17 మార్చి, 2012

పీనాసి కనకయ్య


కనకయ్య వొట్టి  లోభి , ఎంతో ఐశ్వర్యం వుంది. అయినా తను తినేవాడు గాదు, ఒకరికి పెట్టేవాడు కాదు. కనకయ్య పీనాసి అని అందరికీ తెలుసు. అయినా ఊరిలోని వారు - ఏ కొంచెమైనా సహాయం చేయక పోతాడా? అని తరచుగా అతని వద్దకు వచ్చేవారు. సహాయం చేయమని కోరేవారు. కాని కనకయ్య వాళ్ళకు, ఏవేవో సాకులు చెప్పి పంపించేసే వాడు. గడ్డి పరక అంత సాయం కూడా చేసేవాడు గాదు.

"సహాయం చెయ్యి" అంటూ ఊరిలో వాళ్ళ పోరు, రోజురోజుకూ అధికం కావడం వల్ల - కనకయ్యకు చికాకు ఎక్కువైపోయింది. వాళ్ళ పోరు వదల్చు కోవాలని అనుకొన్నాడు. పొలాలు, నగలు మొదలైనవన్నీ అమ్మేసి, బంగారం కొన్నాడు. ఊరికి దగ్గరలో వున్న ఓ చిట్టడవిలో - ఎవరికీ కనపడని చోట - ఆ బంగారాన్ని భద్రంగా దాచి పెట్టాడు! రోజూ ఉదయమే లేచి తన బంగారం పాత్రను చూసుకోవడం కోసం అడవికి వెళ్ళి వస్తూండేవాడు - ఇలాగ కొన్నాళ్ళు దొర్లి పోయాయి.

కనకయ్య రోజూ అడవికి వెళ్ళి వస్తూ ఉండటం ఓ దొంగ కనిపెట్టాడు. రహస్యంగా ఆను పానులన్నీ గమనించాడు. ఓ నాడు సాయంత్రం అడవికి వచ్చి, పాత్రలోని బంగారాన్ని తవ్వుకొని పట్టుకొని పోయాడు. మరునాడు, ఉదయం, మాములుగా కనకయ్య అడవికి వచ్చి చూసుకొంటే - తాను పాతి పెట్టిన చోట బంగారం లేదు. కాళీ గొయ్యి కనపడింది. కనకయ్య గుండె బద్దలయినంత పని అయింది. బంగారాన్నంతా ఎవరో ఎత్తుకు పోయారని దుఃఖం పొంగి పొరలింది. లబలబా నెత్తీ నోరూ బాదుకొంటూ ఊరి బైటకు వచ్చి ఓ చెట్టు మొదట్లో కూర్చన్నాడు ఏడుస్తూ...

ఆ దారినే వెళుతున్న ఆ ఊరి ఆసామి ఒకడు - కనకయ్యను చాశాడు. "ఎందుకు ఏడుస్తున్నావు" అని అడిగి కారణం తెలిసికొని, అన్నాడు.

"ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బంగారం నీదగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడూ అనుభవించి ఎరుగని ఆ ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవడం ఎందుకు! ఆ బంగారం నీ దగ్గరవున్నా, లేకపోయినా ఒకటే! అనుభవించలేని ఐశ్వర్యం ఎందుకు? పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడు కొనడానికి అనేక అవస్ధలు పడ్డావు - ఇప్పుడు అది పోయింది కనుక నీ బాధ విరుగుడయింది. ఇక హాయిగా నిద్రపో..."
కనకయ్య ఏడుపు మాని 'నిజమే సుమీ' అనుకొంటూ ఇంటికి పోయాడు - కళ్ళు తుడుచుకొంటూ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి