గడువుయిచ్చారు. కానీ అది అసాధ్యమైన పని. ఏం చెయ్యాలా?’ అని నిర్వేదంలో పడిపోయాడు.

అతని భార్య అది గమనించి, ‘‘ఏం జరిగింది?’’అని అడిగింది. జరిగిన సంగతి చెప్పాడు బీర్బల్. అది విని అతని భార్య పెద్దగా నవ్వింది. దాంతో ఆశ్చర్యపోవటం బీర్బల్ వంతయింది. ‘‘అదేమంత అసాధ్యం కాదు. ఏం చెయ్యాలో నేను చెబుతా, కానీ మీరు ఆరురోజుల దాకా ఇల్లు కదిలి వెళ్ళొద్దు’’ అందామె. ఆమె తెలివితేటల మీద అపారమైన నమ్మకం వున్న బీర్బల్ ‘‘అలాగే’’అని ఇంటి పట్టునే వుండిపోయాడు. అయిదురోజులు గడిచాయి. ఆరవ రోజు రాత్రి ఆమె ఒక పెద్ద గుడ్డలమోపు తీసుకుని రాజమందిరానికి వెళ్ళింది. ఆ పక్కనే వున్న సెలయేటిలో ఒక్కొక్క గుడ్డనీ ఉతకటం మొదలుపెట్టింది.

ఆ శబ్దానికి మేల్కొన్న అక్బర్ మేడ మీది వరండాలోకి వెళ్ళి ‘ఇంత రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నది ఎవరా?’అని చూసాడు. అంతేగాక ఆమెను తీసుకురమ్మని ఇద్దరు భటులను పంపించాడు. ‘‘ఏమ్మా.. యింత రాత్రి పూట బట్టలు ఉతుకుతున్నావెందుకు?-’’అని బీర్బల్ భార్యను ప్రశ్నించాడు అక్బర్. ‘‘ప్రభూ, ఆరురోజుల క్రితం నా భర్త ప్రసవించాడు. మా పనిమనిషి రాలేదు. అందుకే పనంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇంట్లో పనులన్నీ పూర్తిచేసుకునేసరికి చీకటి పడింది. అందుకే యింత రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నా’’అని జవాబిచ్చిందామె వినయంగా.

‘‘ఏంటి నువ్వనేది? మగవాడు ప్రసవించటం ఎలా సాధ్యం?’’అన్నాడు అక్బర్ ఆశ్చర్యంగా.ఆమె చిరునవ్వు నవ్వి, ‘‘ఇందులో ఆశ్చర్యపడేదేముంది? మీరు ఎద్దు పాలు కావాలని అడగగా లేనిది మగవాడు ఎందుకు ప్రసవించలేడు?’’ అంది. ఆమె మాటలలోని నిజాన్ని అర్థం చేసుకున్న అక్బర్ తల వూపాడు. మగవాడు ఎలా ప్రసవించలేడో, అలాగే ఎద్దుకూడా పాలను యివ్వలేదు. వెంటనే ఆయనకు బీర్బల్‌ను తాను అసాధ్యమైన కార్యం చెయ్యమని అడిగిన విషయం గుర్తుకొచ్చింది. ఆమె సమయస్ఫూర్తికి, తెలివి తేటలకు మెచ్చుకున్న అక్బర్- ఆమెకు అనేక విలువయిన కానుకలిచ్చి పంపించాడు.