భారతదేశ చరిత్ర క్రీ.పూ. 326 వ సం.లో కొత్త మలుపు తిరిగింది. రాజ్యకాంక్షాపూరితుడైన యువవీరుడూ, సాహస ప్రియుడూ అయిన గ్రీకుదేశం మెసిడోనియా రాజు అలెగ్జాండర్ (356-323) మన దేశంపై దండయాత్ర చేసిన సంవత్సరం అది. తక్షశిల పాలకుడైన అంభి ఆయనకు సాదర స్వాగతం పలక కుండా ఉన్నట్టయితే, అలెగ్జాండర్ ను భారత భూభాగంపై పాదం మోపకుండా తరిమి కొట్టి ఉండవచ్చు.
అంభి ఆ చర్యకు కారణం అతిధుల పట్ల ఆదరభావం కాదు. జీలం నదీ తీరంలో సిరి సంపదలతో, శాంతి భద్రతలతో రాజ్యమేలు తూన్న తన పొరుగు రాజు పురుషోత్తముణ్ణి ఓడించాలన్న దురాశే అందుకు కారణం! పరాయి చక్రవర్తికి పాదాక్రాంతుడై, తాను దాసోహం అనడమే గాక, అంభి ఇరుగు పొరుగు రాజులనుసైతం, తన సభకు రప్పించి, అలెగ్జాండర్ ఆధిపత్యాన్ని అంగీకరించేలా చేయడానికి ప్రయత్నించాడు. చిన్నా చితక పాలకులు అందుకు సమ్మతించి తలలు ఒగ్గారు. |
అయితే, దైర్యశాలీ, మానధనుడూ అయిన పురుషోత్తముడు మాత్రం అందుకు అంగీకరించలేదు! ఆ కాలంలో మనరాజులు యుద్దాలలో గజబలాన్ని, అంటే ఏనుగులను ఉపయోగించేవారు. శిక్షణ పొందిన బ్రహ్మాండమైన ఆ జంతువులను ఎలాఎదుర్కోవాలో గ్రీకుసైనికులకు తెలియదు. అయితే, అంభి వారికి ఏనుగులను ఎదుర్కొనే పద్దతులను, మెళకువలను నేర్పి సాయపడ్డాడు. అలెగ్జాండర్ జీలంనదీ కేసి సేనలను నడిపించి నదీ తీరం చేరాడు. నదిని దాటడం అంత సులభంగా తోచలేదు. సైనికులు పడవలలో వెళ్ళేప్పుడు పురుషోత్తముడి సేనలు ఎదుర్కోవచ్చు.
అలెగ్జాండర్ కొన్నాళ్ళు అక్కడే బసచేసి తీవ్రంగా ఆలోచించసాగాడు. అంతలో అంభి అంతగా లోతులేని నదీ ప్రాంతాన్ని చూపాడు. వెంటనే అలెగ్జాండర్ ఒక పథకం ఆలోచించాడు. కొందరు సైనికులను పడవలలో నదిని దాటమని ఆజ్ఞాపించాడు. పడవలలో వస్తూన్న సైనికులను ఎదుర్కోవడంలోనే పురుషోత్తముడు గురిగా ఉన్న సమయంలో, అలెగ్జాండర్ సేనలు మరోవైపు నీళ్ళు తక్కువగా ఉన్న చోట నదిని దాటి అవలి తీరం చేరాయి.
అనూహ్యమైన ఈ పరిణామానికి దిగ్ర్భాంతి చెందిన పురుషోత్తముడు, మరుక్షణమే శత్రుసేనలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆ రోజంతా తన కన్నా ఎంతో బలమైన శత్రుసేనలతో సాహసోపేతంగా పోరాడాడు. ఇరవై వేలకు పైగా సైనికులు హతులయ్యారు. సూర్యాస్తమయ సమయానికి పురుషోత్తముడు గుర్రంపై ఒంటరిగా మిగిలాడు. అయినా, తనను బంధించడానికి వచ్చే శత్రుసైనికులను తెగ నరకడానికి సిద్ధమయ్యాడు. ఆయన అనుపమాన ధైర్య సాహసాలను ప్రత్యక్షంగా చూసిన అలెగ్జాండర్ ముగ్థుడయ్యాడు. లొంగిపొమ్మని అంభి ద్వారా సందేశం పంపాడు.
భయం భయంగా తనను సమీపించిన అంభిని చూడగానే, "దేశద్రోహీ! నీ ముఖం నాకు చూపకు. పారిపో, పిరికి పందా," అని పురుషోత్తముడు గర్జించాడు. మరికొంత సేపటికి పురుషోత్తముడు తీవ్రంగా గాయపడ్డాడు. నుదుటితో సహా శరీర మంతా నెత్తురోడుతున్న తొమ్మిది గాయాలు. అయినప్పటికీ బాధనూ, విషాదాన్నీ ఆయన ఏమాత్రం బయట పెట్టలేదు. అలెగ్జాండర్ దళనాయకులు ఆయన్ను చుట్టుముట్టి తమ రాజు వద్దకు నడిపించారు. క్షమాగుణం నలుసంత కూడా లేని తమ రాజు పురుషోత్తముణ్ణి వెంటనే శిరశ్ఛేదం చేయగలడనే గ్రీకు సైనికులు భావించారు. ఎందుకంటే శత్రవులను ఏమాత్రం ఉపేక్షించని కఠిన స్వభావం ఆయనది.
ఆయన రాజ్యకాంక్ష కలవాడు మాత్రమే కాదు; పరమ కోపిష్ఠి. ఒకసారి ఆయన మిత్రుడు అనారోగ్యాం పాలయ్యాడు. శీతల మద్యపానం, మాంసాహారం ముట్టుకోకూడదని వైద్యులు సలహా ఇచ్చారు. వైద్యుల సలహాను పెడచెవిని పెట్టడంతో అతడు మరణించాడు. మిత్రుడి మరణాన్ని భరించలేని అలెగ్జాండర్, ఆగ్రహంతో వైద్యులందరికీ మరణశిక్ష విధించాడు!
ఆంతేకాదు, మరణించిన తన మిత్రుడి ఆత్మకు ప్రేతాత్మల రూపంలో తోడుగా ఉంటారని ఆ గ్రామ ప్రజలందరినీ హతమార్చాడు. అలెగ్జాండర్ నిర్దాక్షిణ్యమైన కర్కశ స్వభావాన్ని చాటే సంఘటనలు ఇవి! అలెగ్జాండర్ తన పర్షియన్ జైత్రయాత్రలో ఎందరో రాజులను ఓడించాడు. అయినా, ఈ స్థితిలోనూ తనతో ద్వంద్వ యుద్ధానికి సుముఖంగా ఉన్నట్టు కనిపించిన పురుషోత్తముడి వంటి వీరుణ్ణి ఆయన ఎన్నడూ చూడలేదు. బందీగా నిలబడ్డ అతన్ని ఒకసారి మెచ్చుకుంటున్నట్టు చూశాడు. అంభి కుట్రలు, కుతంత్రాలు, ద్రోహ చింతనలు లేకుంటే అతడు ఓడేవాడు కాడని ఆయనకు తెలుసు! "పురుషోత్తమా! యుద్ధం ముగిసింది. నిస్సహాయుడుగా నిలబడి ఉన్నావు. నిన్నెలా చూడమంటావు?" అని అడిగాడు అలెగ్జాండర్. "అలెగ్జాండర్, నువ్వు న్యాయబద్ధమైన చక్రవర్తివే గనక అయితే, సాటి చక్రవర్తిని ఎలా గౌరవించాలో నీకే తెలుసు!" అన్నాడు పురుషోత్తముడు గంభీరంగా. "అవును. చక్రవర్తికి తగ్గ గౌరవంతో నిన్ను నడిపించాలి. మరింకే దైనా కోరుకుంటున్నావా?" అని అడిగాడు అలెగ్జాండర్ మళ్ళీ. "లేదు. నువ్వు నన్ను సాటి చక్రవర్తిగా గరవిస్తే, నాకు అవసరమై నవి సమస్తం అందులోనే సమకూరుతాయి కదా!" అన్నాడు పురుసోత్తముడు నిస్సంకోచంగా. ఆమాటకు అలెగ్జాండర్ ముగ్థుడయ్యాడు. పురుషోత్తముడి రాజ్యాన్నివశరచుకోకుండా వదిలిపెట్టాడు. పురుషోత్తముడు కనబరచిన అసమాన ధైర్యం, అచంచలమైన ఆత్మస్థైర్యం, అసాధారణ ఆత్మాగౌరవం అలెగ్జాండర్ ను అబ్బురపరచాయి. మనిషిలోని నిర్భీతి, ఉన్నత గుణాలు శత్రువులను సైతం ప్రభావితం చేస్తాయి! పరస్పర ఉదాత్త గుణాలతో పురుషోతముడు, అలెగ్జాండర్ ఉభయులూ పరమానందం చెందారు. అయితే, అంభి మాత్రం విషాదగ్రస్తుడయ్యాడు. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి