21 మార్చి, 2012

నలదమయంతుల కలయిక


దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేశం విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఒకరోజులో విదర్భను చేరటం ఎలా? అనుకుని సారధి అయిన బాహుకుని పిలిచి "బాహుకా! దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. నాకు చూడాలని ఉంది. ఒక్కరోజులో మనం విదర్భకు వెళ్ళాలి. నీ అశ్వసామర్ధ్యం ప్రకటించు" అన్నాడు. సరే అని చెప్పినా బాహుకుడు మనస్సు కలతకు గురైంది. "నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టి కదా, దమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది. అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు, కాని అది నిజంకాదు. నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసింది. అని దుఃఖించాడు. 
"అయినా దమయంతి పతివ్రత. ఇద్దరుపిల్లల తల్లి. ఈ విధంగా రెండవ పెళ్ళి చేసుకుంటుందా? ఏమో? ఆ వింత చూస్తాను" అని మనసులో అనుకున్నాడు. వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణం అయ్యాడు. ఋతుపర్ణునికి రధం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రధంలా, బాహుకుడు అనూరుడిలా అనిపించింది. పక్కనే ఉన్న వార్ష్ణేయుడికి అదే సందేహం కలిగింది. "భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది, కాని ఈ కురూపి నలుడెలా ఔతాడు" అని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి, క్రింద పడింది "బాహుకా రధం ఆపు, వార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తీసుకు వస్తాడు" అన్నాడు. బాహుకుడు "మహారాజా! మనం ఆమడ దూరం వచ్చేసాం. అంతదూరం నడుచుకుంటూ ఎలా తీసుకు రాగలడు?" అన్నాడు.
   అతని రధ సారధ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది. అంతలో రధం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. ఋతుపర్ణుడు బాహుకునితో "బాహుకా ఆ వృక్షంలో ఎన్ని కాయలు, ఎన్ని పూలు, ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను " అని అన్నాడు. బాహుకుడు "చెప్పండి మహారాజా" అని అడిగాడు. ఋతుపర్ణుడు చెప్పాడు లెక్కించి చూస్తే కాని నమ్మను అని రధం ఆపి ఆ చెట్టుని పడగొత్తించి లెక్కించాడు. 
   ఋతుపర్ణుడు చిప్పిన లెక్కకు ఖచ్చితంగా సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. ఋతుపర్ణుడు "బాహుకా ఇది అక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రం" అన్నాడు. అప్పుడు బాహుకుడు "మహారాజా! ఇందుకు ప్రతిగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను" అన్నాడు.ఋతుపర్ణుడు "ఇప్పుడు కాదు, తరవాత అడిగి నేర్చుకుంటాను" అన్నాడు. అక్షహృదయ విద్య మహిమవలన నలునిలో నుండి కలి వెలుపలికి వచ్చాడు. తనను క్షమించమని నలుని వేడుకున్నాడు. నలుడు ఆగ్రహించి శపించబోయాడు. కలి నలునితో "నలమహారాజా! నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకడు కాటువేయడం వలన అనుక్షణం కాలి పోయాను. ఇంతకంటే శాపం ఏముంది, నన్ను క్షమించి విడిచిపెట్టు" అని వేడుకున్నాడు.
నలుని రధం విపరీతమైన ఘోషతో విదర్భలో ప్రవేశించింది. ఆ ఘోష విని, దమయంతి అది నలుని రధం అని గుర్తుపట్టింది. కాని రధంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది. భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది చూపాడు. ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి కనిపించ లేదు. బాహుకుడు రధాన్ని అశ్వశాలలో నిలిపి, సేదతీరాడు.
దమయంతి తన దాసితో "వచ్చింది ఋతుపర్ణ మహారాజు అతని సారధి వార్ష్ణేయుడు. వారు నాకు తెలుసు, కాని వారి వెంట ఉన్న కురూపి ఎవరు? అతనిని చూసి నా మనస పరవశించి పోతుంది. అతని వివరాలు తెలుసుకుని రా" అని పంపింది. దాసి నలుని వద్దకు వచ్చి "అయ్యా! రాకుమారి మీ యోగ క్షేమాలు కనుక్కుని రమ్మంది" అని చెప్పింది. నలుడు "మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదా, దానికి నేను మా మహారాజును ఒక్కరోజులో నూరు ఆమడల దూరం ప్రయాణించి తీసుకు వచ్చాను అని చెప్పు "అన్నాడు. "మీతో వచ్చిన మూడవ వ్యక్తి ఎవరు?" అని దాసి అడిగింది. 
నలుడు "అతడు వార్ష్ణేయుడు. ఇంతకు ముందు నలుని సారధి" అన్నాడు. దాసి "అతనికి నలుని జాడ తెలుసు కదా?" అని అడిగింది. నలుడు దాసితో "తనరాజ్యాన్ని పోగొట్టుకునేముందు నలుడు తన పిల్లలనిచ్చి వృష్ణేయిని విదర్భకు పంపాడు. ఆ తరవాత వార్ష్ణేయుడు ఋతుపర్ణుని వద్ద సారధిగా చేరాడు. నలుని గురించి నలునికి తెలియాలి, లేదా అతని భార్యకి తెలియాలి, వేరొకరికి తెలిసే అవకాశం లేదు" అన్నాడు బాహుకుడు. దాసి "అయ్యా! నలుడు తనను ప్రాణపదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు. దమయంతి నలుడు విడిచి వెళ్ళిన సగంచీర ధరించి కాలం గడుపుతోంది. ఆమెను ఇలా విడిచి వెళ్ళడం ధర్మమా?" అని అడిగింది. నలుని కంట నీరు పెల్లుబికింది. అది దాసికి తెలియకూడదని మొహం తిప్పుకున్నాడు. దమయంతికి దాసి జరిగినదంతా వివరించింది.
 దమయంతి దాసితో "సందేహం లేదు, అతడు నలుడే. అయినా ఈ వికృత రూపం ఏమిటి? అతను వంటవాడు అని చెప్పారు కనుక, వంట ఎలా చేస్తాడో పరీక్షించు" అని పంపింది. దాసి వెళ్ళి నలుని నిశితంగా పరిశీలించి "అమ్మా! అతను సామాన్యుడు కాదు. అతడు ఏ పని అయినా సునాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి. వంట పూర్తయే వరకు అలా మండుతున్నాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయి" అని దమయంతికి చెప్పింది. దమయంతి నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి "సందేహం లేదు, ఇవి నలుని వంటలే" అని గ్రహించి, దాసితో తన పిల్లలను నలుని వద్దకు పంపింది. నలుడు వారిని చూసి చలించి ఎత్తుకుని ముద్దాడాడు. దాసితో "అమ్మా! ఏమీ అనుకోవద్దు, వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు అందుకే అలాచేసాను. ఇక నువ్వు నా వద్దకు రావద్దు. ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. అయినా మేము విదేశాలనుండి వచ్చిన అతిధులం మాతో నీకేం పని?" అన్నాడు. ఇది విని దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్ళి "ఋతుపర్ణుని సారధిగా వచ్చిన కురూపి బాహుకుడే నలుడు. అమ్మా అతను ఇక్కడకు వస్తాడా, నేను అక్కడకు వెళ్ళాలా నువ్వే నిర్ణయించు" అని అడిగింది.
 భీమరాజు అనుమతితో ఆమె బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది. దమయంతి నలుని చూసి, "అయ్యా నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నట్టడవిలో నిర్డాక్షిణ్యంగా వదిలి వెళ్ళాడు. అలా సంతానవతినైన నన్ను విడిచి పెట్టడం ధర్మమా? అలా చేయడానికి నేనేమి అపకారం చేసాను? అగ్నిసాక్షిగా విడువను అని నాకు ప్రమాణం చేసిన భర్త అలా చేయవచ్చా?" అని దుఃఖించింది. నలుడు "సాధ్వీ! ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు. అందువలన నేను అలా చేసాను. జూదంలో సర్వం పోగోట్టుకుని బాధలు పడుతున్న నేను, నాతోపాటు బాధలు పడుతున్న నీ బాధను సహించ లేక, నిన్ను విడిచి వెళ్ళాను. అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటావని అలా చేసాను.
 నీపై అనురాగంతో మిమ్మల్ని చూడటానికే నేను ఇక్కడకు వచ్చాను. మరొక భర్తకోసం స్వయంవరం ప్రకటించడం కులస్త్రీలకు తగునా? అలా ఎందుకు చేసావు? అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు.ఇది ధర్మమా?" అని దమయంతిని అడిగాడు. దమయంతి "నాధా నేను మీకోసం గాలిస్తూ పంపిన విప్రులలో అయోధ్యకు వెళ్ళిన విప్రుడు మిమ్ములను గుర్తించాడు. మమ్మలిని రప్పించుటకే ఇలా చేసాను. మీరుకాక, ఇంకెవరు నూరు యోజమలు దూరం ఒక్క రోజులో ప్రయాణించగలరు? నాలో ఎటువంటి పాపపు తలపు లేదు అని మీ పాదములు అంటి నమస్కరించి ప్రమాణం చేస్తున్నాను" అని దమయంతి నలుని పాదాలకు నమస్కరించింది. వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు "నలచక్రవర్తీ! ఈమె పవిత్రురాలు, పతివ్రత. నేను, సూర్యుడు, చంద్రుడు ఈమె సౌశీల్యం కాపాడుతున్నాము" అని పలికాడు. నలుడు కర్కోటకుని స్మరించాడు వెంటనే ఒక వస్త్రం వచ్చింది. అది ధరించగానే నలునికి ఇంద్రతేజస్సుతో సమానమైన మనోహరమైన పూర్వరూపం వచ్చింది. దమయంతిని పరిగ్రహించాడు.
నలుడు విదర్భలో ఒక మాసం ఉండి, తన రాజధానికి వెళ్ళి పుష్కరుని కలిసాడు. నలుడు పుష్కరునితో "పుష్కరా!జూదమాడటం నీకు ప్రియం కదా. నేను నా భార్య దమయంతిని ఫణంగా పెడతాను, నీవు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడతావా? లేదా నాతో యుద్ధం చెయ్యి, ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం. నీకేది ఇష్టమో నిర్ణయించుకో" అన్నాడు. పుష్కరుడు జూదప్రియుడు పైగా ఒకసారి జూదమాడి గెలిచాడు కనుక అతడు నలునితో "నేను జూదమే ఆడతాను" అన్నాడు. నలుడు పుష్కరునితో జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడు. పుష్కరునితో "పుష్కరా, నేను ఇదివరకు నీతో జూదమాడినపుడు నన్ను కలి ఆవహించి ఉన్నాడు. కనుక ఓడి పోయాను, నీబలం వలన కాదు. నీవు నా పినతండ్రి కుమారుడివి కనుక, నిన్ను ఏమి చేయను వెళ్ళు" అని చెప్పి పంపాడు.

1 కామెంట్‌: