విక్రమార్కుని ధైర్యసాహసాలు దానపరోపకారగుణాలు త్యాగనిరతి పేరుప్రతిష్ఠలు దిగ్దిగంతాలకు వ్యాపించినాయి. ఒకరోజు అవంతీరాజు ఒకభట్రాజు పద్యాల ద్వారా విక్రమాదిత్యుని గుణగణాలను విన్నాడు. ఇంత నీతిమంతుడు సత్యనిష్ఠుడు గుణాగ్రగణ్యుడు లోకంలో ఉంటాడా? అని అశ్చర్యమేసింది ఆయనకు. విక్రమార్కుని మీద కించిత్ అసూయపడి “నాకు విక్రమార్కుడంత కీర్తిప్రఖ్యాతులు ఎలావస్తాయి?” అని విచారించసాగినాడు. అదే ఆలోచిస్తూ పరాకుగా ఉండటం మొదలుపెట్టాడు.
ఒకరోజు అవంతీరాజు వద్దకు ఒక సన్యాసి వచ్చాడు. యథావిధిగా అతనిని పూజించి రాజు “స్వామి! విక్రమార్కుని గుణగణములు నేను ఒక భట్రాజు ద్వారా విన్నాను. ఆ విక్రముడంతటివాడు మీ భూమిమీదు లేడు. అట్టి యసస్సు నాకెలా వస్తుందో చెప్పండి” అని ప్రార్థించాడు. సన్యాసి “రాజా! నీకొక సూక్ష్మోపాయం చెబుతాను. హిమవన్నగర సమీపములో ఒక కాళికాలయం ఉన్నది. సిద్ధప్రదేశమైన ఆ ఆలయం వద్ద కొందరు యోగపురుషులు హోమక్రియలు చేస్తుంటారు. నీవక్కడికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి శుచివై ఆలయప్రాంతంలోకి ప్రవేశించు. గుండమొకటి త్రవ్వి కాళికాదేవికై హోమముచేసి చివరికి గుండములో దూకి నిన్ను నువ్వే పూర్ణాహుతి చేసుకో. దయాసాగరులైన ఆ యోగపురుషులు నిన్ను రక్షిస్తారు. నీ సాహసానికి మెచ్చి దేవి కరుణిస్తుంది” అని హితము చెప్పాడు.
సదాచారుడైన రాజు అటులనే చేశాడు. ప్రత్యక్షమైన కాళికాదేవితో “ప్రతిదినమూ ఏడుకోట్ల ధనం నాకు రావాలి” అని అడిగాడు. “నాయనా! ప్రతిరోజూ నీవు హోమంచేసి పూర్ణాహుతి నిచ్చినట్లయితే నీవు కోరుకున్నట్టే జరుగుతుంది” అని దేవి చెప్పి అంతర్ధానమయినది. అవంతీరాజు యోగపురుషులకు కృతజ్ఞతలు తెలిపి నగరానికి వచ్చి దేవి ఆజ్ఞానుసారం చేసి ప్రతిరోజూ ఏడుకోట్లు సంపాదించాడు. ఆ ధనముతో ఎన్నో అద్భుతమైన దానధర్మాలు చేసి దానకర్ణుడని ప్రఖ్యాతిని పొందినాడు.
విమలుడైన విక్రమాక్రుడు అవంతీరాజు యొక్క కీర్తిని విన్నాడు. తక్షణమే హిమవత్పర్వతములోని కాళికాలయానికి వెళ్ళి స్నానముచేసి శుచి అయ్యి ఆలయములో హోమముచేసి తన శరీరాన్ని పూర్ణాహుతి చేయబోగా కాళికాదేవి ప్రత్యక్షమై వరంకోరుకోమన్నది. కైలాశశిఖరమంత ఉన్నత హృదయం కల విక్రమాదిత్యుడు ఇలా కోరినాడు “గుణవంతుడైన అవంతీరాజు తన శరీరాన్ని పూర్ణాహుతిని చేయకుండానే ఆ ధనం అతనికి వచ్చేటట్టు దానితో అతడు మరిన్ని దానధర్మాలు చేసుకునేటట్టు అనుగ్రహించు తల్లీ”. దేవి విక్రమార్కుని త్యాగనిరతి చూసి “తథాస్తు” అని ఆశీర్వదించింది.
ఈ విషయం తెలుసుకున్న అవంతీరాజు విక్రమాదిత్యుని వద్దకు వచ్చి “రాజా! నీ వితరణశీలత అపూర్వము అద్వితీయము. నీవంటి సౌశీల్యుడైన రాజు యీ భువిలో పుట్టబోడు” అని స్తుతించి కృతజ్ఞతలను తెలుపుకొని వెళ్ళిపోయాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి